IND vs BAN 2nd Test : బంగ్లాదేశ్ (Bangladesh)తో జరుగుతున్న రెండో టెస్టు రసకందాయంలో పడింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ (India) తన రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లకు 45 పరుగులు చేసింది. అక్షర్ పటేల్ (54 బంతుల్లో 26 బ్యాటింగ్; 3 ఫోర్లు), నైట్ వాచ్ మన్ బ్యాటర్ జైదేవ్ ఉనాద్కట్ (8 బంతుల్లో 3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత్ గెలవాలంటే మిగిలి ఉన్న రెండో రోజుల్లో మరో 100 పరుగులు చేయాల్సి ఉంది. అదే సమయంలో బంగ్లాదేశ్ గెలవాలంటే మరో 6 వికెట్లు తీయాల్సి ఉంది. పిచ్ స్పిన్ కు అనుకూలిస్తుండటంతో పరుగులు చేయడం అంత సులభం కాదు. మూడో రోజు ఆటలో ఏకంగా 14 వికెట్లు నేలకూలడం విశేషం. మెదీ హసన్ మిరాజ్ మూడు వికెట్లు తీశాడు. షకీబుల్ హసన్ కు మరో వికెట్ లభించింది.
ఇక మూడో రోజు ఆటలో బంగ్లాదేశ్ ప్లేయర్ తైజుల్ ఇస్లామ్ పై కోహ్లీ ఆగ్రహించాడు. విరాట్ కోహ్లీ (1) రెండో ఇన్నింగ్స్ లోనూ నిరాశ పరిచాడు. మెదీ హసన్ వేసిన బౌలింగ్ లో కోహ్లీ డిఫెన్స్ ఆడగా.. బంతి బ్యాట్ హ్యాండిల్ భాగంలో తగిలి షార్ట్ లెగ్ దిశగా పయనించింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న మోమినుల్ హక్ డైవ్ చేస్తూ అద్భుత క్యాచ్ ను అందుకున్నాడు. కోహ్లీ పెవిలియన్ కు వెళ్తుండగా.. బంగ్లాదేశ్ ప్లేయర్లు సంబరాల్లో మునిగిపోయారు. అయితే తైజుల్ ఇస్లామ్ కోహ్లీని హేళన చేస్తూ గట్టిగా అరిచాడు. దీనికి ఆగ్రహించిన కోహ్లీ అలా చేయొద్దంటూ బంగ్లాదేశ్ ప్లేయర్ ను హెచ్చరించాడు. అంపైర్లు కలుగజేసుకోగా.. బంగ్లాదేశ్ కెప్టెన్ కోహ్లీ వద్దకు వచ్చాడు. మీ ప్లేయర్స్ అతి చేస్తున్నారంటూ. .అది మంచిది కాదని కోహ్లీ షకీబుల్ కు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
Angry pic.twitter.com/2VuYLtxyqD
— Adnan Ansari (@AdnanAn71861809) December 24, 2022
ఇక మ్యాచ్ విషయానికి వస్తే స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ ను బంగ్లాదేశ్ స్పిన్నర్లు హడలెత్తించారు. షకీబుల్ హసన్, మెదీ హసన్ మిరాజ్ లు ప్రతి బంతికి వికెట్ తీసేలా కనిపించారు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (2)ను షకీబుల్ హసన్ అవుట్ చేసి బంగ్లాదేశ్ కు బ్రేక్ ఇచ్చాడు. ఇక మిగిలిన మూడు వికెట్లను మెదీ హసన్ సొంతం చేసుకున్నాడు. పుజారా (6), శుబ్ మన్ గిల్ (7)లు స్టంపౌట్స్ అయ్యారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న విరాట్ కోహ్లీ (1) చేతులెత్తేశాడు. అయితే బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుగా వచ్చిన అక్షర్ పటేల్ ఆడటంతో భారత్ ఆ మాత్రమైనా స్కోరు సాధించగలిగింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bangladesh, IND vs BAN, India vs bangladesh, KL Rahul, Team India, Virat kohli