వరుసగా రెండు వన్డేలు ఓడిపోయామన్న బాధ.. మరోవైపు సిరీస్ కోల్పోయామన్న కసి.. టీమిండియా పగటి పూటే బంగ్లా పులులుకు చుక్కలు చూపించింది. పరుగుల వరద పారించారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్, కోహ్లీల విధ్వంసానికి మైదానం మూగబోయింది. వీరిద్దరి వీర వీహారంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది. దీంతో.. బంగ్లా దేశ్ ముందు భారీ టార్గెట్ సెట్ చేసింది. ఇషాన్ కిషన్ (131 బంతుల్లో 210 పరుగులు ; 24 ఫోర్లు, 10 సిక్సర్లు) డబుల్ సెంచరీతో వీరవీహారం చేస్తే.. విరాట్ కోహ్లీ (91 బంతుల్లో 113 పరుగులు ; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో వాషింగ్టన్ సుందర్ (37), అక్షర్ పటేల్ (20) మెరుపులు మెరిపించడంతో టీమిండియా స్కోరు 400 పరుగులు దాటింది. ఓ దశలో టీమిండియా 450 పరుగులు చేసేలా కన్పించింది. అయితే, ఆఖరి ఓవర్లలో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో 409 పరుగుల స్కోరుకే పరిమితమైంది. బంగ్లా బౌలర్లలో టస్కిన్ అహ్మద్, ఎబాదత్ హెస్సేన్, షకీబ్ తలా రెండు వికెట్లు తీశారు.
ఇక, వన్డేల్లో సెంచరీలు కామన్.. కానీ డబుల్ సెంచరీలు అంటే ఎప్పుడో ఒకసారి జరిగే అద్భుతం. ఇక, వన్డేల్లో సెంచరీ కొడితే ఆ బ్యాట్స్ మన్ ను అందరూ ప్రశంసిస్తారు. అదే డబుల్ సెంచరీ కొట్టారంటే వాళ్లను అందరూ ఆకాశానికెత్తేస్తారు. ఇప్పుడు అదే ఫీట్ ను అందుకుని వారెవ్వా అన్పించాడు టీమిండియా యంగ్ గన్ ఇషాన్ కిషన్. ఈ ఇన్నింగ్స్ లో ఇషాన్ కిషన్ శివతాండవం ఆడాడు. అతని ధాటికి బంగ్లా బౌలర్లు బెంబెలేత్తిపోయారు. బౌలర్ ఎవరైనా సరే.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ క్రమంలో 126 బంతుల్లో 200 పరుగులు చేశాడు. దీంతో డబుల్ సెంచరీ మార్క్ అందుకున్నాడు.
85 బంతుల్లో సెంచరీ మార్కు అందుకున్న ఇషాన్.. ఆ తర్వాత కేవలం 41 బంతుల్లోనే మరో 100 పరుగులు చేశాడంటే అతని విధ్వంసం ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. డబుల్ సెంచరీ తర్వాత రెండు భారీ షాట్లు ఆడిన ఇషాన్ కిషన్ 210 పరుగులు చేసి ఔటయ్యాడు. 131 బంతుల్లో 210 పరుగులు చేశాడు ఇషాన్. అతని ఇన్నింగ్స్ లో 24 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి.
ఇక, ఈ ఫీట్ అందుకున్న నాలుగో భారత బ్యాటర్ గా ఇషాన్ కిషన్ నిలిచాడు. ఇషాన్ కిషన్ కన్నా ముందు సచిన్, సెహ్వాగ్, రోహిత్ శర్మ ఈ వన్డేల్లో డబుల్ సెంచరీలు చేశారు. ఇక, విరాట్ కోహ్లీ కూడా దాదాపు మూడేళ్ల తర్వాత వన్డేల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఈ సెంచరీ రికీ పాంటింగ్ సెంచరీల రికార్డును అధిగమించాడు. ఇక, కోహ్లీ, ఇషాన్ కిషన్ లు రెండో వికెట్ కు 295 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇదో రికార్డు.
తుది జట్లు :
టీమిండియా : కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్
బంగ్లాదేశ్ : లిటన్ దాస్, అన్మల్ హోక్, షకీబ్ అల్ హసన్, యాసిర్ అలీ, ముష్ఫీకర్ రహీమ్, మహ్మదుల్లా, అఫిఫ్ హోస్సేన్, మెహదీ హసన్, ముస్తఫిజుర్ రహ్మన్, ఎబాదోత్ హోస్సేన్, టస్కిన్ అహ్మాద్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, IND vs BAN, India vs bangladesh, KL Rahul, Team India, Virat kohli