IND vs BAN 2nd Test : చాలా రోజుల తర్వాత రిషభ్ పంత్ (Rishabh Pant) తన బ్యాట్ కు పని చెప్పాడు. ఎప్పుడో ఈ ఏడాది ఇంగ్లండ్ (England) పర్యటనలో చివరిసారిగా శతకం బాదిన అతడు.. మళ్లీ అటువంటి ప్రదర్శనను దాదాపుగా రిపీట్ చేశాడు. గత కొంత కాలంగా ఫామ్ లో లేక అందరి చేత చివాట్లు తింటున్న పంత్.. బంగ్లాదేశ్ (Bangladesh) తో జరిగిన రెండో టెస్టులో చెలరేగి ఆగాడు. రెండో రోజు బ్యాటింగ్ కు వచ్చిన పంత్ సూపర్ బ్యాటింగ్ (104 బంతుల్లో 93; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) బాదాడు. ఈ క్రమంలో భారత్ ప్రస్తుతం 67 ఓవర్లలో 5 వికెట్లకు 253 పరుగులు చేసింది. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ (95 బంతుల్లో 79 బ్యాటింగ్, 9 ఫోర్లు, 2 సిక్సర్లు) క్రీజులో ఉన్నారు. భారత్ 27 పరుగుల ఆధిక్యంలో ఉంది.
ఓవర్ నైట్ స్కోర్ 19/0 తో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా బ్యాటింగ్ లో తడబడింది. స్పిన్నర్లు, పేసర్లు సమష్టిగా రాణించడంతో భారత బ్యాటర్లు పరుగులు చేయలేక నానా తంటాలు పడ్డారు. భారత్ ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి డీలా పడింది. కెప్టెన్ అయినా తన ఆట మార్చుకోలేకపోతున్న కేఎల్ రాహుల్ (10) మరోసారి నిరాశ పరిచాడు. ముఖ్యంగా తన జిడ్డు బ్యాటింగ్ తో విసగించాడు. పూర్తి డిఫెన్స్ లోకి వెళ్లాడు రాహుల్. బంగ్లాదేశ్ ఎడమ చేతి వాటం స్పిన్నర్ తైజుల్ ఇస్లాం భారత్ ను దెబ్బకొట్టాడు. రెండో రోజు లంచ్ సమయానికి 36 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. లంచ్ అనంతరం కోహ్లీ (24) నిరాశ పరిచాడు. అయితే ఈ దశలో జతకలిసిన శ్రేయస్ అయ్యర్, పంత్ చెలరేగి ఆడారు. వీరిద్దరూ బంగ్లాదేశ్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. పోటీ పడి మరీ పరుగులు సాధించారు.
అంతకుముందు భారత బౌలర్లు దుమ్మురేపడంతో బంగ్లాదేశ్ 227 పరుగులకు ఆలౌట్ అయింది. మొమినుల్ హక్ (157 బంతుల్లో 84 పరుగులు ; 12 ఫోర్లు, 1 సిక్సర్) కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. ముష్ఫీకర్ రీమ్ (26 పరుగులు), లిటన్ దాస్ (25 పరుగులు), షాంటో (24 పరుగులు) ఫర్వాలేదన్పించారు. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ చెరో నాలుగు వికెట్లతో దుమ్మురేపారు. వీరిద్దరి ధాటికి మూడో సెషన్ లో బంగ్లా ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. ఇక, 12 ఏళ్ల తర్వాత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన జయదేవ్ ఉనాద్కత్ రెండు వికెట్లతో సత్తా చాటాడు. మహ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్ లకు వికెట్లు ఏం దక్కలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IND vs BAN, India vs bangladesh, Rishabh Pant, Shreyas Iyer, Team India, Virat kohli