IND vs ENG 3rd ODI : ఇంగ్లండ్ (England) పర్యటనను రోహిత్ శర్మ (Rohit Sharma) నాయకత్వంలోని టీమిండియా (Team india) విజయంతో ముగించింది. సిరీస్ ను తేల్చే చివరిదైన మూడో వన్డేలో రిషభ్ పంత్ (113 బంతుల్లో 125 నాటౌట్; 16 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ శతకంతో జట్టుకు విజయాన్ని అందించాడు. పంత్ కు తోడు హార్దిక్ పాండ్యా (55 బంతుల్లో 71; 10 ఫోర్లు) అర్ధ శతకంతో చెలరేగాడు. ఫలితంగా 260 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 42.1 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే నష్టపోయి 261 పరుగులు చేసి గెలుపొందింది. దాంతో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను 2-1తో సొంతం చేసుకుంది. టెస్టు మ్యాచ్ ఓటమి తర్వాత పుంజుకున్న భారత్ అటు టి20, ఇటు వన్డే సిరీస్ లను సొంతం చేసుకుని ఇంగ్లండ్ పర్యటనను ముగించింది.
పంత్ తీన్మార్
ధోని వారసుడి ట్యాగ్ తో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన రిషభ్ పంత్.. ఇప్పటి వరకు పరిమిత ఓవర్ల క్రికెట్ లో చెప్పుకోదగిన ప్రదర్శన చేసింది లేదు. టెస్టుల్లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ లను ఆడినా.. వన్డే, టి20ల్లో అటువంటి ప్రదర్శనలను పంత్ నుంచి ఇప్పటి వరకు చూడలేదు. ఈ క్రమంలో పంత్ పై విమర్శలు వస్తున్న మాట నిజం. అయితే మూడో వన్డేతో విమర్శకుల నోళ్లను మూయించే ప్రయత్నం చేశాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన పంత్.. హార్దిక్ తో కలిసి మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. లక్ష్య ఛేదనలో భారత్ ఆరంభంలో వరుసగా వికెట్లను కోల్పోయింది. శిఖర్ ధావన్ (1), రోహిత్ శర్మ (17), విరాట్ కోహ్లీ (17), సూర్యకుమార్ యాదవ్ (16) వెంట వెంటనే పెవిలియన్ కు చేరుకున్నారు. దాంతో భారత్ 72 పరుగులకే నాలుగువికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన హార్దిక్ తో కలిసి పంత్ జట్టును ముందుకు నడిపాడు. మొయిన్ అలీ బౌలింగ్ లో బట్లర్ స్టంపింగ్ చాన్స్ ను మిస్ చేయడంతో బతికి బయటపడిన పంత్.. ఆ తర్వాత అద్బుత షాట్లతో అలరించాడు. మరో ఎండ్ లో ఉన్న హార్దిక్ టి20 తరహా బ్యాటింగ్ చేశాడు. వీరు ఐదో వికెట్ కు 123 పరుగులు జోడించారు. చివర్లో హార్దిక్ అవుటవ్వగా.. జడేజా (7 నాటౌట్)తో కలిసి మ్యాచ్ ను ముగించేశాడు పంత్. ఈ క్రమంలో పంత్ వన్డేల్లో తొలి సెంచరీని అందుకున్నాడు.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 45.5 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌటైంది. జాస్ బట్లర్ (80 బంతుల్లో 60; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు ఓపెనర్ జేసన్ రాయ్ (41), మొయిన్ అలీ (34), ఓవర్టన్ (32) పోరాడటంతో ఇంగ్లండ్ 250 మార్కును దాటగలిగింది. హార్దిక్ పాండ్యా 4 వికెట్లు తీశాడు. యుజువేంద్ర చహల్ 3 వికెట్లు తీయగా.. మొహమ్మద్ సిరాజ్ 2 వికెట్లతో రాణించాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hardik Pandya, India vs england, Mohammed Shami, Mohammed Siraj, Ravindra Jadeja, Rishabh Pant, Rohit sharma, Virat kohli