IND vs SA 3rd T20 : వరుస పరాజయాలకు టీమిండియా (Team India) బ్రేక్ వేసింది. సౌతాఫ్రికా (South Africa)తో ఆరంభమైన ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ లో జరిగిన తొలి రెండు మ్యాచ్ ల్లోనూ ఓడిన భారత్.. సిరీస్ ను కోల్పోయే పరిస్థతిలో నిలిచింది. అయితే వైజాగ్ వేదికగా జరిగిన మూడో టి20లో సమష్టిగా రాణించిన టీమిండియా దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. ఈ క్రమంలో నేడు రాజ్ కోట్ వేదికగా నాలుగో టి20 జరగనుంది. మూడో టి20లో గెలిచిన భారత్ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుండగా.. తిరిగి విజయాల బాట పట్టాలనే పట్టుదలతో సౌతాఫ్రికా ఉంది. ఈ క్రమంలో నేటి రాత్రి గం 7లకు ఆరంభమయ్యే నాలుగో టి20 క్రికెట్ ఫ్యాన్స్ కు పరుగుల పండుగ కానుంది.
ఓపెనర్లు మినహా..
ఈ సిరీస్ లో టీమిండియా తరఫున ఓపెనర్లు మినహా మిగిలిన వారు పెద్దగా రాణించలేదు. ఓపెనర్లుగా వస్తోన్న ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ మినహా మిగిలిన బ్యాటర్లు ఇప్పటి వరకు పెద్దగా తమ బ్యాట్ కు పనిచెప్పలేకపోయారు. పంత్ ఫామ్ భారత్ ను కలవరపెడుతోంది. 29, 5, 6.. పంత్ గత మూడు మ్యాచ్ ల్లో చేసిన స్కోర్లు ఇవి. ఇక అదే సమయంలో గత మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్ లు నిరాశ పరిచారు. హార్దిక్ పండ్యా ఫర్వాలేదనిపిస్తున్నాడు. ఇక బౌలింగ్ లో యుజువేంద్ర చహల్ మళ్లీ ఫామ్ లోకి రావడం భారత్ కు అనుకూల అంశం. అయితే అవేశ్ ఖాన్ రాణించడం లేదు. దాంతో అతడి స్థానంలో భారత్ మరో బ్యాటర్ తో ఆడే అవకాశం ఉంది.
డికాక్ కు చోటు
గాయంతో గత రెండు మ్యాచ్ లకు దూరమైన క్వింటన్ డికాక్.. ఈ మ్యాచ్ లో ఆడే అవకాశం ఉంది. తొలి టి20లో ఫర్వాలేదనిపించిన అతడు.. ఆ తర్వాత గాయం బారిన పడ్డాడు. దాంతో సౌతాఫ్రికా బ్యాటింగ్ బలంగా మారనుంది. తొలి టి20 హీరో రస్సీ వాన్ డెర్ డస్సెన్.. ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచ్ ల్లోనూ దారుణంగా విఫలం కావడం.. ఫీల్డింగ్ లో క్యాచ్ లను నేలపాలు చేస్తుండటం సౌతాఫ్రికాకు ప్రతికూల అంశాలు. అదే సమయంలో స్నిన్నర్లు కేశవ్ మహరాజ్, షంసీలు కూడా దారుణంగా విఫలమవుతున్నారు. వీటిని సరిచేసుకుంటేనే టీమిండియాపై సౌతాఫ్రికా గెలిచే అవకాశం ఉంది.
పిచ్ రిపోర్ట్
బ్యాటింగ్ కు అనుకూలించే వికెట్. దాంతో పరుగుల విందు ఖాయం. టాస్ గెలిచిన జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. అయితే వర్షం పడే అవకాశాలు తక్కువ.
తుది జట్ల (అంచనా)
భారత్: రిషభ్ పంత్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్, శ్రేయస్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్, హర్షల్, అవేశ్ ఖాన్/అర్ష్ దీప్ సింగ్, భువనేశ్వర్, చహల్.
దక్షిణాఫ్రికా: బవుమా (కెప్టెన్), డికాక్, వాన్ డెర్ డసెన్, మిల్లర్, క్లాసెన్, ప్రిటోరియస్, పార్నెల్, రబడ, కేశవ్, నోర్జే, షమ్సీ.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dinesh Karthik, Hardik Pandya, India, India vs South Africa, Rishabh Pant, Shreyas Iyer, South Africa, Team India