హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs NZ 3rd ODI : విజయం దిశగా న్యూజిలాండ్.. వరుణుడు రాకతో ఆగిన మ్యాచ్..

IND vs NZ 3rd ODI : విజయం దిశగా న్యూజిలాండ్.. వరుణుడు రాకతో ఆగిన మ్యాచ్..

PC : TWITTER

PC : TWITTER

IND vs NZ 3rd ODI : భారత్ సెట్ చేసిన 220 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేజ్ చేసే క్రమంలో 18 ఓవర్లలో వికెట్ నష్టానికి 104 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది న్యూజిలాండ్.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

క్రైస్ట్ చర్చ్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. న్యూజిలాండ్ లక్ష్యఛేదనలో 18 ఓవర్లు తర్వాత వర్షం ఎంట్రీ ఇవ్వడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. భారత్ సెట్ చేసిన 220 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేజ్ చేసే క్రమంలో 18 ఓవర్లలో వికెట్ నష్టానికి 104 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది న్యూజిలాండ్. విజయానికి న్యూజిలాండ్ మరో 116 పరుగులు చేయాల్సి ఉంది. ఫిన్ అలెన్ (54 బంతుల్లో 57 పరుగులు ;8 ఫోర్లు, 1 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అయితే, ప్రమాదకరంగా మారుతున్న అలెన్ ను ఉమ్రాన్ మాలిక్ ఔట్ చేశాడు. ప్రస్తుతం క్రీజులో డేవాన్ కాన్వే (51 బంతుల్లో 38 పరుగులు నాటౌట్ ; 6 ఫోర్లు), కేన్ విలియమ్సన్ (0 నాటౌట్) ఉన్నారు. అయితే, డక్ వర్త్ లూయిస్ పద్ధతి అమలు కావాలంటే కనీసం 20 ఓవర్ల మ్యాచ్ జరిగి ఉండాలి. దీంతో.. వర్షం కారణంగా మ్యాచ్ జరగకపోతే .. రద్దు చేస్తారు అంపైర్లు. అదే జరిగితే సిరీస్ ను 1-0 తేడాతో కైవసం చేసుకుంటుంది కివీస్.

ఇక, అంతకుముందు టీమిండియా సాధారణ స్కోరుకే పరిమితమైంది. కివీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో 47.3 ఓవర్లలో 219 పరుగులకే ఆలౌట్ అయింది. వాషింగ్టన్ సుందర్ (64 బంతుల్లో51 పరుగులు ; 5 ఫోర్లు, 1 సిక్సర్), శ్రేయస్ అయ్యర్ (59 బంతుల్లో 49 పరుగులు ; 8 ఫోర్లు) రాణించారు. శిఖర్ ధావన్ (45 బంతుల్లో 28 పరుగులు ; 3 ఫోర్లు, 1 సిక్సర్) ఫర్వాలేదన్పించాడు. రిషబ్ పంత్ (10), శుభ్ మన్ గిల్ (13), సూర్యకుమార్ యాదవ్ (6), దీపక్ హుడా (12) విఫలమయ్యారు. ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్ చెరో మూడు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించారు. టిమ్ సౌతీ రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు. లూకీ ఫెర్గ్యూసన్, మిచెల్ శాంట్నర్ కు చెరో వికెట్ దక్కింది.

టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు. బౌలింగ్ కు అనుకూలించడంతో శిఖర్ ధావన్, గిల్ ఆచితూచి ఆడారు. వీలు చిక్కినప్పుడు బౌండరీలు బాదారు. అయితే.. సెట్ అవుతున్న ఈ జోడిని మిల్నే విడదీశాడు. 13 పరుగులు చేసిన గిల్ మిల్నే బౌలింగ్ లో ఔటయ్యాడు. దీంతో.. 39 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత శిఖర్ ధావన్ కూడా కాసేపటికే ఔటయ్యాడు. మిల్నే బౌలింగ్ లోనే 28 పరుగులు చేసి క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో.. 55 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత పంత్ (10) కూడా మరోసారి తన చెత్త ఫాంను కంటిన్యూ చేశాడు.

డారిల్ మిచెల్ బౌలింగ్ లో అనవసరపు షాట్ కు యత్నించి పెవిలియన్ బాట పట్టాడు. టీ20 ల్లో అదరగొట్టిన సూర్య ఇక్కడ మాత్రం తుస్సుమన్పించాడు. ఆరు పరుగులు చేసి సూర్య మిల్నే బౌలింగ్ లో పెవిలియన్ బాట పట్టాడు. మరో ఎండ్ లో శ్రేయస్ అయ్యర్ చూడచక్కని షాట్లతో అలరించాడు. అయితే, హాఫ్ సెంచరీ దిశగా సాగుతున్న శ్రేయస్ జోరుకు లూకీ ఫెర్గ్యూసన్ బ్రేకులు వేశాడు. 49 పరుగులు చేసిన శ్రేయస్.. కాన్వేకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.దీంతో, 121 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది భారత్.

అయితే.. 200 పరుగులు చేయడం కూడా కష్టమనుకున్న వేళ వాషింగ్టన్ సుందర్ టీమిండియాను ఆదుకున్నాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ.. టెయిలండర్ల సాయంతో స్కోరు బోర్డును ముందుకు తీసుకువెళ్లాడు. ఈ క్రమంలో టీమిండియా స్కోరు 200 పరుగులు దాటింది. వాషింగ్టన్ సుందర్ తన హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. అయితే, హాఫ్ సెంచరీ తర్వాత భారీ షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు సుందర్. దీంతో.. 219 పరుగుల వద్ద టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది.

తుది జట్లు :

టీమిండియా : శిఖర్ ధావన్ (కెప్టెన్), శుబ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, పంత్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చహర్, చహల్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్ దీప్ సింగ్

న్యూజిలాండ్ : ఫిన్ అలెన్, డేవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారిల్ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్, అడమ్ మిల్నే, మ్యాట్ హెన్రీ, టిమ్ సౌతీ, లూకీ ఫెర్గ్యూసన్

First published:

Tags: Cricket, Ind vs Nz, India vs newzealand, Kane Williamson, Shikhar Dhawan, Team India

ఉత్తమ కథలు