Ind Vs Eng : మార్పులు ఖాయం.. ఆ ఇద్దరిపై వేటు..! నాలుగో టెస్టులో బరిలోకి దిగే తుది జట్టు ఇదే!

Team India

Ind Vs Eng : మూడో టెస్ట్ తర్వాత గంటల వ్యవధిలోనే భారత్ జట్టు సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆసుపత్రిలో చేరాడు. అతడికి మోకాలి గాయం అయినట్టు సమాచారం. లీడ్స్ టెస్టులో రెండో రోజు ఫీల్డింగ్ చేస్తుండగా.. జడేజా మోకాలి గాయం తిరగబెట్టిందట.

 • Share this:
  మూడో టెస్ట్ లో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా (India Vs England) ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇన్నింగ్స్ 78 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై (England) ఘోరంగా ఓడిపోయింది. ఐదు టెస్టుల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. అయితే ఈ ఘోరపరాజయాన్ని మాజీ క్రికెటర్లు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో మాజీ క్రికెటర్లు జట్టు కూర్పుపై సలహాలు ఇస్తున్నారు. మరోవైపు, మిగతా రెండు టెస్టుల్లో రొటేషన్ పాలసీ గురించి ఆలోచిస్తామని కోహ్లీ (Virat Kohli) చెప్పుకొచ్చాడు. ఈ మాటలను బట్టి నాలుగో టెస్ట్ లో టీమిండియాలో సమూల మార్పులు ఉంటాయని హింట్ ఇచ్చాడు. దీంతో సెప్టెంబర్ 2 నుంచి ప్రారంభం అయ్యే నాలుగో టెస్టులో రెండు మార్పులతో కోహ్లీసేన బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. మూడో టెస్టులో తప్ప ఓపెనర్లు రోహిత్ శర్మ (Rohit Sharma), లోకేష్ రాహుల్‌ (KL Rahul) జట్టుకు మంచి ఆరంభాలు ఇచ్చారు. క్రీజులో కుదురుకునే వరకు ఓపిగ్గా ఆడి.. ఆ తర్వాత గేర్ మార్చారు. లార్డ్స్ టెస్టులో ఈ ఇద్దరూ 100కు పైగా భాగస్వామ్యం నెలకొల్పిన విషయం తెలిసిందే. మూడో టెస్టులో మాత్రం విఫలమయ్యారు. దీంతో భారత్ భారీ స్కోర్ చేయలేకపోయింది. అయితే కీలకమైన నాలుగో టెస్టులో ఈ ఓపెనింగ్ జోడి మంచి ఆరంభం ఇవ్వాలని జట్టు మేనేజ్మెంట్ కోరుకుంటుంది. ఇటీవలి కాలంలో ఫామ్ కొల్పోయిన టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌ ఛతేశ్వర్ పుజారా (Cheteswara Pujara) రెండో టెస్ట్ ద్వారా గాడిలో పడి.. మూడో టెస్టులో ఆ ఫామ్ కొనసాగించాడు. తృటిలో సెంచరీ కోల్పోయాడు. దీంతో పుజారా మరోసారి చెలరేగాలని అభిమానులు ఆశిస్తున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా పూజిపై నమ్మకంగా ఉన్నాడు.

  ఇక, కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఓ భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిన సమయం వచ్చింది. అతడు సెంచరీ చేయాలని ఫాన్స్ ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. అయితే రెండో టెస్టులో పర్వాలేదనిపించిన వైస్ కెప్టెన్ అజింక్య రహానే.. మూడో టెస్టులో మళ్లీ విఫలమయ్యాడు. దీంతో అతడిని తుది జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్ ఉంది.

  అజింక్య రహానే స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌‌కు జట్టులో చోటు కల్పించాలని అందరూ అంటున్నారు. సూర్యతో పాటుగా మయాంక్ అగర్వాల్, హనుమ విహారి కూడా పోటీలో ఉన్నారు. ఈ ముగ్గురిలో ఎవరికైనా అవకాశం దక్కొచ్చు. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లీ.. రహానేను తప్పించే సాహసం చేస్తాడో లేదో చూడాలి. ఇక, వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.

