ఇవాళ్టితో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన ముగియనుంది. వచ్చే నెల 5 నుంచి ఇంగ్లాండ్‌తో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌కు భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. సెలక్షన్ కమిటీ కొత్త ఛైర్మన్ చేతన్ శర్మ సారథ్యంలో జరిగే కమిటీ సమావేశంలో జట్టును ప్రకటించనున్నారు. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి రెండు టెస్టులకు భారత జట్టును ఎంపిక చేయనున్నారు. అయితే ఈ ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే.. సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనలో ఆటగాళ్లు గాయాల బారిన పడటంతో ఎవరికి చోటు దక్కనుందన్నది హాట్ టాపిక్ గా మారింది. పితృత్వపు సెలవుల మీద భారత్ కు వచ్చేసిన కెప్టెన్ కోహ్లీ ఇంగ్లాండ్ తో సిరీస్ లో తిరిగి జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు. గాయం కారణంగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లలేకపోయిన వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఆడుతున్న ఇషాంత్ ఫిట్నెస్ నిరూపించుకున్నాడు. దీంతో అతనికి జట్టులో చోటు ఖాయం.
ఇషాంత్ శర్మతో పాటు ఆసీస్ సిరీస్‌లో గాయపడి కోలుకున్న జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ తిరిగి జట్టులోకి రానున్నారు. గాయాలతో కంగారూలతో టెస్టు సిరీస్ మధ్యలో వైదొలిగిన మొహ్మద్ షమి, రవీంద్ర జడేజా, ఉమేశ్ యాదవ్, హనుమ విహారి సెలక్షన్‌కు అందుబాటులో లేరు. శార్దూల్ ఠాకూర్, టీ నటరాజన్‌లను రిజర్వ్ పేసర్లుగా ఎంపిక చేసే అవకాశాలున్నాయి. జడేజాకు బదులు షాబాజ్ నదీమ్‌ను జట్టులోకి తీసుకోవచ్చని సమాచారం తెలుస్తోంది.
ఇక స్వదేశంలో చెలరేగే హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు కచ్చితంగా బెర్త్ కన్ఫామ్. ఆస్ట్రేలియా పర్యటనలో శుభ్‌మన్ గిల్ అదరగొట్టడంతో అతనికి మళ్లీ ఓపెనర్‌గా ఎంపికవడం ఖాయం. మిడిలార్డర్లో స్థానం కోసం కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ మధ్య తీవ్ర పోటీ ఉంది. మయాంక్ విఫలమవడంతో రాహుల్ ఎంపికయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. రిజర్వ్ ఓపెనర్‌గా మయాంక్ చోటు దక్కించుకునే ఛాన్స్ ఉంది. ఆసీస్ సిరీస్‌లో విఫలమైన పృథ్వీ షాను జట్టు నుంచి తప్పించే అవకాశాలున్నాయి. టెస్ట్ స్పెసలిస్ట్స్ చేటేశ్వర్ పుజారా, అజింక్య రహానేల ఎంపిక లాంఛనమే. భారత్ ఈనెల 27న తొలి రెండు టెస్టులు జరిగే చెన్నైలో బయో బుడగలో ప్రవేశించనుంది.
Published by:Sridhar Reddy
First published:January 19, 2021, 11:27 IST