IND vs BAN 1st ODI : బంగ్లాదేశ్ (Bangladesh)తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా (Team India) బొక్క బోర్లా పడింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన టీమిండియా బ్యాటింగ్ తొలి వన్డేలో చేతులెత్తేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 41.2 ఓవర్లలో 186 పరుగులకు కుప్పకూలింది. భారత్ తరఫున కేఎల్ రాహుల్ (70 బంతుల్లో 73; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మాత్రమే ఫర్వలేదనిపించాడు. కేఎల్ రాహుల్ ఆడకపోయి ఉంటే భారత్ పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. ప్రపంచకప్ తర్వాత టీమిండియాలోకి కమ్ బ్యాక్ చేసిన రోహిత్ శర్మ (27), కోహ్లీ (9) నిరాశ పరిచారు. శిఖర్ ధావన్ (7) మరోసారి విఫలం అయ్యాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబుల్ హసన్ 5 వికెట్లతో చెలరేగిపోయాడు. ఎబాదత్ 4 వికెట్లతో రాణించాడు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు శుభారంబం చేయలేకపోయారు. వన్డే సిరీస్ నుంచి రిషభ్ పంత్ తప్పుకోవడంతో.. కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు తీసుకున్నాడు. అయితే తొలి వన్డేలో రాహుల్ మిడిలార్డర్ లో ఆడటం విశేషం. ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మ తో పాటు శిఖర్ ధావన్ వచ్చారు. ఒత్తిడిలో ఉన్న ధావన్ విఫలం అయ్యాడు. ఇక 4 ఫోర్లు, 1 సిక్సర్ తో టచ్ లో కనిపించిన రోహిత్ శర్మ షకీబుల్ హసన్ బంతికి బౌల్డ్ అయ్యాడు. కాసేపటికే లిట్టన్ దాస్ పట్టిన అద్భుత క్యాచ్ కు కోహ్లీ కూడా పెవలియన్ కు చేరాడు. దాంతో భారత్ తీవ్ర కష్టాల్లో పడింది. ఈ దశలో కాసేపు బంగ్లాదేశ్ బౌలర్లను రాహుల్, శ్రేయస్ అయ్యర్ (24) ఆదుకున్నారు. వీరు నెమ్మదిగా ఆడుతు ఒక్కో పరుగు జోెడించారు. అయితే ఎబాదత్ వీరిని విడదీశాడు. శ్రేయస్ ను పెవిలియన్ కు చేర్చాడు. ఇక ఇక్కడి నుంచి భారత ఇన్నింగ్స్ గాడి తప్పింది.
రాహుల్ వీరోచిత పోరాటం
ఒక ఎండ్ లో వికెట్లు పడుతున్నా మరో ఎండ్ లో ఉన్న రాహుల్ ఒంటరి పోరాటం చేశాడు. క్లాస్ ఆటతో ఆదుకున్నాడు. బంగ్లాదేశ్ బౌలర్లకు మిగిలిన బ్యాటర్లు ఇబ్బంది పడుతుంటే రాహుల్ మాత్రం స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో మెరిశాడు. అయితే చివర్లో భారీ షాట్లు ఆడే ప్రయత్నంలో రాహుల్ పెవిలియన్ కు చేరాడు. ఆ తర్వాత భారత్ ఇన్నింగ్స్ ముగియడానికి ఎంతో సమయం పట్టలేదు.
తుది జట్లు :
టీమిండియా : రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ సేన్
బంగ్లాదేశ్ : లిటన్ దాస్, అన్మల్ హోక్, నజ్మల్ హోస్సేన్, షకీబ్ అల్ హసన్, ముష్ఫీకర్ రహీమ్, మహ్మదుల్లా, అఫిఫ్ హోస్సేన్, మెహదీ హసన్, హసన్ మహ్మద్, ముస్తఫిజుర్ రహ్మన్, ఎబాదోత్ హోస్సేన్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India vs bangladesh, KL Rahul, Rohit sharma, Shikhar Dhawan, Team India