IND vs BAN 2nd ODI : టీమిండియా (Team India) బౌలర్లకు బంగ్లాదేశ్ (Bangladesh) బ్యాటర్ మెదీ హసన్ మిరాజ్ (Mehidy Hasan Miraz) చుక్కలు చూపించాడు. తొలి వన్డేలో భారత్ నుంచి విజయాన్ని లాగేసుకున్న అతడు.. దానికి కొనసాగింపు అన్నట్లు రెండో వన్డేలో బ్యాటింగ్ చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 271 పరుగులు చేసింది. తొలి వన్డే హీరో మెదీ హసన్ మిరాజ్ (83 బంతుల్లో 100 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) టీమిండియా బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. మహ్ముదుల్లా (96 బంతుల్లో 77; 7 ఫోర్లు) అర్ధ శతకంతో రాణించాడు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3 వికెట్లతో మెరిశాడు. సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ లు చెరో 2 వికెట్లు తీశారు.
టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆరంభంలోనే సిరాజ్ అనముల్ హక్ (11), కెప్టెన్ లిట్టన్ దాస్ (7) వికెట్లను తీసి భారత్ కు అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు. ఆ తర్వాత షాంటో (21)ని ఉమ్రాన్ మాలిక్ అవుట్ చేశాడు. ఇక బౌలింగ్ కు వచ్చిన వాషింగ్టన్ సుందర్ వెంట వెంటనే మూడు వికెట్లు తీశాడు. షకీబుల్ హసన్ (8)తో పాటు రహీం (12), అఫిఫ్ (0)లను వరుస బంతుల్లో అవుట్ చేశాడు. దాంతో బంగ్లాదేశ్ 19 ఓవర్లలో 69 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో బంగ్లాదేశ్ 100 పరుగులు కూడా చేసేలా కనిపించలేదు.
మరోసారి దంచి కొట్టిన మెదీ హసన్
ఈ దశలో తొలి వన్డేలో బంగ్లాదేశ్ ను గెలిపించిన మెదీ హసన్ మిరాజ్ మరోసారి జట్టును ఆదుకున్నాడు. మహ్ముదుల్లాతో కలిసి బంగ్లాదేశ్ ను గాడిన పెట్టాడు. భారత్ పేలవ బౌలింగ్ కు తోడు.. కీలక సమయాల్లో క్యాచ్‌ల ను మిస్ చేయడం బంగ్లాదేశ్ కు కలిసి వచ్చింది. ఈ క్రమంలో వీరిద్దరూ ఆరంభంలో నెమ్మదిగా ఆడి.. కుదురుకున్నాక ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలో వీరిద్దరూ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 7వ వికెట్ కు ఏకంగా 148 పరుగులు జోడించారు. చివరకు మహ్ముదుల్లా ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. అయితే మరో ఎండ్ లో ఉన్న మెదీ హసన్ మాత్రం నసుం అహ్మద్ తో కలిసి మరింత దూకుడుగా ఆడాడు. వీరిద్దరూ చివరి 23 బంతుల్లోనే 54 పరుగులు జోడించారు. దాంతో బంగ్లాదేశ్ భారీ స్కోరును అందుకుంది. ఆఖరి బంతికి సింగిల్ తీసిన మెదీ హసన్ మిరాజ్ కెరీర్ లో తొలి అంతర్జాతీయ వన్డే సెంచరీని నమోదు చేశాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bangladesh, IND vs BAN, India vs bangladesh, KL Rahul, Mohammed Siraj, Rohit sharma, Shikhar Dhawan, Shreyas Iyer, Team India