ఓ వైపు టీమిండియా (Team India) లో రోహిత్ శర్మ (Rohit Sharma), పుజారా, విరాట్ కోహ్లీ (Virat Kohli Latest Updates), అజింక్య రహానే, కేఎల్ రాహుల్ లాంటి టాప్ క్లాస్ బ్యాట్స్ మెన్ పరుగులు చేయడానికి నానా తంటాలు పడుతుంటే.. ఆతిథ్య జట్టు బ్యాట్స్ మన్ మాత్రం పరుగుల ప్రవాహం పారిస్తున్నాడు. మిగతా బ్యాట్స్ మెన్ పరుగులు ఎలా చేయాలని ఆలోచిస్తోంటే .. అతడు మాత్రమే ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఆ ప్లేయర్ ఎవరో కాదు.. ఇంగ్లండ్ కెప్టెన్ (England Skipper) జో రూట్.. (Joe Root). ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ప్రారభం కావడానికి ముందు.. అతని మీద ఎలాంటి అంచనాలు ఉండేవో.. వాటికి ఏ మాత్రం తగ్గకుండా అద్భుతంగా రాణిస్తోన్న ఏకైక బ్యాట్స్‌మెన్. బెన్‌స్టోక్స్ వంటి ఆల్‌రౌండర్ తప్పుకోగా.. కొత్త ముఖాలతో బలమైన భారత జట్టును ఎదుర్కొంటోన్న ఇంగ్లాండ్ జట్టులో సత్తా చాటుతున్నాడీ ఒకే ఒక్కడు. భారీ స్కోరుతో జట్టును ముందుండి నడిపిస్తోన్నాడు. ఇక, లేటెస్ట్ గా మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్ నాటికే 400 పరుగులను పూర్తి చేసుకున్నాడు జో రూట్. తొలి రెండు టెస్టుల ఫలితం ఎలా ఉన్నప్పటికీ.. బ్యాట్స్‌మెన్‌గా జట్టుకు పూర్తి న్యాయం చేస్తోన్నాడనే విషయం దీనితో స్పష్టమౌతోంది. టెస్టుల్లో ఈ క్రికెట్ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్ కూడా అతనే. జో రూట్ టెస్ట్ క్రికెట్ కెరీర్.. ప్రస్తుతం అత్యున్నత స్థితిలో కొనసాగుతోంది.
మరోవైపు, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నాడు. భారీ స్కోరు చేయలేక నానా తంటాలు పడుతున్నాడు. హాఫ్ సెంచరీ చేయడమే గగనమైపోయింది. కానీ, విరాట్ కోహ్లీకి పూర్తి భిన్నంగా ఇంగ్లండ్ సారధి జో రూట్ సత్తా చాటుతున్నాడు. మ్యాచ్ మ్యాచ్ కి తనలోని అసలు సిసలు టాలెంట్ ను చూపిస్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటిదాకా జో రూట్ ఆడింది 11 టెస్ట్ మ్యాచ్‌లే. ఈ 11 మ్యాచ్‌లల్లో 1,280 పరుగులు చేశాడు. ఈ స్థాయిలో పరుగులు చేసిన మరో క్రికెటర్ అతని దరిదాపుల్లో కూడా లేరు. బ్యాటింగ్ యావరేజ్ 67.37. వ్యక్తిగత అత్యుత్తమ స్కోరు 228 పరుగులు. ఈ క్రికెట్ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల లిస్ట్ లో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. 10 టెస్ట్ మ్యాచుల్లో 709 పరుగులతో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ రెండో స్థానంలో నిలిచాడు.
ఇక, టీమిండియా ఈ మ్యాచ్ లో పూర్తిగా పట్టు కోల్పోయింది. జో రూట్ దూకుడు, మలన్ క్లాస్ ఇన్నింగ్స్ తో ఇంగ్లండ్ రెచ్చిపోతోంది. ఈ ఇద్దరూ చెలరేగడంతో టీమిండియా బౌలర్ల దగ్గర సమాధానం లేకపోయింది. ఇంగ్లండ్ దూకుడు చూస్తుంటే.. ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసి.. భారత్ ను మరోసారి బ్యాటింగ్ కు దించాలని చూస్తోంది. ఇప్పటికే.. ఐదు టెస్ట్ ల మ్యాచ్ సిరీస్ లో టీమిండియా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే, లార్డ్స్ ప్రదర్శన తర్వాత టీమిండియా ఇంత చెత్తగా ఆడటాన్ని ఫ్యాన్స్ జీర్ణించకోలేకపోతున్నారు. పుజారా, రహానేలపై వేటు వేయాలని టీమిండియా మేనేజ్ మెంట్ ను కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, India vs england, Sports, Virat kohli