IND vs NZ 3rd T20 : అహ్మదాబాద్ (Ahmedabad)ను పరుగుల సునామీ ముంచెత్తింది. టీమిండియా (Team India) యువ ఓపెనర్ శుబ్ మన్ గిల్ (Shubman Gill) బ్యాట్ నుంచి బౌండరీల వర్షంతో మైదానం తడిసి ముద్దైంది. టి20లకు పనికిరాడని చెప్పిన వారికి తన బ్యాట్ తో గిల్ సమాధానం చెప్పాడు. సిరీస్ విజేతను తేల్చే మూడో టి20లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. 20 ఓవర్లలో 4 వికెట్లకు 244 పరుగులు చేసింది. శుబ్ మన్ గిల్ (63 బంతుల్లో 126 నాటౌట్; 12 ఫోర్లు, 7 సిక్సర్లు) సెంచరీతో కదం తొక్కాడు. అంతర్జాతీయ టి20ల్లో గిల్ కు ఇదే తొలి శతకం. ఓవరాల్ గా భారత్ నుంచి అంతర్జాతీయ టి20ల్లో సెంచరీ చేసిన 7వ ప్లేయర్ గా నిలిచాడు. రోహిత్ శర్మ, సురేశ్ రైనా, రాహుల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీలు గిల్ కంటే ముందు ఈ ఘనతను అందుకున్నారు.
టాస్ గెలిచిన భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ఎంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఓపెనర్ ఇషాన్ కిషన్ (1) మరోసారి విఫలం అయ్యాడు. అయితే వన్ డౌన్ లో వచ్చిన రాహుల్ త్రిపాఠి (44)తో కలిసి భారత స్కోరు బోర్డును శుబ్ మన్ గిల్ పరిగెత్తించాడు. త్రిపాఠి ఉన్నంత సేపు ధనాధన్ షాట్లు ఆడాడు. అయితే భారీ షాట్ కు ప్రయత్నించి పెవిలియన్ కు చేరాడు. సూర్యకుమార్ యాదవ్ (24) నిరాశ పరిచాడు. ఇక్కడి నుంచి గిల్ ధనాధన్ బ్యాటింగ్ ను షురూ చేశాడు. 35 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన గిల్.. రెండో అర్ధ సెంచరీని చేయడానికి కేవలం 19 బంతులను మాత్రమే తీసుకున్నాడు. హార్దిక్ పాండ్యా (30)తో కలిసి జట్టు స్కోరును 200 మార్కును దాటించాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ టి20ల్లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్ గా గిల్ అవతరించాడు.
అండర్ 19 విజేతలకు సన్మానం
గత ఆదివారం దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్ 19 మహిళల ప్రపంచకప్ లో భారత్ విజేతగా నిలిచింది. తొలిసారి జరిగిన ఈ టోర్నీలో ఇండియన్ టీం విశ్వవిజేతగా నిలిచింది. షఫాలీ వర్మ నాయకత్వంలోని టీమిండియా ఫైనల్లో ఇంగ్లండ్ పై 7 వికెట్ల తేడాతో నెగ్గింది. ఈ క్రమంలో భారత్ కు చేరుకున్న యంగ్ చాంపియన్స్ ను బీసీసీఐ సన్మానించింది. మూడో టి20 ఆరంభానికి ముందు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ యంగ్ చాంప్స్ ను సత్కరించాడు.
తుది జట్లు
టీమిండియా
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), గిల్, ఇషాన్ కిషన్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, దీపక్ హుడా, శివమ్ మావి, అర్ష్ దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్
న్యూజిలాండ్
సాంట్నెర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, కాన్వే, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, బ్రేస్ వెల్, మార్క్ చాప్ మన్, ఇష్ సోధి, పెర్గూసన్, టిక్నర్, బెంజమిన్ లిస్టర్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hardik Pandya, Ind vs Nz, Ind vs nz t20 series, India vs newzealand, Shubman Gill, Surya Kumar Yadav