IND VS ENG 2021 THIRD TEST UPDATES TEAM INDIA FIGHT BACK IN LEEDS AND TRAIL BY 139 RUNS SRD
Ind Vs Eng : లీడ్స్ టెస్ట్ లో టీమిండియా కమ్ బ్యాక్.. పోరాడుతున్న కోహ్లీసేన..
Ind Vs Eng (BCCI Twitter)
Ind Vs Eng : కీలకమైన నాలుగో రోజు కూడా వీరిద్దరూ సత్తా చాటితే.. టీమిండియా మంచి స్థితిలో నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే ఐదు టెస్ట్ ల సిరీస్ లో టీమిండియా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే.
లీడ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ లో టీమిండియా (Team India) పోరాడుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 80 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పుజారా (Cheteswara Pujara) (91, 180 బంతుల్లో 15 ఫోర్లు), విరాట్ కోహ్లీ (Virat Kohli) (45, 91 బంతుల్లో 6 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. రోహిత్ శర్మ (Rohit Sharma) (59; 156 బంతుల్లో 7x4, 1x6) రాణించాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (Kl Rahul)(8) పూర్తిగా నిరాశపర్చాడు. వెలుతురు లేమి కారణంగా ముందుగానే ఆటను నిలిపివేశారు అంపైర్లు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రెయిగ్ ఓవర్టన్, ఓలీ రాబిన్సన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ప్రస్తుతం టీమిండియా 139 పరుగులు వెనుకబడి ఉంది. ఓవర్‌నైట్ స్కోరు 423/8తో మూడో రోజు అయిన శుక్రవారం ఆట ఆరంభించిన ఇంగ్లండ్ మరీ ఎక్కువ పరుగులేమీ చేయలేదు. 132.2 ఓవర్లు ఆడిన ఇంగ్లండ్ 432 పరుగులు చేసి ఆలౌట్ అయింది. క్రెయిగ్ ఓవర్టన్ (32; 42 బంతుల్లో 6×4) మొహ్మద్ షమీ వేసిన 130వ ఓవర్లో వరుసగా రెండు బౌండరీలు బాదాడు. 132వ ఓవర్లో అతడి బౌలింగ్‌లోనే వికెట్ల ముందు దొరికిపోయాడు. మరో ప్లేయర్ ఓలి రాబిన్సన్ (0; 15 బంతుల్లో) పరుగుల ఖాతా తెరవలేదు. జస్ప్రీత్ బుమ్రా వేసిన 132.2వ బంతికి బౌల్డ్ అయ్యాడు. జేమ్స్ అండర్సన్ (0) అజేయంగా నిలిచాడు. జో రూట్ (121; 165 బంతుల్లో 14x4) సెంచరీ చేయగా.. డేవిడ్ మలన్ (70) హాఫ్ సెంచరీ చేశాడు. ఓపెనర్లు రోరీ బర్న్స్ (52; 125 బంతుల్లో 5x4, 1x 6), హసీబ్ హమీద్ (60; 130 బంతుల్లో 11x4) హాఫ్ సెంచరీలు చేశారు. దాంతో ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగుల ఆధిక్యం దక్కింది.
ఇంగ్లండ్ ఆలౌట్ అనంతరం భారత్ రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్ ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ఆరంభించారు. ఇద్దరూ ఆచితూచి ఆడారు. క్రీజులో కుదురుకోవడానికి చాలా సమయం తీసుకున్నారు. అయితే 19 ఓవర్ల పాటు ఎంతో ఓపికగా ఆడిన రాహుల్ చివరికి క్రెయిగ్ ఓవర్టన్ బౌలింగ్‌లో స్లిప్‌లో జానీ బెయిర్‌స్టోకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. రాహుల్ 54 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత రోహిత్ తో కలిసిన పుజారా తన ఆటకు విరుద్దంగా దూకుడుగా ఆడాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు.
అయితే 59 పరుగులు చేసిన రోహిత్ ఓలీ రాబిన్సన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. అంపైర్ కాల్ గా ఔటవ్వడం విశేషం. రోహిత్ - పుజారా రెండో వికెట్ కి 82 పరుగులు జోడించారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, పుజారా మరో వికెట్ పడుకుండా భారత స్కోరును ముందుకు తీసుకువెళ్లారు. వీరిద్దరూ మూడో వికెట్ కు 99 పరుగులు జోడించారు. పుజారా సెంచరీకి చేరువ్వగా.. కోహ్లీ హాఫ్ సెంచరీ దగ్గరికి వచ్చాడు. కీలకమైన నాలుగో రోజు కూడా వీరిద్దరూ సత్తా చాటితే.. టీమిండియా మంచి స్థితిలో నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే ఐదు టెస్ట్ ల సిరీస్ లో టీమిండియా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.