IND vs BAN 1st ODI : బంగ్లాదేశ్ (Bangladesh)తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ (India) ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 41.2 ఓవర్లలో 186 పరుగులకు కుప్పకూలింది. భారత్ తరఫున కేఎల్ రాహుల్ (70 బంతుల్లో 73; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మాత్రమే ఫర్వలేదనిపించాడు. కేఎల్ రాహుల్ ఆడకపోయి ఉంటే భారత్ పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. ప్రపంచకప్ తర్వాత టీమిండియాలోకి కమ్ బ్యాక్ చేసిన రోహిత్ శర్మ (27), కోహ్లీ (9) నిరాశ పరిచారు. శిఖర్ ధావన్ (7) మరోసారి విఫలం అయ్యాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబుల్ హసన్ 5 వికెట్లతో చెలరేగిపోయాడు. ఎబాదత్ 4 వికెట్లతో రాణించాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ తొలి బంతికే షాంటో (0) వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వాత అన్ముల్ హక్ (14)ను సిరాజ్ పెవిలియన్ కు చేర్చాడు. ఆ తర్వాత లిట్టన్ దాస్, షకీబుల్ హసన్ లు నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు. అయితే 13వ ఓవర్ లో రోహిత్ శర్మ పట్టిన క్యాచ్ ను అంపైర్లు నాటౌట్ గా ప్రకటించారు.
13వ ఓవర్ ను షాబాజ్ అహ్మద్ వేయడానికి రాగా.. మూడో బంతికి లిట్టన్ దాస్ పూర్తిగా బీట్ అయ్యాడు. బంతి బ్యాట్ ఎడ్జ్ కు తాకుతూ మొదటి స్లిప్ లోకి వెళ్లింది. నేలను తాకుతుందన్న క్షణంలో రోహిత్ క్యాచ్ ను అందుకున్నాడు. అయితే క్యాచ్ విషయంలో సందేహం పడ్డ అంపైర్లు సాఫ్ట్ సిగ్నల్ గా నాటౌట్ అంటూ థర్డ్ అంపైర్ కు నివేదించారు. ఇక థర్డ్ అంపైర్ టీవీ రీప్లేలో పలుమార్లు పరిశీలించిన తర్వాత దానిని నాటౌట్ గా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. ఈ క్యాచ్ కు సంబంధించిన వీడియోను మీరే చూడండి.
Rohit sharma what a catch #rohitsharma pic.twitter.com/NiagNPW6n5
— Adnan Ansari (@AdnanAn71861809) December 4, 2022
బంతి నేలకు తాకుతుందన్న సమయంలో రోహిత్ తన కుడి చేతితో క్యాచ్ ను అందుకున్నాడు. బాల్ రోహిత్ చేతిలోకి చేరేకంటే ముందే నేలకు తాకినట్లు కనిపిస్తున్నా.. రోహిత్ బాల్ కింద తన వేళ్లను ఉంచినట్లు కనిపిస్తుంది. అయితే ఫీల్డ్ అంపైర్లు సాఫ్ట్ సిగ్నల్ ను నాటౌట్ గా ప్రకటించడంతో థర్డ్ అంపైర్ కూడా అదే నిర్ణయాన్ని ప్రకటించాడు.
రాహుల్ వీరోచిత పోరాటం
ఒక ఎండ్ లో వికెట్లు పడుతున్నా మరో ఎండ్ లో ఉన్న రాహుల్ ఒంటరి పోరాటం చేశాడు. క్లాస్ ఆటతో ఆదుకున్నాడు. బంగ్లాదేశ్ బౌలర్లకు మిగిలిన బ్యాటర్లు ఇబ్బంది పడుతుంటే రాహుల్ మాత్రం స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో మెరిశాడు. అయితే చివర్లో భారీ షాట్లు ఆడే ప్రయత్నంలో రాహుల్ పెవిలియన్ కు చేరాడు. ఆ తర్వాత భారత్ ఇన్నింగ్స్ ముగియడానికి ఎంతో సమయం పట్టలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IND vs BAN, India vs bangladesh, Rohit sharma, Team India, Virat kohli