టీమిండియా (Team India) ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్. అనుకున్నదే జరిగింది. డూ ఆర్ డై ఫైట్ లో టీమిండియాకు అడ్డుగోడగా నిలవడానికి వరుణుడు రెడీ అయ్యాడు. మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా క్రైస్ట్ చర్చ్ వేదికగా భారత్ (India), న్యూజిలాండ్ (New Zealand) జట్ల మధ్య మూడో వన్డే బుధవారం జరగనుంది. తొలి వన్డేలో కివీస్ జట్టు నెగ్గగా.. రెండో వన్డే వర్షంతో రద్దయ్యింది. ఇక, మూడో మ్యాచులో కూడా వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. దీంతో.. టాస్ మరింత ఆలస్యం కానుంది. ప్రస్తుతం పిచ్ ని కవర్లతో కప్పి ఉంచారు. ప్రస్తుతానికి భారీ వర్షం కురువడం లేదు. కానీ.. చిరు జల్లులు పడుతున్నాయి. ఒకవేళ వర్షం కారణంగా ఈ సిరీస్ ను న్యూజిలాండ్ కోల్పోయే అవకాశం అయితే లేదు. ఇక సిరీస్ ను సమం చేయాలంటే భారత్ తప్పనిసరిగా మూడో వన్డేలో నెగ్గాల్సి ఉంది. వర్షంతో రద్దయినా.. లేదా ఓడినా సిరీస్ కివీస్ వశం అవుతుంది.
భారత్, న్యూజిలాండ్ సిరీస్ కు వరుణుడు అడ్డుపడుతూనే ఉన్నాడు. వర్షం చినుకు లేకుండా ఒక్క మ్యాచ్ కూడా జరగలేదు. ఇప్పటి వరకు ఆడిన ప్రతి మ్యాచ్ కు కూడా వాన అడ్డుపడుతూనే ఉంది. టి20 సిరీస్ లో తొలి టి20 రద్దు కాగా.. మూడో టి20 వర్షంతో పూర్తిగా సాగలేదు. ఇక రెండో వన్డే వర్షంతో తుడిచిపెట్టుకుపోయింది. దీంతో ఈ పర్యటనలో చివరిదైన మూడో వన్డే అయినా సజావుగా సాగాలని అభిమానులు కోరుకుంటున్నారు.
క్రైస్ట్ చర్చ వేదికగా జరిగే ఈ మ్యాచ్ కు కూడా వాన గండం పొంచి ఉంది. ఈ డే అండ్ నైట్ మ్యాచ్ లో భారీ వర్షం కురిసే ఛాన్సులు లేకపోయినా.. చిరుజల్లులు అంతరాయం కలిగించే అవకాశం ఉందని నిపుణలు చెబుతున్నారు. దీంతో.. మరోసారి డక్ వర్త్ లూయిస్ మెథడ్ కీలకం కానుంది. డక్ వర్త్ లూయిస్ పద్దతిన మ్యాచ్ ఫలితం తేలాలంటే రెండో ఇన్నింగ్స్ లో కనీసం 20 ఓవర్ల ఆట పూర్తయ్యి ఉండాలి.
ఇక వర్షంతో మూడో వన్డే జరగకపోతే సిరీస్ కివీస్ వశం అవుతుంది. రెండో ఇన్నింగ్స్ లో వర్షం పడే అవకాశం ఉండటంతో టాస్ కీలకంగా మారనుంది. టాస్ నెగ్గిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
తుది జట్లు అంచనా :
టీమిండియా : శిఖర్ ధావన్ (కెప్టెన్), శుబ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, పంత్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చహర్, చహల్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్ దీప్ సింగ్
న్యూజిలాండ్ : ఫిన్ అలెన్, డేవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారిల్ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్, మైకేల్ బ్రెస్ వేల్, మ్యాట్ హెన్రీ, టిమ్ సౌతీ, లూకీ ఫెర్గ్యూసన్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, Ind vs Nz, India vs newzealand, Kane Williamson, Shikhar Dhawan