IND vs BAN 2nd Test : భారత్ (Bangladesh), బంగ్లాదేశ్ (Bangladesh) మధ్య జరుగుతున్న రెండో టెస్టు రసకందాయంలో పడింది. 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా (Team India) మూడో రోజు ఆట ముగిసే సమయానికి 23 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 45 పరుగులు చేసింది. అక్షర్ పటేల్ (54 బంతుల్లో 26 బ్యాటింగ్; 3 ఫోర్లు), నైట్ వాచ్ మన్ బ్యాటర్ జైదేవ్ ఉనాద్కట్ (8 బంతుల్లో 3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత్ గెలవాలంటే మిగిలి ఉన్న రెండో రోజుల్లో మరో 100 పరుగులు చేయాల్సి ఉంది. అదే సమయంలో బంగ్లాదేశ్ గెలవాలంటే మరో 6 వికెట్లు తీయాల్సి ఉంది. పిచ్ స్పిన్ కు అనుకూలిస్తుండటంతో పరుగులు చేయడం అంత సులభం కాదు. మూడో రోజు ఆటలో ఏకంగా 14 వికెట్లు నేలకూలడం విశేషం. మెదీ హసన్ మిరాజ్ మూడు వికెట్లు తీశాడు. షకీబుల్ హసన్ కు మరో వికెట్ లభించింది.
స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ ను బంగ్లాదేశ్ స్పిన్నర్లు హడలెత్తించారు. షకీబుల్ హసన్, మెదీ హసన్ మిరాజ్ లు ప్రతి బంతికి వికెట్ తీసేలా కనిపించారు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (2)ను షకీబుల్ హసన్ అవుట్ చేసి బంగ్లాదేశ్ కు బ్రేక్ ఇచ్చాడు. ఇక మిగిలిన మూడు వికెట్లను మెదీ హసన్ సొంతం చేసుకున్నాడు. పుజారా (6), శుబ్ మన్ గిల్ (7)లు స్టంపౌట్స్ అయ్యారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న విరాట్ కోహ్లీ (1) చేతులెత్తేశాడు. అయితే బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుగా వచ్చిన అక్షర్ పటేల్ ఆడటంతో భారత్ ఆ మాత్రమైనా స్కోరు సాధించగలిగింది.
బంగ్లాదేశ్ తమ రెండో ఇన్నింగ్స్ లో 70.2 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 3 వికెట్లతో మెరిశాడు.మొహమ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్ లు చెరో రెండు వికెట్లు తీశారు. బంగ్లాదేశ్ తరఫున లిట్టన్ దాస్ (98 బంతుల్లో 78; 7 ఫోర్లు) ఒంటిరి పోరాటం చేశాడు. నురుల్ హసన్ (31), టస్కిన్ అహ్మద్ (31)తో కలిసి కీలక భాగస్వామ్యాలను నెలకొల్పాడు. జకీర్ హసన్ (51) రాణించాడు. దాంతో భారత్ కంటే 144 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
ఒక దశలో బంగ్లా జట్టు 133 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే లిట్టన్ దాస్ వీరోచిత పోరాటం చేశాడు. నురుల్ హసన్, తస్కిన్ అహ్మద్ లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. దాంతో బంగ్లాదేశ్ స్కోరు 200 మార్కును దాటింది. సెంచరీవైపు వెళ్తున్న లిట్టన్ దాస్ ను సిరాజ్ అవుట్ చేశాడు. తైజుల్ ఇస్లామ్ (1)ను అశ్విన్ అవుట్ చేశాడు. ఆఖర్లో ఖలేద్ అహ్మద్ (4) రనౌట్ అయ్యాడు. దాంతో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ముగిసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Axar Patel, Bangladesh, Cheteswar Pujara, IND vs BAN, India vs bangladesh, KL Rahul, Mohammed Siraj, Ravichandran Ashwin, Rishabh Pant, Shreyas Iyer, Team India, Virat kohli