IND vs NZ 1st ODI : మరో వన్డే సిరీస్ కు టీమిండియా (Team India) సిద్ధమైంది. శ్రీలంక (Sri Lanka)పై వన్డే సిరీస్ ను వైట్ వాష్ చేసిన రెండు రోజుల అనంతరం మరో టఫ్ ఫైట్ కు భారత్ రెడీ అయ్యింది. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ (ODI World Cup) ఉండటంతో టీమిండియా వరుస పెట్టి సిరీస్ లను ఆడనుంది. ఈ క్రమంలో న్యూజిలాండ్ (New Zealand)తో మూడు మ్యాచ్ ల సిరీస్ కు సిద్ధమైంది. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో బుధవారం తొలి వన్డే జరగనుంది. మ్యాచ్ మధ్యాహ్నం 1.30 గంటలకు ఆరంభం కానుంది. తొలి మ్యాచ్ లో నెగ్గి సిరీస్ లో ఆధిక్యంలోకి వెళ్లాలని ఇరు జట్లు కూడా పట్టుదలగా ఉన్నాయి. నెట్స్ లో తీవ్రంగా చెమటోడుస్తున్నాయి.
మార్పులతో భారత్
శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో ఆడిన జట్టులో భారత్ చాలా మార్పులు చేసింది. పెళ్లి కారణంగా కేఎల్ రాహుల్ ఈ సిరీస్ కు దూరమయ్యాడు. కుటుంబపర కారణంతో యంగ్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కూడా ఈ సిరీస్ కు దూరమయ్యాడు. ఇక చివరి నిమిషంలో వెన్ను గాయం బారిన పడ్డ శ్రేయస్ అయ్యర్ కూడా ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ స్థానంలో రజత్ పటిదార్ టీమిండియాలో చోట దక్కించుకున్నాడు. రిషభ్ పంత్ కారు ప్రమాదం కారణంగా ఈ ఏడాది క్రికెట్ కు దూరమయ్యాడు. సంజూ సామ్సన్ ఈ సిరీస్ కు ఎంపిక కాలేదు. దాంతో ఇషాన్ కిషన్ కు బ్యాకప్ వికెట్ కీపర్ గా తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్ ను ఎంపిక చేశారు. అయితే శ్రీకర్ భరత్ కు వన్డే సిరీస్ లో అవకాశం వచ్చేది అనుమానంగానే ఉంది.
ఇక ఈ మ్యాచ్ లో భారత్ ముగ్గురు పేసర్లు, ఇద్దరు ఆల్ రౌండర్లు, ఒక స్పిన్నర్, ఐదుగురు బ్యాటర్లు (వికెట్ కీపర్ తో కలిపి) ఫార్ములాతో బరిలోకి దిగే అవకాశం ఉంది. శ్రీలంకతో మూడో వన్డేకు దూరమైన ఉమ్రాన్ మాలిక్ తిరిగి తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అక్షర్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ బరిలోకి దిగతాడు. రాహుల్ లేకపోవడంతో వికెట్ కీపర్ గా ఇషాన్ కిషన్ కు ప్లేస్ ఖాయం. బంగ్లాదేశ్ తో జరిగిన మూడో వన్డేలో డబుల్ సెంచరీ చేసిన తర్వాత ఇషాన్ కిషన్ ఆడుతున్న తొలి మ్యాచ్ ఇదే కావడం విశేషం. విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్ లో ఉండటం.. శుబ్ మన్ గిల్ టచ్ లో ఉండటంతో ఈ సిరీస్ లో భారత్ ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది. ఇక కేన్ విలియమ్సన్ లేకుండానే న్యూజిలాండ్ ఈ సిరీస్ ఆడేందుకు భారత్ కు వచ్చింది. టామ్ లాథమ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.
టీమిండియా తుది జట్టు (అంచనా)
రోహిత్ శర్మ (కెప్టెన్), గిల్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, షమీ, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ind vs Nz, Ind vs NZ ODI series, India vs newzealand, Mohammed Shami, Mohammed Siraj, Rohit sharma, Surya Kumar Yadav, Team India, Virat kohli