ఇంగ్లండ్ గడ్డపై కీలకమైన ఐదో టెస్టులో బోల్తా పడ్డ టీమిండియా (Team India).. ఇప్పుడు ధనాధన్ సిరీస్(IND vs ENG First T20I) లో తలపడడానికి సిద్ధమైంది. గురువారం నుంచి భారత్-ఇంగ్లండ్ మధ్య మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్ సన్నాహాల కోసం ఈ సిరీస్‌ను ఉపయోగించుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఈ మ్యాచ్‌కు రోహిత్ శర్మ ( Rohit Sharma) అందుబాటులోకి రానున్నాడు. ఇటీవల కరోనా బారిన పడిన అతడు కోలుకుని రెండు రోజుల కిందటే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. దీంతో టీ20 సిరీస్‌లో అతడు బరిలోకి దిగడం ఖాయమైంది. ఇక, ఈ మ్యాచ్‌కు రీషెడ్యూల్ టెస్ట్ ఆడిన సీనియర్ టీమ్ దూరంగా ఉండగా.. ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్ గెలిచిన ద్వితీయ శ్రేణి జట్టు బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో తుది జట్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
రోహిత్ శర్మ కరోనా నుంచి పూర్తిగా కోలుకోవడం టీమిండియాకు ప్లస్ పాయింట్. ఐపీఎల్ లో చెత్తాట తర్వాత ఈ సిరీస్ లో సత్తా చాటేందుకు సై అంటున్నాడు రోహిత్ శర్మ. సూపర్ ఫామ్ లో ఉన్న ఇషాన్ కిషన్‌తో కలిసి రోహిత్ ఓపెనింగ్ చేయనున్నాడు. సౌతాఫ్రికాతో సిరీస్‌లో ఇషాన్ కిషన్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 4 ఇన్నింగ్స్‌లో 192 పరుగులు చేశాడు. ఐర్లాండ్‌తోనూ పర్వాలేదనిపించాడు.
ఇక మిడిలార్డర్‌లో సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా బరిలోకి దిగనున్నారు. ఐర్లాండ్‌తో 72 పరుగులతో సత్తా చాటిన సంజూ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. తనదైన బ్యాటింగ్‌తో జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకున్న సూర్యకుమార్ యాదవ్.. ఇంగ్లండ్ గడ్డపై సత్తా చాటాలనే కసితో ఉన్నాడు.
టీ20 ప్రపంచకప్ జట్టులో ఉండాలంటే ఈ సిరీస్‌లో రాణించడం అతనికి చాలా ముఖ్యం. అనూహ్యంగా భారత జట్టులోకి వచ్చిన దీపక్ హుడా.. తనకు వచ్చిన అవకాశాలను రెండు చేతులతో అందిపుచ్చుకుంటున్నాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో సత్తా చాటిన అతను.. అంతర్జాతీయ క్రికెట్‌లోనూ అదే జోరు కొనసాగిస్తున్నాడు. ఐర్లాండ్‌తో 57 బంతుల్లో 104 పరుగులతో సత్తా చాటాడు.
ఇక, ఫినిషర్లుగా హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ కీ రోల్ ప్లే చేయనున్నారు. ఈ ఇద్దరూ ప్రస్తుతం సూపర్ టచ్ లో ఉన్నారు. ఐపీఎల్ లో సత్తా చాటిన ఈ ఇద్దరూ.. అంతర్జాతీయ క్రికెట్ లోనూ అదే జోరు కొనసాగిస్తున్నారు. ఇక, బౌలింగ్ లో భువనేశ్వర్ కుమార్ లీడర్ గా వ్యవహరించనున్నాడు. భువనేశ్వర్ కుమార్ నేతృత్వంలో ఆవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్ బాధ్యతలు పంచుకోనున్నారు.
సౌతాఫ్రికాతో పాటు ఐర్లాండ్ సిరీస్‌ల్లో ఈ నలుగురు సత్తా చాటారు. ముఖ్యంగా హర్షల్ పటేల్ బ్యాట్‌తోను మెరుస్తున్నాడు. ఇటీవల జరిగిన సన్నాహక మ్యాచ్‌లో హర్షల్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఫాస్ట్ పిచ్‌ల నేపథ్యంలో ఉమ్రాన్ మాలిక్‌కు అవకాశం ఇవ్వాలనుకుంటే మాత్రం అవేశ్ ఖాన్ బెంచ్‌కు పరిమితమవుతాడు.
తొలి టీ20 కోసం టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్(అంచనా):
రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్డిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్/ అవేశ్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, Dinesh Karthik, Hardik Pandya, IND VS ENG, India vs england, Rohit sharma