IND vs BAN 2nd ODI : టీమిండియా (Team India) కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) వీరోచిత పోరాటం ముందు బంగ్లాదేశ్ (Bangladesh) విజయం చిన్నబోయింది. ఒకవైపు గాయం నొప్పిని భరిస్తూనే టీమిండియా విజయం కోసం రోహిత్ శర్మ చివరి వరకు పోరాడాడు. సులభంగా గెలుస్తామని ధీమాాగా ఉన్న బంగ్లాదేశ్ ను ఆఖరి బంతి వరకు చుచ్చు పోయించాడు. ఒక దశలో రోహిత్ దెబ్బకు తాము ఓడిపోతామేమో అన్నట్లు బంగ్లాదేశ్ ఫ్యాన్స్ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చారు. భారత్ విజయం సాధించాలంటే ఆఖరి బంతికి సిక్సర్ కావాల్సిన తరుణంలో యార్కర్ వేసిన ముస్తఫిజుర్ ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. దాంతో బంగ్లాదేశ్ రెండో వన్డేలో 5 పరుగుల తేడాతో నెగ్గింది. సిరీస్ ను మరో మ్యచ్ మిగిలి ఉండగానే 2-0తో సొంతం చేసుకుంది. ఆఖర్లో విరోచిత పోరాటం చేసిన హిట్ మ్యాన్ రోహిత్ (28 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) అటు టీమిండియా అభిమానులతో పాటు క్రికెట్ ఆరాధించే వారి మనస్సులను గెలుచుకున్నాడు. 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 50 ఓవర్లకు 9 వికెట్లు నష్టపోయి 266 పరుగులు చేసింది.
ఇది కూడా చదవండి : టీమిండియా సకల దరిద్రాలకు కారణం ఇదే.. ఎప్పుడు మారుతుందో ఏంటో?
రోహిత్ శర్మ బొటనవేలికి గాయం కావడంతో అతడు ఆరంభంలో బ్యాటింగ్ కు దిగలేదు. దాంతో శిఖర్ ధావన్ తో కలిసి విరాట్ కోహ్లీ ఓపెనర్ గా వచ్చాడు. అయితే వీరు భారత్ కు శుభారంభం అందించడంలో విఫలం అయ్యారు. కోహ్లీ (5), ధావన్ (8) నిరాశ పరిచారు. బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రమోషన్ పొందిన వాషింగ్టన్ సుందర్ (11) ఎక్కువ సేపు ఉండలేకపోయాడు. తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ (14) తొలి వన్డేలో కనబరిచిన ఫామ్ ను కంటిన్యూ చేయలేకపోయాడు. అయితే శ్రేయస్ అయ్యర్ (82), అక్షర్ పటేల్ (51) భారత్ ను ఆదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్ కు 107 పరుగులు జోడించారు. దాంతో భారత్ మళ్లీ విజయం వైపు సాగింది. అయితే సెంచరీ హీరో మెదీ హసన్ శ్రేయస్ ను అవుట్ చేశాడు. కాసేపటికే అక్షర్ పటేల్ కూడా అవుటయ్యాడు.
రోహిత్ వీరోచిత పోరాటం
శార్దుల్ ఠాకూర్ (7) అవుటైన తర్వాత అనూహ్యంగా రోహిత్ శర్మ బ్యాటింగ్ కు వచ్చాడు. బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేసే సమయంలో అనముల్ హక్ క్యాచ్ పట్టే క్రమంలో రోహిత్ ఎడమ చేతి బొటన వేలికి గాయం అయ్యింది. అనంతరం అతడు ఆసుపత్రికి వెల్లి ఎక్స్ రే తీయించుకున్నాడు. అంతేకాకుండా బొటన వేలికి కట్టుకూడా కట్టించాడు. ఈ క్రమంలో అతడు బ్యాటింగ్ కు దిగడని అంతా అనుకున్నారు. అయితే జట్టుకు అవసరం అయినప్పుడు నొప్పిని కూడా భరిస్తూనే రోహిత్ బ్యాటింగ్ కు వచ్చాడు. బ్యాట్ హ్యాండిల్ ను సరిగ్గా పట్టుకోవాలంటే చేతి వేళ్లు చాలా కీలకం. అయితే రోహిత్ తన బొటన వేలికి కట్టు కట్టడంతో దానిని సరిగ్గా ఉపయోగించలేని పరిస్థితిలో కూడా బ్యాటింగ్ కు వచ్చాడు. ఆరంభంలో బంతిని కొట్టేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. అయితే ఎబాద్ వేసిన ఓవర్లో రెండు సిక్సర్లు ఒక ఫోర్ కొట్టి బంగ్లాదేశ్ ను వణికించాడు. ఇక మహ్ముదుల్లా వేసిన 49వ ఓవర్ లో రెండు సిక్సర్లతో 19 పరుగులు పిండుకున్నాడు. ఇక ఆఖరి ఓవర్ లో విజయానికి 20 పరుగులు అవసరం కాగా.. తొలి బంతిని ఆడలేకపోయాడు. ఆ తర్వాత వరుసగా రెండు ఫోర్లు బాదాడు. దాంతో ఆఖరి 3 బంతులకు 12 పరుగులు అవసరం అయ్యాయి. నాలుగో బంతికి ముస్తఫిజుర్ ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. ఇక ఐదో బంతికి రోహిత్ భారీ సిక్సర్ బాదాడు. ఫలితంగా బంగ్లాదేశ్ డగౌట్ లో ఆందోళన మొదలైంది. ఫ్యాన్స్ అయితే రోహిత్ దెబ్బకు ఎక్కడ తమ విజయం చేజారుతుందో అని ప్రార్దనలు మొదలు పెట్టేశారు. అయితే ఆఖరి బంతిని యార్కర్ వేసిన ముస్తఫిజుర్ బంగ్లాదేశ్ కు విక్టరీని ఖాయం చేశాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IND vs BAN, India vs bangladesh, Mohammed Siraj, Rohit sharma, Team India