Ind Vs Eng : ఐదో టెస్ట్ ఫలితం తేల్చండి.. ఐసీసీ సాయం కోరిన ఇంగ్లండ్.. ముందున్న మార్గాలివే..!

Ind Vs Eng (PC: BCCI/Twitter)

Ind Vs Eng : ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మ్యాచ్‌ను నిలిపివేసినా.. భవిష్యత్‌లో తిరిగి నిర్వహించడానికి బీసీసీఐ (BCCI Latest Telugu News) ఆసక్తి చూపుతోంది. మరోవైపు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కూడా ఐదో టెస్ట్ మ్యాచ్ జరగాలని కోరుకుంటోంది.

 • Share this:
  ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ (India Vs England) మధ్య శుక్రవారం నుంచి ప్రారంభం కావాల్సిన ఆఖరి టెస్ట్ రద్దయింది. భారత జట్టులో కరోనా కలకలం (Corona Effect) రేగడంతో ఇరు దేశాల క్రికెట్ బోర్డుల పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మ్యాచ్‌ను నిలిపివేసినా.. భవిష్యత్‌లో తిరిగి నిర్వహించడానికి బీసీసీఐ (BCCI Latest Telugu News) ఆసక్తి చూపుతోంది. మరోవైపు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కూడా ఐదో టెస్ట్ మ్యాచ్ జరగాలని కోరుకుంటోంది. అయితే ఐదో టెస్టు వ్యవహారం తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)కి చేరింది. ఎదో ఒక దారి చూపాలని ఐసీసీని ఈసీబీ కోరుకుంటోంది. ఐదో టెస్టుకు ముందు రోజు గురువారం సాయంత్రం టీమిండియా జూనియర్ ఫిజియో యోగేశ్ పర్మార్‌‌‌‌కి కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే అతడితో పలువురు భారత ఆటగాళ్లు ప్రైమరీ కాంటాక్ట్‌లుగా ఉన్నారని తెలిసింది.

  దీంతో ఆటగాళ్లందరికీ ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలు చేయగా.. నెగెటివ్‌గా తేలింది. అయినా భారత జట్టు ముందు జాగ్రత్త చర్యగా చివరి టెస్టులో ఆడలేమని బీసీసీఐకి లేఖ రాసింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఈసీబీ, బీసీసీఐ బోర్డుల పెద్దలు చర్చించి మ్యాచ్‌ను రద్దు చేశారు. ఇక ఈ సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఐదో మ్యాచ్‌పై స్పష్టత లేకపోవడంతో సిరీస్‌ ఫలితం కూడా తేలాల్సి ఉంది.

  ఐదో టెస్ట్ మ్యాచ్‌ రద్దవడంతో ఈసీబీకి సుమారు రూ.300 కోట్లు నష్టం వచ్చే అవకాశముందని నివేదికలు తెలియజేస్తున్నాయ్. దీంతో భవిష్యత్‌లో ఈ మ్యాచ్ తిరిగి నిర్వహించడానికి బీసీసీఐ ఆసక్తి చూపుతోంది. మరోవైపు టెస్ట్ ఆగిపోవడానికి భారతే కారణమని ఈసీబీ అభిప్రాయపడుతోంది. ముందుగా టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి తన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి నాలుగో టెస్ట్ మ్యాచుకు ముందు హాజరవగా.. అతనితో పాటు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఆ కార్యక్రమానికి వెళ్లాడు.

  అక్కడే రవిశాస్త్రికి కరోనా సోకగా.. అతని నుంచి బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్‌లకు కూడా వైరస్ సోకింది. అనంతరం టీమ్ ఫిజియో నితిన్ పటేల్ కూడా కరోనా బారిన పడ్డాడు. అయితే, రవిశాస్త్రి, విరాట్ కోహ్లీ ఆ పబ్లిక్ ఈవెంట్‌కి కనీసం ఈసీబీ నుంచి పర్మీషన్ కూడా తీసుకోలేదట. ఈసీబీ ఇద్దరిపై మండిపడినా.. విషయం మాత్రం బయటికి రాలేదు.

  ఇక, లేటెస్ట్ గా సిరీస్‌ ఫలితంపై పరిష్కారం చూపాలని ఇంగ్లండ్ బోర్డు ఐసీసీకి లేఖ రాసింది. ఐదో టెస్ట్ మ్యాచ్‌ సిరీస్‌ ఫలితంను నిర్ణయిస్తుంది. భారత్ గెలిస్తే 3-1తో సిరీస్ దక్కుతుంది. అదే ఇంగ్లండ్ గెలిస్తే 2-2తో సమం అవుతోంది. డ్రా అయితే 2-1తో సిరీస్ భారత్ సొంతమవుతుంది. అందుకే ఐసీసీకి ఈసీబీ లేఖ రాసింది. ఈ విషయంపై ఇరు బోర్డుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఐసీసీ డిస్ప్యూట్‌ రిసొల్యూషన్‌ కమిటీ (డీఆర్సీ)కి లేఖ రాశామని ఈసీబీ ప్రతినిధి ఒకరు ఓ మీడియాకు చెప్పారు.

  కరోనా కేసుల వల్ల ఈ మ్యాచ్‌ రద్దయిందని ప్రకటిస్తే.. తమకు 40 మిలియన్‌ పౌండ్ల నష్టం వాటిల్లుతుందని, ఇలాంటి పరిస్థితుల్లో సరైన పరిష్కారం చూపితే ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ చేసుకునే వీలుందని ఇంగ్లీష్ బోర్డు ఆశిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఐసీసీని సాయం చేయాలని ఈసీబీ కోరింది.

  ఒకవేళ ఐదో టెస్టును గనుక ఐసీసీ పూర్తిగా రద్దు చేస్తే.. భారత్ 2-1 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంటుంది. అప్పుడు దీన్ని నాలుగు టెస్టుల సిరీస్‌గానే పరిగణిస్తారు.టీమిండియానే ఈ మ్యాచ్‌లో ఆడటానికి విముఖత చూపిన నేపథ్యంలో ఇంగ్లండ్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకోవచ్చు.

  ఇది కూాడా చదవండి :  Viral Video : క్రికెట్ గ్రౌండ్ లోకి అనుకోని అతిథి.. పట్టుకోలేక అవస్థలు పడ్డ ఫీల్డర్లు.. చివరికి..

  చివరి టెస్టులో ఆడటానికి ఆ జట్టు సిద్ధంగా ఉన్నా.. భారత్‌ ఒప్పుకోని పక్షంలో ఫలితాన్ని ఇంగ్లండ్‌కే కేటాయిస్తారు. దీంతో 2-2తో సిరీస్‌ సమానంగా మారుతుంది. అప్పుడు ఇంగ్లండ్ బోర్డు ఇన్సూరెన్స్‌ కూడా క్లెయిమ్‌ చేసుకునే వీలుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఐసీసీ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.
  Published by:Sridhar Reddy
  First published: