హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs ENG 2nd ODI : ఫస్ట్ వన్డే సీన్ రిపీట్.. కాకపోతే ఇక్కడ ఓడింది టీమిండియా.. అదరగొట్టింది మాత్రం టోప్లీ..

IND vs ENG 2nd ODI : ఫస్ట్ వన్డే సీన్ రిపీట్.. కాకపోతే ఇక్కడ ఓడింది టీమిండియా.. అదరగొట్టింది మాత్రం టోప్లీ..

Reece Topley

Reece Topley

IND vs ENG 2nd ODI : ఫస్ట్ వన్డేలో దుమ్మురేపిన టీమిండియా.. రెండో మ్యాచులో మాత్రం చతికిలపడింది. ఇంగ్లండ్ బౌలర్లు.. టీమిండియా బ్యాటర్లకు చుక్కలు చూపారు.

ప్రతిష్టాత్మకంగా లార్డ్స్ గ్రౌండ్ లో ఫస్ట్ వన్డే సీన్ రిపీట్ అయింది. అవును.. ఫస్ట్ వన్డేలో ఇంగ్లండ్ (Engalnd) బ్యాటర్లు ఎలా చతికిలపడ్డారో.. ఇప్పుడు రెండో మ్యాచులో మన భారత ఆటగాళ్లు (Indian Players).. చేతులేత్తేశారు. ఫలితం.. రెండో వన్డేలో టీమిండియా చిత్తుగా ఓడింది. ఇంగ్లండ్ సెట్ చేసిన 247 పరుగుల నామమాత్రపు టార్గెట్ ఛేజ్ చేయలేక టీమిండియా (Team India) బొక్కబొర్లాపడింది. కేవలం 146 పరుగులకే ఆలౌటైంది. దీంతో 100పరుగుల తేడాతో ఇంగ్లండ్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ బౌలర్ టోప్లీ (Reece Topley).. టీమిండియా బ్యాటింగ్ లైనప్ ను కకావికలం చేశాడు. దీంతో.. లార్డ్స్ గ్రౌండ్లోనూ.. అలాగే కెరీర్ బెస్ట్ బౌలింగ్ ప్రదర్శన నమోదు చేశాడు. టోప్లీ.. 9.5ఓవర్లలో కేవలం 24పరుగులు మాత్రమే ఇచ్చి 6వికెట్లు తీశాడు. ఈ ఫీట్ తో లార్డ్స్‌లో వన్డేల్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన కనబర్చిన ప్లేయర్‌గా రికార్డులెక్కాడు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో డేవిడ్ విల్లీ, బ్రైడన్ కార్స్, లియామ్ లివింగ్ స్టోన్, మొయిన్ అలీ తలా ఓ వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా రీస్ టోప్లీ నిలిచాడు.

ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోరుకే ఆలౌట్‌ చేసిన టీమిండియాకు ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. టోప్లీ ప్రతాపానికి ఇండియా టాపార్డర్, లోయర్ ఆర్డర్ కుప్పకూలింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ (0), శిఖర్‌ ధావన్‌ (9) టాప్లీ పేస్‌కు తలవంచారు. ఆ వెంటనే రిషభ్‌ పంత్‌ (0)ను కార్స్‌ ఖాతా తెరువనీయలేదు. అయినా విరాట్‌ కోహ్లి (16) ఉండటంతో కొంత నమ్మకం ఉన్నా, అతని ఆటకు విల్లీ చెక్‌ పెట్టాడు. సూర్యకుమార్‌ (29 బంతుల్లో 27; 1 ఫోర్, 1 సిక్స్‌), హార్దిక్‌ పాండ్యా (44 బంతుల్లో 29; 2 ఫోర్లు) కొద్ది సేపు పోరాడటంతో స్కోరు వంద దాటింది. ఆఖర్లో షమీ, జడేజా కాసేపు పోరాడారు.

ఇక షమీని ఔట్ చేయడంతో ఇండియా ఓటమి ఖాయమైపోయింది. షమీకి స్లో టాస్ వేయగా హిట్ చేయాలని చూసి ఔటయిపోయాడు. అంతవరకు షమీ, జడేజా జోడి కాస్త ఇంగ్లాండ్‌ను ఎదుర్కునేలా కన్పించింది. కానీ షమీ ఔటయ్యాక, లివింగ్‌స్టన్ బౌలింగ్లో జడేజా (29పరుగులు 44బంతుల్లో) కూడా బౌల్డ్ అవ్వడంతో ఇండియా ఆశలు వదులుకుంది.

అంతకుముందు.. మొయిన్ అలీ (64 బంతుల్లో 47; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ విల్లీ (49 బంతుల్లో 41; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడటంతో భారత్ (India)తో జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ (England) ప్రత్యర్థి ముందు మెరుగైన టార్గెట్ ను ఉంచగలిగింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ 49 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది.

ఇది కూడా చదవండి : ఆ రుద్దుడు స్టార్స్ కోసం ఆ ఇద్దరిని బలి చేస్తారా? ఇదేక్కడి న్యాయం బీసీసీఐ.!

యుజువేంద్ర చహల్ తన స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించడంతో 25 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ 5 వికెట్లకు 117 పరుగులు చేసింది. చహల్ నాలుగు వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా, జస్ ప్రీత్ బుమ్రాలు చెరో రెండు వికెట్లు సొంతం చేసుకున్నారు. మొహమ్మద్ షమీ, ప్రసిధ్ తాలా ఓ వికెట్ తీశారు. లివింగ్ స్టోన్ (33 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించాడు. ఇక ఈ మ్యాచ్లో ఇండియా ఓటమితో సిరీస్ 1-1తేడాతో సమమైంది. సిరీస్ డిసైడర్ అయిన మూడో మ్యాచ్ ఆదివారం మధ్యాహ్నం 3.30కు జరగనుంది.

First published:

Tags: Hardik Pandya, IND VS ENG, India vs england, Jasprit Bumrah, Rohit sharma, Team India, Virat kohli

ఉత్తమ కథలు