ఓవల్ వేదికగా ఇంగ్లండ్ (England) తో జరుగుతున్న నాలుగో టెస్ట్ (India Vs England) లో టీమిండియా (Team India) పోరాడుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు రోహిత్ శర్మ (56 బంతుల్లో 20 పరుగులు), కేఎల్ రాహుల్ (41 బంతుల్లో 22 ) పరుగులతో ఉన్నారు. ఇంకా, భారత్ 56 పరుగుల వెనుకబడి ఉంది. ఇక, అంతకుముందు.. టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకి ఆలౌట్ అయ్యింది. టీమిండియాపై తొలి ఇన్నింగ్స్‌లో 99 పరుగుల ఆధిక్యం సాధించగలిగింది ఇంగ్లాండ్ జట్టు. 62 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన జట్టును, స్వల్ప స్కోరుకి నియంత్రించడంతో భారత బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఓలి పోప్(159 బంతుల్లో6 ఫోర్లతో 81) బాధ్యతాయుత హాఫ్ సెంచరీకి క్రిస్ వోక్స్(58 బంతుల్లో11 ఫోర్లతో 50) ధనాధన్ ఇన్నింగ్స్ తోడవడంతో మ్యాచ్‌పై రూట్ సేన పట్టు బిగించింది. చెత్త బ్యాటింగ్‌తో చేతులెత్తేసిన కోహ్లీసేన.. బౌలింగ్‌లోనూ పేలవ ప్రదర్శన కనబర్చింది. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు తీయగా.. జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు పడగొట్టారు. సిరాజ్, శార్దూల్‌కు చెరొక వికెట్ దక్కింది.
అంతకుముందు 53/3 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్ ఆదిలోనే ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మలాన్ (31), ఒవర్టన్ (1 )వికెట్లను కోల్పోయింది. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో ఈ ఇద్దరు పెవిలియన్ చేరారు. ముందుగా నైట్ వాచ్‌మన్ ఓవర్టన్‌ను స్లిప్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చిన ఉమేశ్ యాదవ్.. ఆ తర్వాత డెవిడ్ మలాన్‌ను కూడా స్లిప్ క్యాచ్‌గానే ఔట్ చేశాడు. దీంతో, 62 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన బెయిర్ స్టో, ఓలీపోప్ ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డు పరుగెత్తించారు. మహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో బెయిర్ స్టో వరుస బౌండరీలతో దూకుడు కనబర్చగా.. శార్దూల్, ఉమేశ్ బౌలింగ్‌లోనూ ఓలీ పోప్ ధాటిగా ఆడాడు. దాంతో ఇంగ్లండ్ 139/5 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.
ఈ ఇద్దరి జోరుతో ఫస్ట్ సెషన్‌ను ఇరు జట్లు సమంగా పంచుకున్నాయి. ఇక లంచ్ బ్రేక్ తర్వాత సిరాజ్.. బెయిర్ స్టోను ఔట్ చేసి బ్రేక్ త్రూ అందించాడు. 89 పరుగుల బిగ్ పార్టనర్‌షిప్‌కు తెరదించాడు. ఆ తర్వాత మొయిన్ అలీ బ్యాటింగ్‌కు రాగా.. ఓలీ పోప్ 92 బంతుల్లో 6 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
మొయిన్ అలీ(35)తో కలిసి ఏడో వికెట్‌కు కీలక 71 పరుగులు జత చేశాడు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని జడేజా అద్భుత బంతితో విడదీశాడు. మోయిన్ అలీని క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత క్రిస్ వోక్స్ క్రీజులోకి రాగా ఓలీ పోప్ మరో వికెట్ పడకుండా రెండో సెషన్‌ను 227/7తో ముగించాడు.
ఆ తర్వాత కొద్ది సేపటికే సెంచరీ దిశగా దూసుకెళ్తున్న ఓలిపోప్‌ను శార్దూల్ ఠాకూర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ మరుసటి ఓవర్‌లోనే ఓలీ రాబిన్సన్(5)ను జడేజా బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసినట్లేనని అంతా భావించారు. కానీ క్రిస్ వోక్స్ కొరకరాని కొయ్యాలా మారి చివరి వికెట్‌కు కీలక భాగస్వామ్యాన్ని అందించాడు.
ఇది కూడా చదవండి : కోచ్ పై మనికా బాత్రా సంచలన ఆరోపణలు.. అతను అలా చేయమన్నడంటూ..
ఈ క్రమంలో 57 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బుమ్రా బౌలింగ్‌లో భారీ షాట్ ఆడి హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఆ తర్వాత సింగిల్ తీసి స్టైకింగ్ తీసుకునే ప్రయత్నం చేసిన క్రిస్ వోక్స్ రనౌటవ్వడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 61.3 ఓవర్లలో 191 పరుగుల వద్ద ఆలౌటైన సంగతి తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, IND VS ENG, India vs england, KL Rahul, Rohit sharma, Virat kohli