Ind Vs Eng : వయస్సు పెరుగుతున్నా తగ్గేదే లే.. అండర్సన్ కా కమాల్.. 70 ఏళ్ల చరిత్రలో అరుదైన ఘనత..

India vs England

Ind Vs Eng : లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు (Team India) 364 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ సీనియర్ బౌలర్ జేమ్స్ అండర్సన్ మరోసారి 5 వికెట్లతో చెలరేగి ఇండియా బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీశాడు.

 • Share this:
  లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు (Team India) 364 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ సీనియర్ బౌలర్ జేమ్స్ అండర్సన్ మరోసారి 5 వికెట్లతో చెలరేగి ఇండియా బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీశాడు. దీంతో అరుదైన రికార్డు నెలకొల్పాడు. గత 70 ఏళ్లలో ఈ ఘనత సాధించిన అత్యంత పెద్ద వయస్కుడైన పేసర్‌గా రికార్డుల్లోకెక్కాడు. లార్డ్స్ టెస్టు తొలి రోజు రోహిత్‌ శర్మ, చతేశ్వర్ పుజారాను ఔట్ చేసిన అండర్సన్.. రెండో రోజు అజింక్య రహానే, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం అండర్సన్ వయసు 39 ఏళ్లు. ఈ వయసులో కూడా తనలో ఏమాత్రం పదును తగ్గలేదని మరోసారి నిరూపించుకున్నాడు. బుల్లెట్ బంతులతో బ్యాట్స్‌మన్‌కు చుక్కలు చూపిస్తున్నాడు. టెస్టు క్రికెట్‌లో అతి పెద్ద వయసులో ఒక ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు సాధించిన రికార్డు దక్షిణాఫ్రికా ప్లేయర్ జెఫ్ చబ్ పేరిట ఉంది. 1951లో ఇంగ్లండ్‌తో మాంచెస్టర్‌లో జరిగిన టెస్టులో చబ్ ఐదు వికెట్లు పడగొట్టాడు. అప్పటికి అతడి వయసు 40 ఏళ్ల 86 రోజులు. 70 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు జేమ్స్ అండర్సన్ 39 ఏళ్ల 14 రోజుల వయసులో ఐదు వికెట్ల ఘనత అందుకున్నాడు. టెస్టులో ఐదు వికెట్ల ఘనత సాధించడం అండర్సన్‌కు ఇది 31వ సారి. ప్రస్తుత ఆటగాళ్లలో ఆర్ అశ్విన్ (30), స్టువర్ట్ బ్రాడ్ (18), షకిబుల్ హాసన్ (18), నాథన్ లియోన్ (18) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

  జేమ్స్ అండర్సన్‌కు లార్డ్స్‌ మైదానంలో భారత్‌పై మంచి రికార్డే ఉంది. 2007 నుంచి చూసుకుంటే భారత్‌పై లార్డ్స్‌ టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్‌లో నాలుగుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన అండర్సన్‌.. మరో రెండుసార్లు నాలుగు వికెట్లు తీశాడు. ఓవరాల్‌గా లార్డ్స్‌ మైదానంలో టీమిండియాపై అండర్సన్‌ టెస్టుల్లో ఇప్పటివరకు 33 వికెట్లు తీశాడు. తొలి టెస్టు మూడో రోజు కేఎల్ రాహుల్‌ను అవుట్ చేసిన అండర్సన్ టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో టీమిండియా స్పిన్ దిగ్గజ అనిల్ కుంబ్లేను అధిగమించాడు. మొత్తంగా అండర్సన్‌ 164 టెస్టుల్లో 626 వికెట్లు తీశాడు.

  ఇక, రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. కెప్టెన్‌ జో రూట్‌ (48 నాటౌట్‌; 75 బంతుల్లో 6x4), జానీ బెయిర్‌స్టో (6 నాటౌట్‌; 17 బంతుల్లో) పరుగులతో క్రీజులో ఉన్నారు. సిబ్లీ (11), హమీద్‌ (0) నిరాశపర్చగా.. రోరీ బర్న్స్‌ (49; 136 బంతుల్లో 7x4) ఆకట్టుకున్నాడు. భారత పేసర్ మొహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ ఇంకా భారత్ తొలి ఇన్నింగ్స్‌కు 245 పరుగులు వెనకబడి ఉంది.
  Published by:Sridhar Reddy
  First published: