హోమ్ /వార్తలు /క్రీడలు /

Ind Vs Nz : కాన్పూర్ టెస్ట్ డ్రా అవ్వడంతో టీమిండియాకు భారీ నష్టం.. గెలిచి ఉంటే..!

Ind Vs Nz : కాన్పూర్ టెస్ట్ డ్రా అవ్వడంతో టీమిండియాకు భారీ నష్టం.. గెలిచి ఉంటే..!

Team India

Team India

Ind Vs Nz : ఈ మ్యాచ్‌లో చివరి క్షణం వరకు పోరాడిన భారత్.. విజయానికి వికెట్ దూరంలో నిలిచిపోయింది. ఆజాజ్ పటేల్(23 బంతుల్లో 2 నాటౌట్), రచిన్ రవీంద్ర(91 బంతుల్లో 18 నాటౌట్) అడ్డుగోడలా నిలబడటంతో భారత విజయం చేజారింది.

టీమిండియా - కివీస్ ల (Ind Vs Nz) మధ్య ఉత్కంఠగా జరిగిన తొలి టెస్ట్ ఫలితం తేలకుండానే ముగిసింది. ఆఖరి బంతి వరకు భారత్‌ (Team India) ను ఊరించిన విజయం తృటిలో చేజారింది. ఈ మ్యాచ్‌లో చివరి క్షణం వరకు పోరాడిన భారత్.. విజయానికి వికెట్ దూరంలో నిలిచిపోయింది. ఆజాజ్ పటేల్(23 బంతుల్లో 2 నాటౌట్), రచిన్ రవీంద్ర(91 బంతుల్లో 18 నాటౌట్) అడ్డుగోడలా నిలబడటంతో భారత విజయం చేజారింది. 4/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో సెకండ్ ఇన్నింగ్స్‌ను కొనసాగించిన న్యూజిలాండ్ ఆఖరి రోజు ఆట ముగిసేసమయానికి 98 ఓవర్లలో 9 వికెట్లకు 165 పరుగులు చేసి ఓటమిని తప్పించుకుంది. బ్యాడ్ లైట్ కారణంగా మరో 8 నిమిషాల ముందే అంపైర్లు మ్యాచ్‌ను నిలిపి వేసారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా (Ravindra Jadeja) నాలుగు, రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) మూడు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, ఉమేశ్ యాదవ్ చెరొక వికెట్ పడగొట్టారు. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ డిసెంబర్ 3 నుంచి ముంబై వేదికగా ప్రారంభం కానుంది. అయితే, ఈ టెస్ట్ కి విరాట్ కోహ్లీ (Virat Kohli) అందుబాటులోకి రానున్నాడు. ఈ మ్యాచుకి విరాట్ కోహ్లీనే కెప్టెన్.

అయితే గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో విజయంతో పాటు కీలక డబ్ల్యూటీసీ పాయింట్లను భారత్ చేజార్చుకుంది. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ 2021-23‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే 12 పాయింట్లు ఖాతాలో చేరేవి. కానీ డ్రా అవ్వడంతో ఇరు జట్ల ఖాతాలో చెరో 4 పాయింట్లు చేరాయి. ఈ చాంపియన్ షిప్‌లో భాగంగా ఆయా జట్లు స్వదేశంలో కొన్ని విదేశాల్లో మరికొన్ని మ్యాచ్‌లు ఆడుతాయనే విషయం తెలిసిందే.

అయితే స్వదేశంలో ఎంతో రికార్డు ఉన్న టీమిండియాకు ఇది నిజంగా నష్టమే. స్వదేశంలో జరిగే మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్ చేరేందుకు మార్గం సుగుమం అవుతుంది. మనకు అనుకూలమైన పరిస్థితుల్లో విజయాలు సాధించనప్పుడు.. విదేశాల్లో ప్రతికూలమైన పరిస్థితుల్లో గెలవడం కష్టం.

దీంతో, సొంతగడ్డపై గెలవడానికి జట్లన్నీ ప్రయత్నిస్తాయి. ఫస్ట్ ఎడిషన్ చాంపియన్‌షిప్‌లో సొంతగడ్డపై విజయాలు సాధించడం భారత్‌కు కలిసొచ్చింది. ఈ మ్యాచ్‌తో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్‌ రెండో స్థానానికి చేరుకుంది.

ఇది కూడా చదవండి : విరాట్ కోహ్లీ వస్తే రెండో టెస్టులో ఎవర్నీ పక్కనపెడతారు..? డేంజర్ లో స్టార్ ప్లేయర్ కెరీర్..!

తొలి డబ్ల్యూటీసీ టైటిల్‌ను సొంతం చేసుకున్న విలియమ్సన్‌ సేనకు.. 2021-23 ఎడిషన్‌లో ఇదే తొలి మ్యాచ్‌ అన్న సంగతి తెలిసిందే. భారత్‌ విషయానికొస్తే... ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ ఆడిన కోహ్లీ సేన.. ప్రస్తుతం స్వదేశంలో కివీస్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడుతోంది. ఇక స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు గెలిచిన శ్రీలంక(12 పాయింట్లు) ఫస్ట్ ప్లేస్ ఆక్రమించింది.

ఇది కూడా చదవండి : భారత్ లోనూ వర్ణవివక్ష.. జీవితాంతం ఎదుర్కొన్నానంటూ బాంబు పేల్చిన మాజీ క్రికెటర్..

శ్రీలంక ఆడింది ఒక్క మ్యాచ్ మాత్రమే. కానీ వారి విన్నింగ్ పర్సంటేజ్ 100 శాతంగా ఉంది. దీంతో ఫస్ట్ ప్లేస్ ఆ టీమ్ కు దక్కింది. టీమిండియా విన్నింగ్ పర్సంటేజ్ 50 శాతంగా మాత్రమే ఉంది. లంక తర్వాతి స్థానంలో భారత్, పాకిస్తాన్‌, వెస్టిండీస్‌, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌ ఉన్నాయి. ఇక 2021-23 ఎడిషన్‌లో భాగంగా భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య తొలి టెస్టు సిరీస్‌ జరిగిన సంగతి తెలిసిందే. అయితే, సిరీస్‌‌లోని మ్యాచ్‌లతో సంబంధం లేకుండా గెలిచిన ప్రతీ మ్యాచ్‌కు ఐసీసీ 12 పాయింట్లు, టై అయితే 6, డ్రా అయితే 4 పాయింట్లు కేటాయిస్తుంది.

First published:

Tags: Cricket, India vs newzealand, Sports, Team India

ఉత్తమ కథలు