IND Vs ENG 1st Test: ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి టెస్టు తొలి రోజు భారత పట్టు సాధించింది. తొలి రోజే ఇంగ్లండ్ కు చుక్కలు చూపించింది. అయిదు టెస్టుల సిరీస్‌లో భాగంగా నాటింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ తొలి రోజు వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రోహిత్ 9 పరుగులు, రాహుల్ 9 పరుగులతో ఉన్నారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకు ఆలౌటైంది. భారత్ బౌలర్లు అద్భుతంగా చెలరేగారు. ముఖ్యంగా బుమ్రా, షమీ నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడిచేశారు. బుమ్రా నాలుగు, షమీ మూడు వికెట్లు తీశాడు. శార్దుల్ ఠాకూర్ రెండు, సిరాజ్ ఒక వికెట్ పడగొట్టాడు. మ్యాచ్ ఆరంభం నుంచి భారత పేసర్లు చెలరేగిపోవడంతో.. వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ కోలుకోలేకపోయింది. ఇన్నింగ్స్ 59 ఓవర్ మొదటి బంతికి 64 పరుగులు చేసిన రూట్‌ను ఎల్బీగా వెనక్కి పంపిన శార్దూల్ ఆ తర్వాత నాలుగో బంతికి ఓలీ రాబిన్‌సన్‌ను డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. మరుసటి ఓవర్లో బుమ్రా స్టువర్ట్ బ్రాడ్‌ను వెనక్కి పంపడంతో ఇంగ్లండ్ 160 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్‌ను కోల్పోయింది. అయితే చివర్లో సామ్ కరణ్ నిలబడడంతో ఇంగ్లండ్ 65.4 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 183 పరుగుల స్కోరు చేసింది.
ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ విషయానికి వస్తే కెప్టెన్ జో రూట్ అర్థ సెంచరీతో మెరిశాడు. 89 బంతుల్లో అర్థ సెంచరీ మార్క్ అందుకున్న రూట్ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు ఉన్నాయి. రూట్ నిలకడైన ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్ కుదురుకుంటుంది. జానీ బెయిర్ స్టో 29 పరుగులతో అతనికి కాసేపు సహకరించాడు. ఇద్దరి మధ్య 70 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. దీంతో నాలుగో వికెట్ కు విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు.
ఆ తరువాత నుంచే ఇంగ్లండ్ పతనం జోరందుకుంది. రూట్ ను శార్ధూల్ అవుట్ చేయగా.. బరిస్టోను షమి పెవిలియన్ కు పంపాడు. ఆ తరువాత బుమ్రా నిప్పులు చెరగడంతో ఇంగ్లండ్ పతనం కొనసాగింది. శామ్ కరణ్ ఒక్కడే 27 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇక రెండో రోజు ఆటలో భారత బ్యాట్స్ మెన్ రాణింపుపైనే ఫలితంఆధారపడి ఉంటుంది. ఇప్పటికే రోహిత్, రాహుల్ ఇద్దరూ క్రీజ్ లో ఉన్నారు. తొలి సెషన్ వరకు వికెట్ పడకుండా జాగ్రత్త పడితే మ్యాచ్ పై పట్టు సాధించవచ్చు.. కానీ తొలి రోజు ఆట చూసిన తరువాత.. బౌలర్లకు పిచ్ అనుకూలించే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, Ind Vs Eng 2018, Sports