Home /News /sports /

IND VS ENG 3RD TEST NETIZENS TROLLED VIRAT KOHLI FOR HIS TOSS RECORDS IN AWAY TESTS SRD

Ind Vs Eng : " గెలవక గెలవక టాస్ గెలిస్తే ఫలితం ఇలానే ఉంటుంది ".. విరాట్ కోహ్లీపై సెటైర్లు..

Ind Vs Eng (PC: BCCI/Twitter)

Ind Vs Eng (PC: BCCI/Twitter)

Ind Vs Eng : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి టాస్ కూడా ఏ మాత్రం కలిసి రావడం లేదు. విదేశాల్లో టెస్ట్ ఫార్మాట్‌లో కోహ్లీ టాస్ గెలిస్తే.. భారత్ తక్కువ పరుగులకే ఆలౌట్ అవుతోంది.

  ఇంగ్లాండ్ (England) పర్యటనలో ఉన్న టీమిండియా (Team India) తొలి రెండు టెస్టుల్లో అద్బుతంగా రాణించింది. లార్డ్స్‌లో (Lords) జరిగిన రెండో టెస్టులో భారత జట్టు చారిత్రక విజయాన్ని కూడా అందుకున్నది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది. అయితే, లీడ్స్ (Leeds) టెస్ట్ లో సీన్ ఒక్కసారిగా రివర్స్ అయింది. లీడ్స్‌ వేదికగా ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్ల దెబ్బకు భారత్ 40.4 ఓవర్లలో 78 పరుగులకు ఆలౌట్ అయింది. సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma) చేసిన 19 పరుగులే అత్యధికం. అజింక్య రహానే 18 పరుగులు చేయగా.. ఒక్క భారత బ్యాట్స్‌మన్‌ కూడా డబుల్ డిజిట్ అందుకోలేకపోయారు. కేఎల్ రాహుల్‌ (0), చతేశ్వర్ పుజారా (1), విరాట్‌ కోహ్లీ (7), రిషబ్ పంత్ (2), రవీంద్ర జడేజా (4) పరుగులు చేసి తీవ్రంగా నిరాశపర్చారు. తొలి సెషన్‌లో నాలుగు వికెట్లు కోల్పోయి 56 పరుగులు చేసిన భారత్.. రెండో సెషన్‌లో 22 పరుగులు చేసి కూప్పకూలింది. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ 3, క్రెయిగ్ ఓవర్టన్‌ 3, ఓలి రాబిన్సన్‌ 2, సామ్‌ కరన్‌ 2 వికెట్లు పడగొట్టారు. ఇక, కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) వరుస బ్యాటింగ్ వైఫల్యాలు మాత్రం అటు టీమ్ మేనేజ్‌మెంట్ సహా అభిమానులను కూడా ఆందోళనకు గురి చేస్తోంది. మూడో టెస్టులో భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో చేతులెత్తేసింది. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆదుకునే విషయంలో కోహ్లీకి మంచి రికార్డు ఉంది. ఎన్నో సార్లు ఒంటి చేత్తే ఇన్నింగ్స్‌లను చక్కదిద్దాడు. కానీ మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 7 పరుగులకే అవుటయ్యాడు.

  ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ ప్రదర్శన అత్యంత పేలవంగా ఉన్నది. తొలి టెస్టులో డకౌట్ అయిన కోహ్లీ, రెండో టెస్టులో 42, 20 పరుగులు చేశాడు. కోహ్లీ అంతర్జాతీయ ఫార్మాట్‌లో సెంచరీ చేయక ఇప్పటికి 641 రోజులు అవుతుంది. చివరి సెంచరీ చేసిన తర్వాత కోహ్లీ సగటు కేవలం 23.00 మాత్రమే. అంతే కాకుండా అన్ని ఫార్మాట్లు కలిపి 50 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ చేసింది మూడు అర్దసెంచరీలు మాత్రమే. పరుగుల యంత్రం అని పేరు తెచ్చుకున్న కోహ్లీ వైఫల్యాలు భారత జట్టుకు కూడా భారంగా మారుతున్నాయి. కీలక సమయంలో వికెట్ పారేసుకోవడం అభిమానులను చికాకు పెడుతున్నది. రాబోయే టీ20 వరల్డ్ కప్ ముందు కోహ్లీ ఇలాంటి పేలవ ఫామ్‌లో ఉండటం జట్టుకు మంచిది కాదని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
  ఇదిలా ఉంటే, విరాట్ కోహ్లీకి టాస్ కూడా ఏ మాత్రం కలిసి రావడం లేదు. విదేశాల్లో టెస్ట్ ఫార్మాట్‌లో కోహ్లీ టాస్ గెలిస్తే.. భారత్ తక్కువ పరుగులకే ఆలౌట్ అవుతోంది. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ టాస్ గెలవగా.. భారత్ 36 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత టెస్ట్ మ్యాచ్‌లో వరుసగా 8 సార్లు ఓడిపోయిన తర్వాత కోహ్లీ ఈ మ్యాచులో టాస్ గెలిచాడు. మరోసారి భారత్ తక్కువ పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో నెటిజన్లు కోహ్లీపై సెటైర్లు వేస్తున్నారు. " కోహ్లీ టాస్ గెలిస్తే అంతేసంగతులు " అని ఒకరు కామెంట్ చేయగా.. " విదేశాల్లో విరాట్ టాస్ గెలిస్తే ఫలితం ఇలానే ఉంటది మరి" అని ఇంకొకరు కామెంట్ చేశారు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ కూడా భారత జట్టుపై వ్యంగంగా ఓ ట్వీట్ చేశాడు. "గుడ్ ఈవెనింగ్ ఇండియా" అంటూ సెటైర్ వేశాడు.


  భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో ఇలా తక్కువ పరుగులకు ఆలౌట్ అవ్వడం ఇది మూడోసారి. ఢిల్లీ వేదికగా 1987లో వెస్టిండీస్ జట్టుపై భారత్ 75 పరుగులు మాత్రమే చేసింది. టీమిండియాకు తొలి ఇన్నింగ్స్‌లో అదే అత్యల్ప స్కోర్. అహ్మదాబాద్ వేదికగా 2007లో దక్షిణాఫ్రికాపై భారత్ 76 రన్స్ చేయగా.. ప్రస్తుతం లీడ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో 78 పరుగులకు ఆలౌట్ అయింది. మొహాలీలో 1999లో న్యూజీలాండ్ జట్టుపై భారత్ 83 రన్స్ చేసింది. ఇక విరాట్ కెప్టెన్‌గా చేసిన మూడో టెస్టులో భారత్ ఎప్పుడూ ఓడిపోలేదు. కానీ అది ఇప్పుడు బ్రేక్ అయ్యేలా ఉంది.
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Cricket, IND VS ENG, India vs england, Team india, Virat kohli

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు