ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ (India Vs England) మధ్య శుక్రవారం నుంచి ప్రారంభం కావాల్సిన ఆఖరి టెస్ట్ రద్దయింది. భారత జట్టులో కరోనా కలకలం (Corona Effect) రేగడంతో ఇరు దేశాల క్రికెట్ బోర్డుల పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. భారత్ పూర్తి జట్టును బరిలోకి దింపే పరిస్థితిలో లేదని ఇంగ్లండ్ బోర్డు ప్రకటించగా... ప్లేయర్ల ఆరోగ్యభద్రతే తమకు అన్నింటి కంటే ముఖ్యమని బీసీసీఐ ప్రకటించింది. అయితే ఈ పరిస్థితి రావడానికి హెడ్ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri), కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli Latest Telugu News)నే కారణమని సోషల్ మీడియా వేదికగా అభిమానులు దుమ్మెత్తిపోశారు. బయో బబుల్ నిబంధనలు బేఖాతరు చేస్తూ రవిశాస్త్రి తన 'స్టార్ గేజర్' పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించాడు. ఈ బుక్ లాంచింగ్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు ఇతర ఆటగాళ్లు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమం జరిగిన కొద్ది రోజులకే నాలుగో టెస్ట్ ముందు రవిశాస్త్రి వైరస్ బారిన పడగా.. ఆ తర్వాత అతనికి సన్నిహితంగా ఉన్న బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్, ఫిజియో నితిన్ పటేల్ పాజిటీవ్‌గా తేలారు.
అనంతరం ఫిజియో యోగేశ్ పర్మార్ కరోనా వచ్చింది. దీంతో భారత్ తప్పిదాన్ని ఈసీబీ ఎత్తిచూపుతోంది. రవిశాస్త్రి, విరాట్ కోహ్లీ ఆ పబ్లిక్ ఈవెంట్‌కి కనీసం ఈసీబీ నుంచి పర్మీషన్ కూడా తీసుకోలేదట. అయితే, తనపై వస్తున్న విమర్శలపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు రవిశాస్త్రి.
అయితే రవిశాస్త్రి మాత్రం ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఏర్పాట్లపైనే విమర్శలు చేయడం విశేషం... ‘ఇంగ్లాండ్ మొత్తంలో ఎలాంటి ఆంక్షలు లేవు, కచ్ఛితంగా మాస్క్ ధరించాలనే నిబంధనలు కూడా లేవు. క్రీజులోకి ఫ్యాన్స్ దూసుకువస్తుంటే ఏం చేశారు... కేవలం నా బుక్ లాంఛింగ్ ప్రోగ్రామ్ వల్లే కరోనా వచ్చిందా... ఇంత స్వేచ్ఛ ఉన్నప్పుడు వైరస్ ఎలాగైనా సోకి ఉండొచ్చు.’ అంటూ కామెంట్ చేశాడు రవిశాస్త్రి. ఆ పాపం అంతా.. ఇంగ్లండ్ బోర్డుదే అన్నట్లు ఉన్నాయ్ రవిశాస్త్రి వ్యాఖ్యలు.
ఇండియా, ఇంగ్లాండ్ సిరీస్‌లో జార్వో ఇంగ్లీష్ జాతీయుడు, ఏకంగా మూడు సార్లు మైదానంలోకి దూసుకొచ్చిన విషయం తెలిసిందే. ఒకే వ్యక్తి, మూడు సార్లు సెక్యూరిటీని దాటుకుని, మైదానంలో అడుగుపెట్టడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ విషయంపైనే ఇన్ డైరెక్ట్ గా ఇంగ్లండ్ బోర్డుకు చురకలు అంటించాడు రవిశాస్త్రి. అయితే ఈ బుక్ లాంచింగ్‌పై కూడా బోర్డు కన్నెర్ర చేసినట్లు.. కోచ్ రవిశాస్త్రితో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ, టీమ్ మేనేజర్‌లను వివరణ కోరినట్లు కూడా వార్తలు వచ్చాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bcci, Cricket, India vs england, Ravi Shastri, Virat kohli