Ind Vs Eng : మూడో టెస్ట్ లో టీమిండియా ఓటమి తప్పదా..? కోహ్లీసేన ఆశలన్నీ అతడిపైనే..!

Team India

Ind Vs Eng : ఎలా చూసుకున్నా కనీసం ఇంగ్లాండ్‌కి తొలి ఇన్నింగ్స్‌లో 350- 400+ ఆధిక్యం దక్కేలా కనిపిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇబ్బంది పడినట్టు భారత బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడకపోయినా, రెండో ఇన్నింగ్స్‌లో ఈ స్కోరును దాటించి పరుగులు చేసి... మ్యాచ్‌ను కాపాడుకోవాలంటే అసాధారణంగా రాణించాల్సి ఉంటుంది.

 • Share this:
  రెండో టెస్టులో టీమిండియాపై ఇంగ్లండ్ (Ind Vs Eng ) ఆధిపత్యం కొనసాగుతోంది. భారీ ఆధిక్యం దిశగా ఇంగ్లండ్ కొనసాగుతోంది. దాదాపు ఈ మ్యాచ్ పై టీమిండియా పట్టు కోల్పోయింది. ఐదు టెస్ట్ ల ఇంగ్లాండ్ (England) పర్యటనలో తొలి మ్యాచ్‌లో వర్షం కారణంగా వెనుకబడి, లార్డ్స్‌లో విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచిన టీమిండియా (Team India).. అదే జోరులో ఆధిక్యాన్ని పెంచుకోవాలని చూసింది. కానీ లీడ్స్ టెస్టులో భారత్ అనూహ్యంగా కుప్పకూలింది. దీంతో భారత్ దాదాపు రేసులో వెనకపడినట్టే. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ (Joe Root) మరోసారి తన ప్రతాపాన్ని చూపించాడు. సెంచరీతో కదం తొక్కాడు. అతని దెబ్బకి టీమిండియా బౌలర్లు తేలిపోయారు. అతనితో పాటు ఓపెనర్లు, మలన్ కూడా రాణించడంతో ఇంగ్లండ్ ఆధిక్యం భారీగా పెరుగుతోంది. 120/0 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో గురువారం ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు నిలకడగా ఆడింది. తొలి రోజే హాఫ్ సెంచరీలు చేసిన ఓపెనర్లు రోరీ బర్న్స్​, హసీబ్​ హమీద్​లు వికెట్ కాపాడుకున్నారు. ఆచితూచి ఆడుతూ స్కోర్ వేగం పెంచే ప్రయత్నం చేశారు. మొదటగా మొహ్మద్ షమీ.. బర్న్‌ను బౌల్డ్‌ చేశాడు. దీంతో ఇంగ్లండ్ 135 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఓవర్‌నైట్‌ స్కోర్‌కు ఇంగ్లండ్ ఓపెనర్లు మరో 15 పరుగులు మాత్రమే జోడించారు. అనంతరం హమీద్​కు డేవిడ్​ మలాన్ జత కలిశాడు. మరో 24 పరుగుల అనంతరం జడేజా.. హమీద్‌ను బౌల్డ్‌ చేశాడు. దీంతో ఇంగ్లండ్ 159 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.

  ఓపెనర్ల అనంతరం జోడీ కట్టిన డేవిడ్ మలన్‌, జో రూట్‌ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తపడ్డారు. భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ పరుగులు చేశారు. చెత్త షాట్లకు పోకుండా వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ జోడీని విడదీసేందుకు ఎంత ప్రయత్నించినా.. కుదరలేదు. ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ సిరాజ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఈ క్రమంలో మలన్‌, రూట్‌ జోడి మరో వికెట్‌ పడకుండా తొలి సెషన్‌ను ముగించారు. దాంతో ఇంగ్లండ్ మెరుగైన స్థితిలోకి దూసుకెళ్లింది. లంచ్ సమయానికి ఇంగ్లండ్ ఆధిక్యం 104 పరుగులుగా నమోదైంది. మొదటి సెషన్‌లో ఇంగ్లండ్ పూర్తికి ఆధిపత్యం చెలాయించింది.

  భోజన విరామ సమయానికి 182/2తో ఉన్న ఇంగ్లండ్ జట్టును రూట్‌, మలన్‌ ఆదుకున్నారు. ముఖ్యంగా ఇంగ్లీష్ సారథి వన్డే ఇన్నింగ్స్‌ ఆడాడు. అతడికి మలన్‌ నుంచి పూర్తి సహకారం అందింది. ఈ క్రమంలోనే రూట్‌ తొలుత అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఆపై మలన్‌ కూడా వేగంగా పరుగులు సాధించి ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లోనే హాఫ్‌ సెంచరీ సాధించాడు. దీంతో 2012 తర్వాత తొలిసారి ఒకే ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ టాప్‌ నలుగురు బ్యాట్స్‌మెన్‌ అర్ధ శతకాలతో రాణించారు.

  ఎలా చూసుకున్నా కనీసం ఇంగ్లాండ్‌కి తొలి ఇన్నింగ్స్‌లో 350- 400+ ఆధిక్యం దక్కేలా కనిపిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇబ్బంది పడినట్టు భారత బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడకపోయినా, రెండో ఇన్నింగ్స్‌లో ఈ స్కోరును దాటించి పరుగులు చేసి... మ్యాచ్‌ను కాపాడుకోవాలంటే అసాధారణంగా రాణించాల్సి ఉంటుంది. ఈ స్కోరును దాటించి మన బ్యాట్స్ మెన్ పరుగులు చేయడం అంటే కష్టమే. ఇటీవల మన ఆటగాళ్లు ఫామ్ ను చూస్తే ఈ విషయం ఇట్టే అర్ధమవుతోంది. ఈ ఓటమి నుంచి తప్పించాలంటే, తొలి టెస్టులో భారత జట్టుకి విజయాన్ని దూరం చేసిన వరుణుడు, మ్యాచ్‌కి అడ్డంకి కలిగించాలని కోరుకోవాల్సిందే. ఇప్పుడున్న ఫామ్‌లో టీమిండియాను ఆలౌట్ చేసేందుకు ఇంగ్లాండ్‌కి మహా అయితే మూడు సెషన్లు సరిపోతాయి. అంటే మ్యాచ్ సజావుగా సాగితే నాలుగో రోజు ముగిసిపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే క్రీడాస్ఫూర్తికి విరుద్ధమై అయినా వర్షం కారణంగా మరోసారి రోజు లేదా రోజున్నర ఆట రద్దు కావాలని గట్టిగా కోరుకుంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్.
  Published by:Sridhar Reddy
  First published: