IND vs NZ 3rd ODI : మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా భారత్ (India), న్యూజిలాండ్ (New Zealand) జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డే వర్షం కారణంగా రద్దు అయ్యింది. 220 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ సరిగ్గా 18 ఓవర్లలో వికెట్ నష్టపోయి 104 పరుగులు చేసింది. ఈ క్రమంలో వర్షం రావడంతో మ్యాచ్ ను అంపైర్లు నిలిపివేశారు. ఆ తర్వాత వాన ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. వన్డేల్లో డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం విజేతను ప్రకటించాలంటే ఒక ఇన్నింగ్స్ పూర్తయ్యి.. రెండో ఇన్నింగ్స్ 20 ఓవర్లు పూర్తయ్యి ఉండాలి. అయితే మూడో వన్డేలో కివీస్ 18 ఓవర్లు మాత్రమే ఆడింది. మరో రెండు ఓవర్ల ఆట జరిగి ఉంటే మాత్రం కివీస్ గెలిచి ఉండేది. 18 ఓవర్లకే న్యూజిలాండ్ భారత్ కంటే 50 పరుగుల ఆధిక్యంలో నిలిచి ఉంది. ఫిన్ అలెన్ (54 బంతుల్లో 57 పరుగులు ;8 ఫోర్లు, 1 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. డేవాన్ కాన్వే (51 బంతుల్లో 38 పరుగులు నాటౌట్ ; 6 ఫోర్లు) అలెన్ కు చక్కటి సహకారం అందించాడు. సిరీస్ ను న్యూజిలాండ్ 1-0 తేడాతో కైవసం చేసుకుంది.
ఇక, అంతకుముందు టీమిండియా సాధారణ స్కోరుకే పరిమితమైంది. కివీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో 47.3 ఓవర్లలో 219 పరుగులకే ఆలౌట్ అయింది. వాషింగ్టన్ సుందర్ (64 బంతుల్లో51 పరుగులు ; 5 ఫోర్లు, 1 సిక్సర్), శ్రేయస్ అయ్యర్ (59 బంతుల్లో 49 పరుగులు ; 8 ఫోర్లు) రాణించారు. శిఖర్ ధావన్ (45 బంతుల్లో 28 పరుగులు ; 3 ఫోర్లు, 1 సిక్సర్) ఫర్వాలేదన్పించాడు. రిషబ్ పంత్ (10), శుభ్ మన్ గిల్ (13), సూర్యకుమార్ యాదవ్ (6), దీపక్ హుడా (12) విఫలమయ్యారు. ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్ చెరో మూడు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించారు. టిమ్ సౌతీ రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు. లూకీ ఫెర్గ్యూసన్, మిచెల్ శాంట్నర్ కు చెరో వికెట్ దక్కింది.
టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు. బౌలింగ్ కు అనుకూలించడంతో శిఖర్ ధావన్, గిల్ ఆచితూచి ఆడారు. వీలు చిక్కినప్పుడు బౌండరీలు బాదారు. అయితే.. సెట్ అవుతున్న ఈ జోడిని మిల్నే విడదీశాడు. 13 పరుగులు చేసిన గిల్ మిల్నే బౌలింగ్ లో ఔటయ్యాడు. దీంతో.. 39 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత శిఖర్ ధావన్ కూడా కాసేపటికే ఔటయ్యాడు. మిల్నే బౌలింగ్ లోనే 28 పరుగులు చేసి క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో.. 55 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత పంత్ (10) కూడా మరోసారి తన చెత్త ఫాంను కంటిన్యూ చేశాడు. టి20ల్లో రెచ్చిపోయిన సూర్యకుమార్ వన్డేల్లో మాత్రం మరోసారి తుస్పుమన్నాడు. వరుసగా వికెట్లు కోల్పోవడంతో టీమిండియ ఒక దశలో 200 పరుగులు చేయడం కూడా కష్టంగా కనిపించిందిి.అయితే వాషింగ్టన్ సుందర్ టీమిండియాను ఆదుకున్నాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ.. టెయిలండర్ల సాయంతో స్కోరు బోర్డును ముందుకు తీసుకువెళ్లాడు. ఈ క్రమంలో టీమిండియా స్కోరు 200 పరుగులు దాటింది. వాషింగ్టన్ సుందర్ తన హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. అయితే, హాఫ్ సెంచరీ తర్వాత భారీ షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు సుందర్. దీంతో.. 219 పరుగుల వద్ద టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ind vs Nz, Ind vs NZ ODI series, Kane Williamson, New Zealand, Shikhar Dhawan, Shreyas Iyer, Team India