  మూడో టెస్ట్ తర్వాత గంటల వ్యవధిలోనే భారత్ జట్టు సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆసుపత్రిలో చేరాడు. అతడికి మోకాలి గాయం అయినట్టు సమాచారం. లీడ్స్ టెస్టులో రెండో రోజు ఫీల్డింగ్ చేస్తుండగా.. జడేజా మోకాలి గాయం తిరగబెట్టిందట. దీంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా టీమిండియా మేనేజ్‌మెంట్ అతని గాయానికి స్కానింగ్ చేయించినట్లు తెలిసింది.దీంతో జడేజా నాలుగో టెస్ట్ ఆడకపోవచ్చు. జడేజా స్థానంలో శార్దూల్ ఠాకూర్ లేదా హనుమ విహారి ఆడొచ్చు. శార్దూల్ మంచి ఆల్‌రౌండర్ అన్న విషయం తెలిసిందే. పేస్ బౌలింగ్‌తో పాటు భారీ షాట్లు ఆడగలడు. విహారి కూడా బౌలర్ అన్న సంగతి తెలిసిందే. బ్యాటింగ్ బలోపేతం చేసేందుకు కెప్టెన్ విహారికి అవకాశం ఇవ్వొచ్చు.

  ఇది కూడా చదవండి : వామ్మో.. సురేష్ రైనా ఏంటి.. WWE జాన్ సీనా లా మారిపోయాడు.. ఆ స్టంట్లు ఏంటి సామీ..!

  ఇక, బౌలింగ్ విభాగంలోనూ మార్పులు చేసే అవకాశం ఉంది. మొదటి టెస్టులో ఇషాంత్ శర్మ ఆడలేదు. తర్వాతి రెండు టెస్టుల్లో అతను మొత్తం 56 ఓవర్లు బౌల్ చేశాడు. ఇందులో అతనికి ఐదు వికెట్లు లభించాయి. మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఇషాంత్ 22 ఓవర్లలో 92 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. మరోవైపు చీలమండ గాయం, కండరాల ఒత్తిడి కారణంగా ఇషాంత్ ఇబ్బంది పడ్డాడు. ఇంగ్లండ్ పర్యటనలో, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ నుంచి ఇప్పటివరకు జరిగిన మూడవ లేదా నాల్గవ స్పెల్ సమయంలో ఇషాంత్ అంత ప్రభావం చూపించలేకపోయాడు. దీంతో అతడిపై వేటు పడనుంది.

  ఇది కూడా చదవండి : దీపికా, లక్ష్మీ రాయ్, అసిన్ .. మిస్టర్ కూల్ ధోనీ డేటింగ్ చేసిన హీరోయిన్స్ లిస్ట్ ఇదే ..

  ఇషాంత్ స్థానంలో వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ జట్టులోకి రావడం ఖాయం అయింది. యాష్ ఈ సిరీసులో ఒక్క మ్యాచ్ కూడా ఆడని విషయం తెలిసిందే. ఈ సిరీస్ కు ముందు కౌంటీ క్రికెట్ ఆడి సత్తాచాటాడు. ఆ ఫామ్ నాలుగో టెస్టులో కొనసాగించాలని చూస్తున్నాడు. ఇక పేస్ కోటాలో మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ ఆడనున్నారు. ఈ త్రయం బాగా రాణిస్తుండడం టీమిండియాకు కలిసొచ్చే అంశం.

  టీమిండియా తుది జట్టు (అంచనా) : రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్‌, చేతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే/మయాంక్ అగర్వాల్/సూర్యకుమార్ యాదవ్‌‌, రిషబ్ పంత్, హనుమ విహారి/శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, మొహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ.
  Published by:Sridhar Reddy
  First published: