ఢాకాలోని షేర్ ఏ బంగ్లా స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్ట్ రెండో రోజు ఆటలో టీమిండియా బ్యాటర్లు తడబడుతున్నారు. రెండో రోజు లంచ్ సమయానికి 36 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. ప్రస్తుతం బంగ్లా కన్నా 186 పరుగులు వెనుకంజలో ఉంది. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ (56 బంతుల్లో 18 పరుగులు ; 2 ఫోర్లు నాటౌట్), రిషబ్ పంత్ (14 బంతుల్లో 12 పరుగులు నాటౌట్ ; 1 ఫోర్) ఉన్నారు. కేఎల్ రాహుల్ (45 బంతుల్లో 10 పరుగులు), శుభ్ మన్ గిల్ (39 బంతుల్లో 20 పరుగులు), ఛతేశ్వర్ పుజారా (55 బంతుల్లో 24 పరుగులు) పెవిలియన్ బాట పట్టారు. బంగ్లా బౌలర్లలో తైజూల్ ఇస్లాం మూడు వికెట్లతో దుమ్మురేపాడు.
ఓవర్ నైట్ స్కోర్ 19/0 తో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా బ్యాటింగ్ లో తడబడింది. స్పిన్నర్లు, పేసర్లు సమష్టిగా రాణించడంతో భారత బ్యాటర్లు పరుగులు చేయలేక నానా తంటాలు పడ్డారు. భారత్ ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి డీలా పడింది. కెప్టెన్ అయినా తన ఆట మార్చుకోలేకపోతున్న కేఎల్ రాహుల్ (10) మరోసారి నిరాశ పరిచాడు. ముఖ్యంగా తన జిడ్డు బ్యాటింగ్ తో విసగించాడు. పూర్తి డిఫెన్స్ లోకి వెళ్లాడు రాహుల్. బంగ్లాదేశ్ ఎడమ చేతి వాటం స్పిన్నర్ తైజుల్ ఇస్లాం భారత్ ను దెబ్బకొట్టాడు.
Lunch on Day 2 of the 2nd Test.#TeamIndia 86/3 67 runs were scored in the morning session in 28 overs. Scorecard - https://t.co/XZOGpedaAL #BANvIND pic.twitter.com/5LKrZfs5Rc
— BCCI (@BCCI) December 23, 2022
ఆట మొదలైన ఆరో ఓవర్లోనే కేఎల్ రాహుల్ ను ఎల్బీగా వెనక్కుపంపాడు. ఇక తొలి టెస్టులో సెంచరీతో అదరగొట్టిన గిల్ ను కూడా తన మరుసటి ఓవర్లోనే వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దాంతో, 38 పరుగులకే భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్ కు వచ్చిన సీనియర్లు ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ టీమిండియాను ఆదుకునే ప్రయత్నం చేశారు.
ఇద్దరూ ఇన్నింగ్స్ ను నిర్మించే ప్రయత్నం చేశారు. అయితే, ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని మళ్లీ తైజూల్ విడదీశాడు. తైజూల్ బౌలింగ్ లో 24 పరుగులు చేసిన పుజారా.. మొమినుల్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో, 34 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత వచ్చిన పంత్ తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు కోహ్లీ.
ఇక, అంతకుముందు భారత బౌలర్లు దుమ్మురేపడంతో బంగ్లాదేశ్ 227 పరుగులకు ఆలౌట్ అయింది. మొమినుల్ హక్ (157 బంతుల్లో 84 పరుగులు ; 12 ఫోర్లు, 1 సిక్సర్) కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. ముష్ఫీకర్ రీమ్ (26 పరుగులు), లిటన్ దాస్ (25 పరుగులు), షాంటో (24 పరుగులు) ఫర్వాలేదన్పించారు.
భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ చెరో నాలుగు వికెట్లతో దుమ్మురేపారు. వీరిద్దరి ధాటికి మూడో సెషన్ లో బంగ్లా ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. ఇక, 12 ఏళ్ల తర్వాత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన జయదేవ్ ఉనాద్కత్ రెండు వికెట్లతో సత్తా చాటాడు. మహ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్ లకు వికెట్లు ఏం దక్కలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cheteswar Pujara, Cricket, IND vs BAN, India vs bangladesh, KL Rahul, Virat kohli