IND vs NZ 2nd ODI : మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా భారత్ (India)తో జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్ (New Zealand) జట్టు కుప్పకూలింది. రాయ్ పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 34.3 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌటైంది. మొహమ్మద్ షమీ 3 వికెట్లతో కివీస్ పతనానికి బాటలు వేశాడు. హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్ చెరో రెండు వికెట్ల చొప్పున తీశారు. సిరాజ్, కుల్దీప్ యాదవ్, శార్దుల్ ఠాకూర్ లు తలా ఒక వికెట్ తీశారు. కివీస్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్ (52 బంతుల్లో 36; 5 ఫోర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు.
రెండో వన్డేలో టాస్ నెగ్గిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పిచ్ పై పచ్చిక ఎక్కువగా ఉండటంతో పాటు రెండో ఇన్నింగ్స్ సమయంలో డ్యూ వచ్చే అవకాశం ఉండటంతో భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తమ కెప్టెన్ సరైన నిర్ణయమే తీసుకున్నాడని భారత బౌలర్లు నిరూపించారు. తొలి ఓవర్ వేసిన షమీ.. డేంజరస్ ఫిన్ అలెన్ (0)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. కాసేపటికే నికోల్స్ (2)ను సిరాజ్ బోల్తా కొట్టించాడు. 20 బంతులు ఎదుర్కొన్న నికోల్స్ 2 పరుగులు మాత్రమే చేశాడు. డారిల్ మిచెల్ (1) ఇచ్చిన రిటర్న్ క్యాచ్ ను షమీ పట్టేయడంతో కివీస్ 3వ వికెట్ ను కోల్పోయింది.
కాసేపటికే డెవోన్ కాన్వే (7)ను అద్భుతమైన రిటర్న్ క్యాచ్ తో హార్దిక్ పాండ్యా అవుట్ చేశాడు. ఆ తర్వాత కెప్టెన్ టామ్ లాథమ్ (1)ను శార్దుల్ ఠాకూర్ పెవిలియన్ కు పంపాడు. దాంతో న్యూజిలాండ్ 15 పరుగులకే 5 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఈ దశలో తొలి వన్డే హీరో బ్రేస్ వేల్ (22; 4 ఫోర్లు) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. గ్లెన్ ఫిలిప్స్ తో కలిసి కాసేపు భారత బౌలర్లను ప్రతిఘటించాడు. ఈ క్రమంలో కొన్ని చూడచక్కటి షాట్లను ఆడాడు. దాంతో కివీస్ 50 మార్కును దాటింది. బ్రేస్ వెల్, ఫిలిప్స్ 6వ వికెట్ కు 41 పరుగులు జోడించారు. అయితే బౌలింగ్ కు వచ్చిన షమీ.. బౌన్సర్ తో బ్రేస్ వెల్ ఆటను ముగించాడు. దాంతో 56వ పరుగు వద్ద న్యూజిలాండ్ 6వ వికెట్ ను కోల్పోయింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన సాంట్నెర్ (27) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఫిలిప్స్, సాంట్నెర్ లు 7వ వికెట్ కు 47 పరుగులు జోడించారు. అయితే ఇక్కడి నుంచి భారత్ మరోసారి వరుస పెట్టి వికెట్లు తీసి కివీస్ ఆటను ముగించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hardik Pandya, Ind vs Nz, Ind vs NZ ODI series, India vs newzealand, Mohammed Shami, Mohammed Siraj, Rohit sharma