Ind Vs Eng : చెలరేగిన భారత బౌలర్లు.. 183 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్..

Photo Credit : Twitter

Ind Vs Eng : కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత రెండు సంవత్సరాలుగా మైదానంకు అభిమానులు రావడం లేదు. అయితే భారత్‌, ఇంగ్లండ్‌ టెస్ట్ సిరీసుకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అభిమానులను మైదానంలోకి అనుమతించారు. దీంతో చాలా కాలం తర్వాత స్టేడియంలో అభిమానుల సందడి కనిపిస్తోంది.

  • Share this:
    ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా బుధవారం టీమిండియాతో ప్రారంభం అయిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు సత్తా చాటారు. వరుస విరామాల్లో చెలరేగడంతో ఆతిథ్య జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. టీమిండియా బౌలర్లు చెలరేగడంతో 65.4 ఓవర్లలో 183 పరుగులకే ఆలౌట్ అయింది ఇంగ్లండ్. టీమిండియా బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. షమీ మూడు వికెట్లు, శార్దూల్ రెండో వికెట్లు తీశారు. మహ్మద్ సిరాజ్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ 64 పరుగులతో సత్తా చాటాడు. ఆఖర్లో శామ్ కర్రన్ మెరుపులు మెరిపించడంతో ఇంగ్లండ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టుకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఇన్నింగ్స్ మొదటి ఓవ‌ర్‌లోనే పరుగుల ఖాతా తెరవకుండానే.. ఓపెనర్‌ రోరీ బర్న్స్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ ఐదో బంతికి బర్న్స్‌ ఎల్బీగా వెనుదిరిగాడు.

    ఆపై భారత బౌలర్ల కట్టుదిట్టమైన బంతులేయడంతో ఇంగ్లండ్ ఆటగాళ్లు పరుగులు చేయడానికి చెమటోడ్చారు. డొమినిక్‌ సిబ్లీ నిదానంగా ఆడగా.. జాక్‌ క్రాలే కాస్త బ్యాట్ జులిపించాడు. అయితే మొహ్మద్ సిరాజ్ వేసిన 21 ఓవర్ చివరి బంతికి క్రాలే క్యాచ్ ఔట్ అయ్యాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ బంతికి ముందే భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ రివ్యూ కోల్పోయాడు. తర్వాత కూడా మరో రివ్యూ తీసుకుని సక్సెస్ అయ్యాడు.


    జాక్‌ క్రాలే ఔటవ్వడంతో కెప్టెన్‌ జో రూట్‌ క్రీజులోకి వచ్చాడు. శార్దూల్‌ ఠాకూర్ వేసిన 22 ఓవర్‌లో తొలి బంతికి డొమినిక్‌ సిబ్లీ ఫోర్‌ బాదగా..మొహ్మద్ సిరాజ్‌ వేసిన తర్వాతి ఓవర్‌లో రూట్‌ వరుసగా మూడు ఫోర్లు బాదాడు. ఈ హ్యాట్రిక్ ఫోర్లతో ఇంగ్లండ్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. అనంతరం శార్దూల్‌ వేసిన ఓవర్‌లో సిబ్లీ రెండు పరుగులు చేశాడు. భోజన విరామ సమయానికి ఇంగ్లండ్ 25 ఓవర్లలో 61 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత టీమిండియా బౌలర్లు వరుస విరామాల్లో చెలరేగడంతో ఇంగ్లండ్ 183 పరుగులకే ఆలౌట్ అయింది.
    Published by:Sridhar Reddy
    First published: