IND vs SA 2nd ODI : దక్షిణాఫ్రికా (South Africa)తో జరుగుతోన్న మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను భారత్ (India) సమం చేసింది. సిరీస్ లో నిలవాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్ లో టీమిండియా (Team India) బ్యాటింగ్ ను శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer), ఇషాన్ కిషన్ (Ishan Kishan)లు ముందుండి నడిపించారు. వీరిద్దరూ చెలరేగడంతో రాంచీ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్ 7 వికెట్లతో దక్షిణాఫ్రికాపై ఘనవిజయం సాధించింది. కష్టమైన పిచ్ పై 279 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 45.5 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 282 పరుగులు చేసి గెలుపొందింది. శ్రేయస్ అయ్యర్ (111 బంతుల్లో 113 నాటౌట్; 15 ఫోర్లు) శతకంతో చెలరేగాడు. ఇషాన్ కిషన్ (84 బంతుల్లో 93; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) త్రుటిలో శతకాన్ని మిస్ చేసుకున్నాడు. ఫలితంగా మూడు మ్యాచ్ ల సిరీస్ 1-1తో సమం అయ్యింది. ఇక సిరీస్ విజేతను ఢిల్లీ మ్యాచ్ తేల్చనుంది. ఈ మ్యాచ్ ఈ నెల 11న జరగనుంది.
ఓపెనర్లు మళ్లీ విఫలం
పిచ్ బౌలింగ్ కు సహకరిస్తుండటంతో దక్షిణాఫ్రికా చివరి ఓవర్లలో అనుకున్న స్థాయిలో పరుగులు సాధించలేకపోయింది. దాంతో భారత బ్యాటర్లు కూడా ఇబ్బంది పడతారని అంతా అనుకున్నారు. ఓపెనర్లుగా వచ్చిన శిఖర్ ధావన్ (13), శుబ్ మన్ గిల్ (28) మరోసారి విఫలం అయ్యారు. దాంతో భారత్ 48 పరుగులకే 2 వికెట్లను కోల్పోయి బ్యాక్ ఫుట్ లో ఉన్నట్లు కనిపించింది. అయితే ఈ దశలో క్రీజులో జతకలిసిన శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ లు జట్టును ఆదుకున్నారు. తొలి వన్డేలో విఫలమైన ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్ లో రెచ్చిపోయాడు. స్వేచ్ఛగా బ్యాట్ ను ఝుళిపించాడు. శ్రేయస్ అయ్యర్ నెమ్మదిగా ఆడితే.. ఇషాన్ మాత్రం వీరవిహారం చేశాడు. వీరిద్దరూ మూడో వికెట్ కు 161 పరుగులు జోడించారు. అయితే సెంచరీకి చేరువైన ఇషాన్ కిషన్ బౌండరీ లైన్ దగ్గర హెండ్రిక్స్ పట్టిన అద్భుత క్యాచ్ కు పెవిలియన్ కు చేరుకున్నాడు.
గత మ్యాచ్ హీరో సంజూ సామ్సన్ (28 నాటౌట్)తో కలిసి శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ ను ముగించేశాడు. ఈ క్రమంలో అయ్యర్ వన్డేల్లో రెండో సెంచరీని అందుకున్నాడు. చివర్లో బౌండరీ బాది జట్టును గెలిపించాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లకు 278 పరుగులు చేసింది. మార్కరమ్ (89 బంతుల్లో 79; 7 ఫోర్లు, 1 సిక్స్), రీజా హెండ్రిక్స్ (76 బంతుల్లో 74; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో రాణించారు. చివర్లో సూపర్ ఫామ్ లో ఉన్న డేవిడ్ మిల్లర్ (34 బంతుల్లో 35 నాటౌట్; 4 ఫోర్లు) ఒక బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. ఆరంభంలో బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్న పిచ్ ఆ తర్వాత స్లో అయ్యింది. పరిస్థితులను బట్టి చూస్తుంటే సౌతాఫ్రికా మంచి స్కోరునే సాధించింది. భారత బౌలర్లలో మొహమ్మద్ సిరాజ్ 3 వికెట్లతో రాణించాడు. అరంగేట్రం హీరో షాబాజ్ అహ్మద్ తో పాటు కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్ లు తలా ఒక వికెట్ సాధించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India vs South Africa, Mohammed Siraj, Ranchi, Sanju Samson, Shikhar Dhawan, Shreyas Iyer