IND vs SA : కెప్టెన్ హోదాలో రిషభ్ పంత్ (Rishabh Pant) మళ్లీ టాస్ ఓడిపోయాడు. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్ ల్లోనూ టాస్ ఓడిన పంత్.. కీలకమైన మూడో మ్యాచ్ లోనూ ఓడిపోయాడు. టాస్ నెగ్గిన దక్షిణాఫ్రికా (South Africa) కెప్టెన్ తెంబా బవుమా (temba bavuma) ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కోవిడ్ బారిన పడ్డ మార్కరమ్ ఇంకా కోలుకోలేదు. అదే స్థానంలో రెండో టి20 ముందు గాయపడ్డ క్వింటన్ డికాక్ కూడా కోలుకోలేదు. దాంతో రెండో టి20లో ఆడిన టీంతోనే సౌతాఫ్రికా ఆడనుంది. ఇక అదే సమయంలో తొలి రెండు మ్యాచ్ ల్లోనూ ఓడిన టీమిండియా ఈ మ్యాచ్ లో మార్పులు చేస్తుందని అంతా భావించారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కోచ్ రాహుల్ ద్రవిడ్ మార్పుల్లేకుండానే బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. వైజాగ్ వేదికగా జరుగుతున్న ఈ మూడో టి20 భారత్ కు చావో రేవో లాంటిది. ఇందులో గెలిస్తేనే సిరీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. లేదంటే ఇక్కడితోనే తెరపడనుంది.
ఉమ్రాన్ మాలిక్ కు మళ్లీ నిరాశ
గత రెండు మ్యాచ్ ల్లోనూ భారత స్పిన్ ద్వయం యుజువేంద్ర చహల్, అక్షర్ పటేల్ దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. దాంతో అక్షర్ పటేల్ ను తప్పించి అతడి స్థానంలో ఉమ్రాన్ మాలిక్ లేదా అర్ష్ దీప్ లకు అవకాశం కల్పిస్తారని అంతా అనుకున్నారు. అదే సమయంలో దీపక్ హుడాకు కూడా తుది జట్టులో అవకాశం దొరుకుతుందని అంతా అనుకున్నారు. కానీ, అందరి ఆలోచనలకు విరుద్ధంగా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆలోచించాడు. ఎటువంటి మార్పులు లేకుండానే మూడో టి20లో బరిలోకి దింపేందుకు సిద్ధమయ్యాడు.ఇక మరోవైపు తొలి రెండు మ్యాచ్ ల్లోనూ నెగ్గిన సౌతాఫ్రికా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. ఇక కీలకమైన టాస్ ను నెగ్గడంతో ఆ జట్టు విజయావకాశాలు మరింత పెరిగాయి. భారత్ కనీసం 180 పరుగులకు పైగా స్కోరు సాధిస్తేనే గెలిచే అవకాశం ఉంటుందని మ్యాచ్ కామెంటేటర్లు పేర్కొనడం విశేషం.
టీమిండియా తుది జట్టు
రిషభ్ పంత్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్, యుజువేంద్ర చహల్
దక్షిణాఫ్రికా తుది జట్టు
క్లాసెన్ (వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, టెంబా బవుమా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, డుస్సెన్, వేన్ పార్నెల్, డ్వేన్ ప్రిటోరియస్, కగిసొ రబడ, కేశవ్ మహరాజ్, అన్రిచ్ నోర్ట్జె, తబ్రేజ్ షంసీ.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dinesh Karthik, Hardik Pandya, India, India vs South Africa, Rishabh Pant, Shreyas Iyer, South Africa, Team India