ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున మెరుగైన ప్లేయర్‌గా గుర్తింపు... సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌తో టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం... ప్చ్.. అయినా రెండుసార్లు బెంచ్‌కే పరిమితం.. ముచ్చటగా మూడోసారి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని.. అడుగుపెట్టగానే సిక్సర్‌తో మొదలెట్టి 28 బంతుల్లోనే అర్థసెంచరీతో రికార్డు... ఇక ప్రస్తుత శ్రీలంక పర్యటనలో భాగంగా వన్డేల్లోనూ అరంగేట్రం... ప్రతిభ ఆధారంగానూ, ఇంగ్లండ్ ప్రస్తుత సిరీస్‌కు ఎంపికైన ఇతర క్రికెటర్లు గాయాల బారిన పడటం మూలాన.. టెస్టుల్లోనూ అరంగేట్రం చేసే అవకాశం.. ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది.. అవును టీమిండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ గురించే ఈ డిస్కషన్ అంతా. అన్నీ సజావుగా సాగితే.. సూర్య.. కోహ్లి కెప్టెన్సీలో సంప్రదాయ క్రికెట్లో అడుగుపెట్టడం ఖాయం అని ఫ్యాన్స్ సంబరపడి పోతున్న సమయం. ఇంతలోనే కృనాల్ పాండ్యాకు కరోనా సోకిందన్న వార్త అభిమానులను కలవరపెట్టిన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి పలువురు యంగ్ క్రికెటర్ల కేరీర్‌ను ప్రమాదంలోకి నెట్టేసింది. ప్రత్యేకించి- టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్న ఓపెనర్ పృథ్వీ షా, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ టెస్ట్ కేరీర్ ప్రస్తుతం డోలాయమానంలో పడింది. కరోనా వైరస్ బారిన పడ్డ స్పిన్నర్ కృనాల్ పాండ్యాతో సన్నిహితంగా మెలిగినందున తోటి క్రికెటర్లతో పాటు ఈ ఇద్దరు కూడా ప్రస్తుతం ఐసొలేషన్‌లో కాలం వెల్లదీస్తోన్నారు. మరో నాలుగు రోజుల్లో భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కావాల్సిన ఈ దశలో వారు శ్రీలంకలో ఐసొలేషన్‌లో ఉంటున్నారు.
పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్‌లతో పాటు హార్దిక పాండ్యా, యజువేందర్ చాహల్, కృష్ణప్ప గౌతమ్, ఇషాన్ కిషన్, మనీష్ పాండే ఐసొలేషన్‌లో ఉంటోన్నారు. వారిలో పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్‌లను బీసీసీఐ బోర్డు ప్రమోట్ చేసింది. విరాట్ కోహ్లీ సారథ్యంలో ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఉన్న టెస్ట్ జట్టులో చోటు కల్పించింది. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఈ పాటికి పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్.. ఇంగ్లాండ్ విమానం ఎక్కేసి ఉండేవారే. శ్రీలంకతో సిరీస్ ముగిసిన వెంటనే వారు లండన్ వెళ్లాల్సి ఉంది. అనూహ్యంగా వారు లంకలోనే ఐసొలేషన్‌లో గడపాల్సి వచ్చింది.
ఐసొలేషన్‌లో ఉన్న క్రికెటర్లందరికీ కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తున్నారు. పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్ వరుసగా మూడుసార్లు కరోనా వైరస్ నెగెటివ్ సర్టిఫికెట్ సమర్పిస్తే గానీ టెస్ట్ జట్టులో చేరడానికి ఇంగ్లాండ్ వెళ్లే అవకాశాన్ని ఇవ్వబోమని బీసీసీఐ స్పష్టం చేసింది. ఇప్పటిదాకా వారికి నిర్వహించిన రెండు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో నెగెటివ్ రిపోర్ట్స్ వచ్చాయని పేర్కొంది. మరో నెగెటివ్ సర్టిఫికెట్ అందాల్సి ఉందని తెలిపింది. ఈ ఉదయం వారికి చివరి నిర్ధారణ పరీక్షను నిర్వహించారు. ఇంకొన్ని గంటల్లో ఈ రిపోర్ట్ అందాల్సి ఉంది. అది కూడా నెగెటివ్ వస్తే.. ఆ ఇద్దరూ ఇంగ్లాండ్‌కు బయలుదేరి వెళ్తారని వివరించింది.
ఇక, భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ఆగస్టు 4వ తేదీన తొలి టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని సీనియర్ల జట్లు ఇంగ్లాండ్‌ను ఢీ కొట్టనుంది. తొలి టెస్ట్‌కు ట్రెంట్‌బ్రిడ్జ్ ఆతిథ్యం ఇవ్వనుంది. సెప్టెంబర్ 14వ తేదీన చివరి టెస్ట్ మ్యాచ్ ముగుస్తుంది. ఇప్పటికే టీమిండియాను వరుస గాయాలు సతమతం చేస్తున్నాయ్. ఇప్పుడేమో.. కరోనా ఎఫెక్ట్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona effect, Cricket, India vs england, Prithvi shaw, Sports