IND vs BAN 2nd ODI : బంగ్లాదేశ్ (Bangladesh)తో డూ ఆర్ డై మ్యాచ్ కు భారత్ (India) సిద్ధమైంది. మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా ఆదివారం జరిగిన పోరులో భారత్ వికెట్ తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. సిరీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే రెండో వన్డేలో టీమిండియా (Team India) తప్పకుండా నెగ్గాల్సి ఉంది. ఒక వేళ ఓడితే మాత్రం సిరీస్ బంగ్లాదేశ్ ఖాతాలోకి వెళుతుంది. రెండు రోజుల విరామం తర్వాత మిర్పూర్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేకు అటు భారత్, ఇటు బంగ్లాదేశ్ లు సిద్ధమయ్యాయి. రెండో వన్డేలో గెలిచి సిరీస్ ను ఇక్కడే పట్టేయాలని బంగ్లాదేశ్ యోచిస్తుంటే.. తొలి వన్డేలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే కసి మీద భారత్ ఉంది. ఈ క్రమంలో బుధవారం జరిగే రెండో వన్డే ఆసక్తికరంగా జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ బుధవారం ఉదయం గం. 11.30లకు ఆరంభం కానుంది. సోనీ నెట్ వర్క్, సోని లివ్ లు ప్రత్యక్షప్రసారం చేయనున్నాయి.
ఇది కూడా చదవండి : మరో ధోని కావాల్సినవాడు.. కుళ్లు రాజకీయాలకు బలవుతున్నాడు! అతడెవరంటే?
ఒత్తిడిలో భారత్
తొలి వన్డేలో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో పేలవ ప్రదర్శన చేసిన భారత్ చేజేతులా ఓడింది. తొలుత బ్యాటింగ్ లో కేవలం 186 పరుగులే చేసింది. స్టార్ ప్లేయర్లు రోహిత్, ధావన్, కోహ్లీలు దారుణంగా విఫలం అయ్యరు. కేఎల్ రాహుల్ ఆడకపోయి ఉంటే భారత్ పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. అనంతరం బంగ్లాదేశ్ బ్యాటింగ్ కు దిగగా ఆరంభంలో భారత్ అద్భుతంగా బౌలింగ్ చేసింది. మొహమ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్ లు కీలక సమయాల్లో వికెట్లు తీసి భారత్ ను గెలుపు వైపు నడిపారు. బంగ్లాదేశ్ 136వ పరుగు వద్ద 9వ వికెట్ ను కోల్పోయింది. ఆ క్షణంలో భారత్ దే విజయం అని అంతా అనుకున్నారు. అయితే మెదీ హసన్ మిరాజ్ విరోచిత పోరాటంతో పాటు కేెల్ రాహుల్ క్యాచ్ డ్రాప్ చేయడం.. పేలవ బౌలింగ్ తో విజయాన్ని బంగారు పళ్లెంలో పెట్టి బంగ్లాదేశ్ కు అప్పగించింది భారత్. అయితే తొలి వన్డేలో చేసిన తప్పులను సరి చేసుకుని రెండో వన్డేలో రెచ్చిపోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది.
కుల్దీప్ సేన్ అవుట్!
తొలి వన్డేలో అరగేంట్రం చేసిన కుల్దీప్ సేన్ రెండు వికెట్లతో ఫర్వాలేదనిపించాడు. అయితే దారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. దాంతో రెండో వన్డేలో అతడిని పక్కనపెట్టే అవకాశం ఉంది. అలా అయితే ఉమ్రాన్ మాలిక్ బరిలోకి దిగే అవకాశం ఉంది. లేదు ఐదుగురు బౌలర్లతోనే ఆడాలనుకుంటే మాత్రం ఇషాన్ కిషన్ ను అవకాశం దొరికే ఛాన్స్ ఉంది. ఇక పక్కటెముకల గాయం నుంచి అక్షర్ పటేల్ కోలుకుని ఉన్నట్లయితే షాబాజ్ అహ్మద్ స్థానంలో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ రెండు మార్పులు మినహా తొలి వన్డేలో ఆడిన జట్టుతోనే భారత్ బరిలోకి దిగే అవకాశం ఉంది. దాంతో రాహుల్ త్రిపాఠి, రజత్ పటిదార్ లకు మరోసారి నిరాశ తప్పేలా లేదు.
టీమిండియా తుది జట్టు (అంచనా)
రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, కోహ్లీ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్/షెహ్బాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహమ్మద్ సిరాజ్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IND vs BAN, India vs bangladesh, KL Rahul, Mohammed Siraj, Rohit sharma, Shikhar Dhawan, Virat kohli