ఓవల్ వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్ట్ (India Vs England)లో టీమిండియా (Team India) భారీ టార్గెట్ ను ఇంగ్లండ్ ముందుంచింది. 466 పరుగులు చేసి ఆలౌట్ అయింది కోహ్లీసేన. ఓవరాల్ గా 367 పరుగుల ఆధిక్యం సాధించింది. ఇంగ్లండ్ఈ మ్యాచ్ లో గెలవాలంటే 367 పరుగులు చేయాలి. తొలి ఇన్నింగ్స్‌లో మెరుపు హాఫ్ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచిన శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur), రెండో ఇన్నింగ్స్‌లోనూ హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. 72 బంతుల్లో 60 పరుగులు చేసి శభాష్ అన్పించాడు. శార్దూల్ ఠాకూర్ తో పాటు పంత్ (Rishabh Pant) కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. 106 బంతుల్లో 50 పరుగులు చేసి ఈ సిరీస్ లో తొలి హాఫ్ సెంచరీ అందుకున్నాడు పంత్. వీరితో పాటు ఆఖర్లో బుమ్రా, ఉమేశ్ యాదవ్ మెరుపులు మెరిపించడంతో టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. క్రిస్ వోక్స్ మూడు వికెట్లు, మొయిన్ అలీ 2, ఓలీ రాబిన్సన్ 2 వికెట్లు తీశారు. ఓవర్ నైట్ స్కోర్ 270/3 వద్ద 22 పరుగులతో విరాట్ కోహ్లీ, తొమ్మిది పరుగులతో రవీంద్ర జడేజా నాలుగో రోజు తొలి సెషన్ ఆరంభించారు. ఎక్కువ సేపు నిలవలేకపోయారు. తొలుత రవీంద్ర జడేజా అవుట్ అయ్యాడు. ఓవర్ నైట్ స్కోరుకు ఎనిమిది పరుగులు మాత్రమే జోడించి.. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. మిడిల్ వికెట్ మీద పిచ్ అయిన బంతిని ఫ్లిక్ చేయబోయి గురి తప్పాడు. అది కాస్త నేరుగా ప్యాడ్స్‌ను తాకింది. ఇంగ్లాండ్ ప్లేయర్లు అప్పీల్ చేయడం.. అంపైర్ వేలు పైకెత్తడం చకచకా జరిగిపోయాయి. మిడ్ వికెట్ మీద పడిన బంతి స్వింగ్ అయి.. ఆఫ్ స్టంప్ మీదికి దూసుకెళ్తోన్నట్లు రీప్లేలో స్పష్టమైంది. అప్పటికి జట్టు స్కోరు 296 పరుగులు.
రవీంద్ర జడేజా అవుట్ అయిన తరువాత అజింక్యా రహానె క్రీజ్‌లోకి వచ్చాడు. ఎక్కవ సేపు నిలవలేకపోయాడు. ఎనిమిది బంతులను ఎదుర్కొన్న తరువాత పెవిలియన్ దారి పట్టాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లోనే ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. లెగ్ స్టంప్ మీద పడిన బంతిని మిడ్ వికెట్ మీదుగా ఆడబోయి గురి తప్పాడు. అది నేరుగా ప్యాడ్స్‌ను తాకింది. దీన్ని క్లీన్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. రహానె రూపంలో 296 పరుగుల వద్దే అయిదో వికెట్‌ను కోల్పోయింది భారత్.
జట్టు స్కోరు 312 పరుగుల వద్ద ఆరో వికెట్‌ను కోల్పోయింది టీమిండియా. క్రీజ్‌లో కుదురుకుని అద్భుతమైన షాట్లను ఆడుతూ కనిపించిన కేప్టెన్ విరాట్ కోహ్లీ స్పిన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. తన తొలి ఓవర్లోనే కోహ్లీని పెవిలియన్ దారి పట్టించాడు స్పిన్నర్ మొయిన్ అలీ. 44 పరుగుల వద్ద మొయిన్ అలీ బౌలింగ్‌లో ఓవర్టన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడతను. ఆఫ్ స్టంప్ లైన్ మీద పడిన బంతిని పుష్ చేయబోయాడు కోహ్లీ. టైమింగ్ మిస్ అయింది. ఎడ్జ్ తీసుకుని గాల్లోకి ఎగిరిన బంతిని ఓవర్టన్ అందుకున్నాడు.
Innings Break!#TeamIndia set a massive target of 368 runs for England.
ఇక, ఆ తర్వాత రిషబ్ పంత్, శార్దూల్ ఠాకూర్ ఏడో వికెట్‌కి 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో ఇది రెండో శతాధిక భాగస్వామ్యం. ఆ తర్వాత 72 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 60 పరుగులు చేసి జో రూట్ బౌలింగ్‌లో ఓవర్టన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 412 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది టీమిండియా.
ఆ వెంటనే.. హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న తర్వాత భారీ షాట్‌కి ప్రయత్నించిన రిషబ్ పంత్, మొయిన్ ఆలీకి రివర్స్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 414 పరుగుల వద్ద 8వ వికెట్ కోల్పోయింది టీమిండియా. ఇక, ఆఖర్లో మెరుపులు మెరిపించిన బుమ్రా, ఉమేష్ కూడా ఔటవ్వడంతో టీమిండియా ఇన్నింగ్స్ కు తెరపడింది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.