IND vs NZ 3rd T20 : భారత్ (India), న్యూజిలాండ్ (New Zealand) మధ్య జరుగుతున్న మూడో టి20 వర్షంతో ఆగిపోయింది. 160 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ వర్షంతో ఆట నిలిచిపోయే సమయానికి 9 ఓవర్లలో 4 వికెట్లకు 75 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా (18 బంతుల్లో 30 బ్యాటింగ్; 3 ఫోర్లు, 1 సిక్స్), దీపక్ హుడా (9 బంతుల్లో 9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. డక్ వర్త్ లూయిస్ ప్రకారం పార్ స్కోరు 9 ఓవర్లకు 75 పరుగులు. భారత్ 76 పరుగులు చేసి ఉంటే పరుగు తేడాతో గెలిచి ఉండేది. అయితే భారత్ సరిగ్గా 75 పరుగులు చేసింది. వర్షం తగ్గినా చిత్తడి అవుట్ ఫీల్డ్ కారణంగా మ్యాచ్ ను జరిపేందుకు అంపైర్లు నిరాకరించారు. దాంతో మూడో టి20 టైగా ముగిసింది. ఫలితంగా సిరీస్ ను భారత్ 1-0తో సొంతం చేసుకుంది. డక్ వర్త్ లూయిస్ పద్దతిని టై అయిన ఐదో మ్యాచ్ గా ఈ మ్యాచ్ నిలిచింది. గతంలో దక్షిణాఫ్రికా వర్సెస్ శ్రీలంక (2003 వన్డే ప్రపంచకప్), ఇంగ్లండ్ వర్సెస్ ఇండియా (2011 వన్డే మ్యాచ్), సౌతాఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ (2013 వన్డే చాంపియన్స్ ట్రోఫీ), గిబ్రల్టార్ వర్సెస్ మాల్టా (2021లో టి20 ఫార్మాట్) మ్యాచ్ లు డక్ వర్త్ లూయిస్ పద్దతిన టైగా నిలిచాయి.
160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఓపెనర్లు రిషభ్ పంత్ (11), ఇషాన్ కిషన్ (11) విఫలం అయ్యారు. ఇద్దరు కూడా చెత్త షాట్లతో తమ వికెట్లను పారేసుకున్నారు. గత మ్యాచ్ లో సెంచరీతో కదంతొక్కిన సూర్యకుమార్ యాదవ్ (13) ఈ మ్యాచ్ లో నిరాశపరిచాడు. శ్రేయస్ అయ్యర్ (1) గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు. ఈ దశలో హార్దిక్ పాండ్యా, దీపక్ హుడాలు జట్టును ఆదుకున్నారు. దీపక్ హుడా ధాటిగా బ్యాటింగ్ చేశాడు. 9 ఓవర్లు ముగిశాక వర్షం రావడంతో మ్యాచ్ నిలిచిపోయింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన కివీస్ 19.4 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌట్ అయింది. డేవాన్ కాన్వే (49 బంతుల్లో 59 పరుగులు ; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), గ్లెన్ ఫిలిప్స్ ( 33 బంతుల్లో 54 పరుగులు ; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. వీరిద్దరి ధాటికి భారీ స్కోరు దిశగా సాగిన కివీస్ ఇన్నింగ్స్ సిరాజ్, అర్షదీప్ ల ధాటికి ఒక్కసారిగా కుప్పకూలింది. ఆఖరి ఓవర్లలో ఆ జట్టు బ్యాటర్లు పరుగులు చేయడం పక్కన పెడితే.. పోటీ పడీ మరీ వికెట్లు సమర్పించుకున్నారు. మహ్మద్ సిరాజ్, అర్ష్ దీప్ నాలుగు వికెట్లతో దుమ్మురేపారు. హర్షల్ పటేల్ కి ఒక వికెట్ దక్కింది. సిరాజ్ అయితే నాలుగు ఓవర్లలో కేవలం 17 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. కేవలం 30 పరుగులు చేసి ఆఖరి ఎనిమిది వికెట్లు కోల్పోయింది న్యూజిలాండ్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hardik Pandya, Ind vs Nz, Ind vs nz t20 series, India vs newzealand, Mohammed Siraj, Team India