IND VS ENG FIFTH TEST TEAM INDIA PREDICTED PLAYING XI FOR FINAL MATCH AGAINST ENGLAND AND ROHIT SHARMA MAY BE OUT DUE TO INJURY SCARY SRD
Ind Vs Eng : రోహిత్ శర్మ డౌటే..! మార్పులు ఖాయం.. ఆఖరి టెస్ట్ లో బరిలోకి దిగే తుది జట్టు ఇదే..!
Team India
Ind Vs Eng : ఓవల్ టెస్టులో టీమిండియా విజయంతోపాటు షాక్ కూడా తగిలింది. కీ ప్లేయర్స్ గాయాల బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో ఆఖరి టెస్ట్ లో మార్పు చేర్పులతో బరిలోకి దిగనుంది టీమిండియా.
ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా (Team India) అదరగొడుతోంది. ఇప్పటికే ఐదు టెస్ట్ ల సిరీస్ లో 2-1 తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది కోహ్లీసేన. ఓవల్ వేదికగా ముగిసిన నాలుగో టెస్ట్ (India Vs England)లో 157 పరుగుల తేడాతో ఇంగ్లండ్ జట్టును చిత్తు చేసింది. ఇక సెప్టెంబర్ 10 (శుక్రవారం) నుంచి మొదలుకానున్న చివరి టెస్టులో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇరు జట్ల మధ్య ఐదో టెస్ట్ మ్యాచ్ శుక్రవారం నుంచి మాంచెస్టర్ వేదికగా జరగనుంది. అయితే ఓవల్ టెస్టులో టీమిండియా విజయంతోపాటు షాక్ కూడా తగిలింది. కీ ప్లేయర్స్ గాయాల బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో ఆఖరి టెస్ట్ లో మార్పు చేర్పులతో బరిలోకి దిగనుంది టీమిండియా. ఇక, గాయంతో నాలుగో టెస్ట్‌కు దూరమైన టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ (Mohammed Shami) పూర్తి ఫిట్నెస్ సాధించాడు. అతనితో పాటు నాలుగో టెస్ట్‌లో చీలమండ గాయానికి గురైన చతేశ్వర్ పుజారా(Cheteswar Pujara) కూడా పూర్తిగా కోలుకున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. బుధవారం టీమిండియా సాధనలోనూ మహమ్మద్ షమీ పాల్గొన్నాడు. దీంతో శుక్రవారం ప్రారంభమయ్యే అయిదో టెస్టుకు షమీ, పుజారా అందుబాటులో ఉండనున్నాడు. మరోవైపు ఓపెనర్ రోహిత్‌శర్మ (Rohit Sharma) ఫిట్‌నెస్‌పై సందిగ్ధత కొనసాగుతోంది. మోకాలి గాయంతో రోహిత్ ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే.
నాలుగో టెస్ట్ సందర్భంగా బ్యాటింగ్ చేస్తూ రోహిత్ శర్మ గాయపడ్డాడు. 353 నిమిషాలపాటు క్రీజులో నిలుచున్న రోహిత్ శర్మ తొడలు ఎర్రగా కమిలిపొయాయి. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో థై ప్యాడ్స్ రాసుకోవడం.. ఇంగ్లండ్ బౌలర్ల బంతులు బలంగా తాకడంతో రెండు తొడలకు గాయాలయ్యాయి. అంతేకాకుండా మోకాలికి కూడా గాయమైంది. అయితే ఈ గాయం తీవ్రత గురించి బీసీసీఐ ఎలాంటి స్పష్టతనివ్వలేదు. కాకపోతే హిట్ మ్యాన్ నాలుగో టెస్ట్‌లో చివరి రెండు రోజులు ఫీల్డింగ్ చేయలేదు. ముందస్తు చర్యల్లో భాగంగానే అతనికి విశ్రాంతి ఇచ్చారు.
ఒకవేళ రోహిత్ గాయం తీవ్రమైతే అతను ఆఖరి టెస్ట్‌కు దూరం కావచ్చు. అదే జరిగితే పృథ్వీ షా/మయాంక్ అగర్వాల్‌లో ఒకరు జట్టులోకి వస్తారు. పుజారాకు విశ్రాంతినిస్తే సూర్యకుమార్ యాదవ్ అరంగేట్రం చేయనున్నాడు. షమీ కోలుకోవడంతో సిరాజ్/ జస్ప్రీత్ బుమ్రాల్లో ఒకరికి విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. టీ20 ప్రపంచకప్, ఐపీఎల్ దృష్ట్యా బుమ్రాకు రెస్ట్ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
మరోవైపు, ఈ సిరీస్‌లో వరుసగా విఫలమవుతున్న రహానేపై వేటు పడే అవకాశం ఉంది. ఐదు ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 107 పరుగులు చేశాడు. లార్డ్స్ టెస్ట్‌లో హాఫ్ సెంచరీ మినహా.. అనుకున్నంతగా రాణించలేదు. దీంతో రహానేను తొలగించి, వేరొకరి ఛాన్స్ ఇవ్వాలంటూ మాజీ క్రికెటర్లు కూడా సూచిస్తున్నారు. చివరి టెస్టులో కోహ్లీ ఏంచేస్తాడో చూడాలి. రహానే ప్లేస్‌లో హనుమ విహారీ లేదా సూర్యకుమార్ యాదవ్‌లో ఒకరికి అవకాశం దక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
పుజారా కనుక చివరి టెస్టులో ఆడకుంటే.. కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగవచ్చు. సూర్యకుమార్ యాదవ్ అరంగేట్రం చేస్తే 4వ స్థానంలో బరిలోకి దిగే అవకాశం ఉంది. రహానే పై వేటు పడితే.. అతని స్థానంలో హనుమ విహారి 5వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగే అవకాశం ఉంది. ఈ వరుసలో రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్లతో లోయర్ ఆర్డర్ బలంగా తయారైంది.
చివరి టెస్టులో కూడా రవిచంద్రన్ అశ్విన్‌కు నిరాశ తప్పేలా ఉంది. మాంచెస్టర్ పిచ్ పేస్‌కు అనుకూలంగా ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో నలుగురు పేసర్లు, ఓ స్పిన్నర్‌తోనే చివరి టెస్టులో బరిలోకి దిగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. చివరి టెస్టులో అశ్విన్‌ను తీసుకోవాలనుకుంటే మాత్రం జడేజాకు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.