IND vs BAN 2nd Test : రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భాగంగా బంగ్లాదేశ్ (Bangladesh)తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ (India) పట్టు బిగించింది. మూడో రోజు బంగ్లాదేశ్ తమ రెండో ఇన్నింగ్స్ లో 70.2 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 3 వికెట్లతో మెరిశాడు.మొహమ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్ లు చెరో రెండు వికెట్లు తీశారు. బంగ్లాదేశ్ తరఫున లిట్టన్ దాస్ (98 బంతుల్లో 78; 7 ఫోర్లు) ఒంటిరి పోరాటం చేశాడు. నురుల్ హసన్ (31), టస్కిన్ అహ్మద్ (31)తో కలిసి కీలక భాగస్వామ్యాలను నెలకొల్పాడు. జకీర్ హసన్ (51) రాణించాడు. దాంతో భారత్ కంటే 144 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్టులో భారత్ గెలవాలంటే 145 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది. మ్యాచ్ కు మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండటంతో జాగ్రత్తగా ఆడితే భారత్ విజయం ఖాయం.
అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు ఓవర్ నైట్ స్కోరు 7/0 తో మూడో రోజు ఆటను ప్రారంభించిన బంగ్లాదేశ్ కు ఆదిలోనే షాక్ తగిలింది. అశ్విన్ జోరుకు జట్టు స్కోరు 13 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది బంగ్లాదేశ్. ఐదు పరుగులు చేసిన షాంటో అశ్విన్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత ఫస్ట్ ఇన్నింగ్స్ హీరో మొమినుల్ హక్ కూడా కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి సిరాజ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. దీంతో.. 26 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కెప్టెన్ షకీబ్ తో కలిసి జకీర్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ ఇద్దరూ కాసేపు టీమిండియా బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. అయితే, ఈ జోడి జోరుకు బ్రేకులు వేశాడు జయదేవ్.
బంగ్లా కెప్టెన్ షకీబ్ ను బోల్తా కొట్టించాడు. షకీబ్ 13 పరుగులు చేసి శుభ్ మన్ గిల్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే ముష్ఫీకర్ రహీమ్ 9 పరుగులు చేసి.. అక్షర్ పటేల్ ఔలింగ్ లో పెవిలియన్ బాట పట్టాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. మరో ఎండ్ లో అద్భుతమైన బ్యాటింగ్ తో ఆకట్టుకుంటున్నాడు. 51 పరుగులు చేశాక జకీర్ హసన్ పెవిలియన్ కు చేరాడు. ఒక దశలో బంగ్లా జట్టు 133 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే లిట్టన్ దాస్ వీరోచిత పోరాటం చేశాడు. నురుల్ హసన్, తస్కిన్ అహ్మద్ లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. దాంతో బంగ్లాదేశ్ స్కోరు 200 మార్కును దాటింది. సెంచరీవైపు వెళ్తున్న లిట్టన్ దాస్ ను సిరాజ్ అవుట్ చేశాడు. తైజుల్ ఇస్లామ్ (1)ను అశ్విన్ అవుట్ చేశాడు. ఆఖర్లో ఖలేద్ అహ్మద్ (4) రనౌట్ అయ్యాడు. దాంతో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ముగిసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Axar Patel, IND vs BAN, India vs bangladesh, KL Rahul, Mohammed Siraj, Rishabh Pant, Shreyas Iyer, Team India, Virat kohli