వన్డే సిరీస్ లో న్యూజిలాండ్ (New Zealand) ను 3-0 తో మట్టికరిపించిన టీమిండియా (Team India) ఇప్పుడు ధనాధన్ పోరుకు రెడీ అయింది. హార్దిక్ నేతృత్వంలోని యంగ్ ఇండియా న్యూజిలాండ్ కు సవాల్ విసురుతుంది. ఈ సిరీస్ కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, షమీ, సిరాజ్ వంటి స్టార్ ఆటగాళ్లు అందుబాటులో లేరు. వారి విశ్రాంతినిచ్చింది బీసీసీఐ. అయితే.. కివీస్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ గాయంతో జట్టుకు దూరమయ్యాడు. హైదరాబాద్, మహారాష్ట్ర జట్ల మధ్య రంజీ మ్యాచ్ సందర్భంగా అతని మణికట్టుకు గాయమైంది. ఈ నేపథ్యంలో టీమిండియా తుది జట్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ ఏడాది మొదట్లో లంకతో జరిగిన టీ20 సిరీస్ లో గిల్, ఇషాన్ కిషన్ లు ఇద్దరూ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. మరోసారి ఈ ఇద్దరే.. టీమిండియా ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశం ఉంది. వన్డేల్లో పరుగుల వరద పారిస్తున్న గిల్.. ధనాధన్ ఫార్మాట్ లో తడబడుతున్నాడు. ఒకవేళ గిల్ బదులు.. వేరే ప్రత్యామ్నాయాన్ని ట్రై చేస్తే.. పృథ్వీ షా ఓపెనర్ గా బరిలోకి దిగే అవకాశం ఉంది. లేకపోతే పృథ్వీ షా బెంచ్ కే పరిమితమవ్వాల్సి ఉంది. ఇక, మూడో స్థానంలో రాహుల్ త్రిపాఠి ఆడనున్నాడు.
శ్రీలంకతో మూడో టీ20లో త్రిపాఠి మెరుపులు మెరిపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అతనికి మరో అవకాశం ఇవ్వనున్నారు. నాలుగో స్థానంలో టీ20 నెంబర్ వన్ బ్యాటర్ సూర్య బరిలోకి దిగనున్నాడు. వన్డేల్లో తుస్సుమన్పిస్తున్న సూర్యకు టీ20ల్లో తిరుగులేదు. తనకు ఇష్టమైన ఫార్మాట్ లో మరోసారి చెలరేగాలని భావిస్తున్నాడు మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్.
ఆల్‌రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా బరిలోకి దిగనున్నారు. శ్రీలంకతో సిరీస్‌లో ఈ ఇద్దరూ లోయర్ ఆర్డర్‌లో అదరగొట్టారు. ముఖ్యంగా హార్దిక్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. కెప్టెన్‌గా అతనిపై అదనపు బాధ్యతలు ఉన్న నేపథ్యంలో అటు బంతి, ఇటు బ్యాట్‌తో రాణించాల్సిన అవసరం ఉంది. ఇక దీపక్ హుడా సైతం బ్యాట్‌తో పాటు బంతితో రాణించాల్సిన అవసరం ఉంది. పృథ్వీ షా జట్టులోకి వస్తే మరో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ బెంచ్‌కే పరిమితం అవుతాడు. లేకుంటే సుందర్‌కు అవకాశం దక్కుతుంది.
బౌలింగ్ విభాగంలో కుర్రాళ్లు మరోసారి పరీక్ష ఎదురు కానుంది. బుమ్రా, సిరాజ్, షమీ, భువీ వంటి సీనియర్లు లేకపోవడంతో.. ఈ సిరీస్ కుర్రాళ్లకు మంచి అవకాశం కానుంది. అర్ష్ దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, శివమ్ మావిలు పేస్ బౌలింగ్ బాధ్యతలు మోయనున్నారు. అర్ష్ దీప్, ఉమ్రాన్, శివమ్ మావిలు వికెట్లు తీస్తున్నా.. భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. ఇక.. స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ తుది జట్టులో చోటు దక్కించుకోనున్నాడు. కివీస్ తో వన్డేల్లో కుల్దీప్ అదరగొట్టిన సంగతి తెలిసిందే.
టీమిండియా తుది జట్టు అంచనా :
ఇషాన్ కిషన్, గిల్/పృథ్వీ షా, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, శివమ్ మావి, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, Hardik Pandya, Ind vs Nz, India vs newzealand, Surya Kumar Yadav, Team India, Umran Malik