IND vs NZ 2nd T20 : సిరీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ లో టీమిండియా (Team India) బౌలర్లు రాణించారు. న్యూజిలాండ్ (New Zealand)తో జరిగిన తొలి టి20లో ఓడిన భారత్ (India).. సిరీస్ నెగ్గాలంటే రెండో టి20లో తప్పక నెగ్గాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో లక్నో వేదికగా జరుగుతున్న రెండో టి20లో భారత బౌలర్లు సగం పనిని పూర్తి చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన కివీస్ ను భారత స్పిన్నర్లు తిప్పేశారు. దాంతో న్యూజిలాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 99 పరుగులు చేసింది. కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నెర్ (23 బంతుల్లో 19 నాటౌట్; 1 ఫోర్) టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ 2 వికెట్లు తీశాడు. యుజువేంద్ర చహల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా తలా ఒక వికెట్ సాధించారు. మ్యాచ్ లో కివీస్ ఒక్క సిక్సర్ కూడా కొట్టలేదంటే భారత బౌలర్లు ఏ రేంజ్ లో బ్యాటర్లను కట్టడి చేశారో తెలుస్తుంది. కేవలం 6 ఫోర్లను మాత్రమే న్యూజిలాండ్ బ్యాటర్లు సాధించారు.
టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ స్లోగా ఉండటంతో స్పిన్నర్లకు సహకరించింది. దాంతో చెలరేగిన భారత స్పిన్నర్లు కివీస్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టారు. రెండు ఫోర్లు కొట్టి దూకుడు మీద కనిపించిన ఫిన్ అలెన్ (11)ను యుజువేంద్ర చహల్ పెవిలియన్ కు పంపాడు. కాసేపటికే డెవోన్ కాన్వే (11)ను వాషింగ్టన్ సుందర్ అవుట్ చేశాడు. గ్లెన్ ఫిలిప్స్ (5)ను దీపక్ హుడా బౌల్డ్ చేశాడు. ఇక తొలి టి20 హీరో డారిల్ మిచె ల్ (8)ను కుల్దీప్ అద్భుత బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు.
ఈ సమయంలో మార్క్ చాప్ మన్ (14), బ్రేస్ వెల్ (14) కాసేపు భారత బౌలర్లను ప్రతిఘటించారు. వీరు సింగిల్స్ తీస్తూ వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. అయితే తొందరపడి మార్క్ చాప్ మన్ రనౌట్ అయ్యాడు. భారీ షాట్ కు ప్రయత్నించి బ్రేస్ వెల్ బౌండరీ లైన్ దగ్గర అవుటయ్యాడు. ఆఖర్లో సాంట్నెర్ సింగిల్స్ కే పరిమితం అయ్యాడు. దాంతో కివీస్ 99 పరుగులకు ముగించింది.
తుది జట్లు
న్యూజిలాండ్
అలెన్ ఫిన్, కాన్వే, గ్లెన్ ఫిలిప్స్, చాప్ మన్, డారిల్ మిచెల్, బ్రేస్ వెల్, సాంట్నెర్, ఫెర్గూసన్, డఫీ, సోధి, టిక్నర్
టీమిండియా
ఇషాన్ కిషన్, శుబ్ మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యదవ్, హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, శివమ్ మావి, అర్ష్ దీప్, కుల్దీప్ యాదవ్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hardik Pandya, Ind vs Nz, Ind vs nz t20 series, Shubman Gill, Surya Kumar Yadav, Team India