ఇంగ్లాడ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. 157 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై విజయాన్ని నమోదు చేసింది. భారత జట్టు విజయంలో ఓపెనర్ రోహిత్ శర్మ, బౌలర్స్ ఉమేశ్ యాదవ్, బుమ్రా, జడేజా, శార్దూల్ ఠాకూర్ కీలక భూమిక పోషించారు. దీంతో ఐదు టెస్ట్ మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో టీమిండియా 2-1 తో ఆధిక్యం సాధించింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్ పూర్తిగా చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 191 పరుగులకే అలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ జట్టు.. తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులు చేసింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా పుంజుకుంది. ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. 127 పరుగుల సాధించి టీమిండియా భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. మిగతా ఆటగాళ్లు కూడా తొలి ఇన్నింగ్స్‌తో పోల్చితే మెరుగైన ఆటతీరు కనబరిచారు. శార్దుల్, పంత్ హాఫ్ సెంచరీలతో రాణించారు. ఫలితంగా టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 466 పరుగులు సాధించింది. దీంతో ఇంగ్లాండ్ ముందు 368 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
విజయమే లక్ష్యంగా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 77 పరుగులు చేసింది. ఐదో రోజు ఇంగ్లాండ్ 291 పరుగులు చేయాల్సి వచ్చింది.
అయితే ఐదో రోజు ఆటలో భారత బౌలర్లు విజృంభించారు. వెంట వెంటనే కీలక వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను కోలుకోలేని దెబ్బ తీశారు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 210 పరుగులకే కుప్పకూలింది. వరుసగా వికెట్లు తీసిన బౌలర్లు భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్‌కు 3 వికెట్లు, బుమ్రా, జడేజా, శార్దూల్ ఠాకూర్‌లు తలో రెండు వికెట్లు తీశారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.