IND vs NZ 1st ODI : మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా అక్లాండ్ వేదికగా న్యూజిలాండ్ (New Zealand)తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ (India) భారీ స్కోరును అందుకుంది. భారత ఓపెనర్లు శిఖర్ ధావన్ (Shikhar Dhawan), శుబ్ మన్ గిల్ (Shubman Gill), శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)లు రెచ్చిపోయారు. దాంతో భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 306 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (77 బంతుల్లో 72; 13 ఫోర్లు) క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. శుబ్ మన్ గిల్ (65 బంతుల్లో 50; 1 ఫోర్, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీతో ధావన్ కు సహకరించాడు. శ్రేయస్ అయ్యర్ (76 బంతుల్లో 80; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మంచి ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో వాషింగ్టన్ సుందర్ (16 బంతుల్లో 37 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రెచ్చిపోవడంతో టీమిండియా భారీ స్కోరును అందుకుంది. ఈ పర్యటనలో తొలి వన్డే ఆడుతున్న సంజూ సామ్సన్ (38 బంతుల్లో 36; 4 ఫోర్లు) రాణించాడు.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు ధావన్, గిల్ శుభారంభం చేశారు. చాలా రోజుల తర్వాత టీమిండియా తరఫున పరిమిత ఓవర్ల మ్యాచ్ ఆడుతున్న వీరిద్దరూ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. తొలుత కుదురుకోవడానికి సమయాన్ని కేటాయించిన వీరు ఆ తర్వాత రెచ్చిపోయారు. ముఖ్యంగా శిఖర్ ధావన్ తనలోని పాత గబ్బర్ ను బయటకు తెచ్చాడు. బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఇక మరో ఎండ్ లో ఉన్న గిల్ సిక్సర్ల మోత మోగించాడు. వీరిద్దరూ తొలి వికెట్ కు 124 పరుగులు జోడించారు. అయితే ఇదే స్కోరు వద్ద గిల్, ధావన్ పెవిలియన్ కు చేరారు. ఈ దశలో క్రీజులో జతకలిసిన రిషభ్ పంత్ (15), శ్రేయస్ అయ్యర్ జట్టును నడిపించే ప్రయత్నం చేశారు. అయితే పంత్ మరోసారి నిరాశ పరిచాడు. సూర్యకుమార్ యాదవ్ (4)కూడా నిరాశ పరిచాడు. దాంతో 124/0తో పటిష్టంగా ఉన్న భారత్ 24 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో సంజూ సామ్సన్ తో కలిసి శ్రేయస్ అయ్యర్ జట్టును ఆదుకున్నాడు. వీరిద్దరూ ఐదో వికెట్ కు 94 పరుగులు జోడించారు. భారీ షాట్ కు ప్రయత్నించి సామ్సన్ పెవిలియన్ కు చేరాడు.
ఇక చివర్లో వాషింగ్టన్ సుందర్ రెచ్చిపోయాడు. టి20 షాట్లు ఆడుతూ జట్టుకు భారీ స్కోరును అందించాడు. 200లకు పైగా స్ట్రయిక్ రేట్ తో ఆడుతూ బౌండరీల వర్షం కురిపించాడు. సెంచరీ చేసేలా కనిపించిన అయ్యర్ ఆఖరి ఓవర్లో భారీ షాట్ కు ప్రయత్నించి పెవిలియన్ కు చేరాడు. కివీస్ బౌలర్లలో టిమ్ సౌతీ, లూకీ ఫెర్గూసన్ చెరో మూడు వికెట్లు తీశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ind vs Nz, Ind vs NZ ODI series, India vs newzealand, Rishabh Pant, Sanju Samson, Shikhar Dhawan, Shreyas Iyer, Team India