IND vs BAN 2nd ODI : బంగ్లాదేశ్ (Bangladesh)తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ (India) పీకల్లోతు కష్టాల్లో పడింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 272 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ 25 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లు నష్టపోయి 117 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో నెగ్గాలంటే భారత్ మిగిలిన 25 ఓవర్లలో 155 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ (69 బంతుల్లో 50 బ్యాటింగ్, 4 ఫోర్లు, 1 సిక్స్), అక్షర్ పటేల్ (19 బంతుల్లో 20 బ్యాటింగ్; 2 సిక్సర్లు) క్రీజులో ఉన్నారు. మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో తొలి వన్డేలో నెగ్గిన బంగ్లాదేశ్ ఆధిక్యంలో ఉంది. రెండో వన్డేలో భారత్ ఓడితే సిరీస్ బంగ్లాదేశ్ ఖాతాలోకి చేరుతుంది.
శిఖర్ మరోసారి
రోహిత్ శర్మ బొటనవేలికి గాయం కావడంతో అతడు బ్యాటింగ్ కు దిగలేదు. దాంతో శిఖర్ ధావన్ తో కలిసి విరాట్ కోహ్లీ ఓపెనర్ గా వచ్చాడు. అయితే వీరు భారత్ కు శుభారంభం అందించడంలో విఫలం అయ్యారు. కోహ్లీ (5), ధావన్ (8) నిరాశ పరిచారు. బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రమోషన్ పొందిన వాషింగ్టన్ సుందర్ (11) ఎక్కువ సేపు ఉండలేకపోయాడు. తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ (14) తొలి వన్డేలో కనబరిచిన ఫామ్ ను కొంటిన్యూ చేయలేకపోయాడు. అయితే మరో ఎండ్ లో ఉన్న శ్రేయస్ అయ్యర్ మాత్రం నిలకడగా ఆడుతున్నాడు. అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అక్షర్ పటేల్ తో కలిసి విజయం కోసం పోరాడుతున్నాడు. మహ్ముదాల్లా, మెదీ హసన్ ల మాదిరి వీరిద్దరూ పట్టుదలగా ఆడితే భారత్ గెలిచే అవకాశం ఉంది.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 271 పరుగులు చేసింది. తొలి వన్డే హీరో మెదీ హసన్ మిరాజ్ (83 బంతుల్లో 100 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) టీమిండియా బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. మహ్ముదుల్లా (96 బంతుల్లో 77; 7 ఫోర్లు) అర్ధ శతకంతో రాణించాడు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3 వికెట్లతో మెరిశాడు. సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ లు చెరో 2 వికెట్లు తీశారు.
మరోసారి దంచి కొట్టిన మెదీ హసన్
భారత బౌలర్లు ఆరంభంలో రెచ్చిపోవడంతో ఒక దశలో బంగ్లాదేశ్ 19 ఓవర్లలో 69 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో బంగ్లాదేశ్ 100 పరుగులు కూడా చేసేలా కనిపించలేదు. అయితే తొలి వన్డేలో బంగ్లాదేశ్ ను గెలిపించిన మెదీ హసన్ మిరాజ్ మరోసారి జట్టును ఆదుకున్నాడు. మహ్ముదుల్లాతో కలిసి బంగ్లాదేశ్ ను గాడిన పెట్టాడు. భారత్ పేలవ బౌలింగ్ కు తోడు.. కీలక సమయాల్లో క్యాచ్‌ల ను మిస్ చేయడం బంగ్లాదేశ్ కు కలిసి వచ్చింది. ఈ క్రమంలో వీరిద్దరూ ఆరంభంలో నెమ్మదిగా ఆడి.. కుదురుకున్నాక ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలో వీరిద్దరూ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 7వ వికెట్ కు ఏకంగా 148 పరుగులు జోడించారు. చివరకు మహ్ముదుల్లా ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. అయితే మరో ఎండ్ లో ఉన్న మెదీ హసన్ మాత్రం నసుం అహ్మద్ తో కలిసి మరింత దూకుడుగా ఆడాడు. వీరిద్దరూ చివరి 23 బంతుల్లోనే 54 పరుగులు జోడించారు. దాంతో బంగ్లాదేశ్ భారీ స్కోరును అందుకుంది. ఆఖరి బంతికి సింగిల్ తీసిన మెదీ హసన్ మిరాజ్ కెరీర్ లో తొలి అంతర్జాతీయ వన్డే సెంచరీని నమోదు చేశాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Axar Patel, IND vs BAN, India vs bangladesh, KL Rahul, Rohit sharma, Shreyas Iyer, Team India