• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • IND VS AUS RAVI SHASTRI PRAISES CRICKETER HARDIK PANDYA INDIA VS AUSTRALIA SERIES SRD

Ind vs Aus : హార్దిక్ పాండ్యా తర్వాతే ఎవరైనా.. టీమిండియా ఆల్ రౌండర్ పై రవిశాస్త్రి ప్రశంసల జల్లు

Ind vs Aus : హార్దిక్ పాండ్యా తర్వాతే ఎవరైనా.. టీమిండియా ఆల్ రౌండర్ పై రవిశాస్త్రి ప్రశంసల జల్లు

ravi sastry on hardik (ఫైల్ పోటో)

Ind vs Aus : హార్దిక్ పాండ్య, నటరాజన్ ల ప్రదర్శనపై టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల జల్లు కురిపించాడు. ముఖ్యంగా పాండ్యా సహజమైన ఆటతో ఆకట్టుకున్నాడని తెలిపాడు.

  • Share this:
    వన్డే సిరీస్ లో ఓటమికి టీ-20 సిరీస్ గెలుపు ద్వారా ఆస్ట్రేలియాపై బదులు తీర్చుకుంది టీమిండియా. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై బదులు తీర్చుకున్న భారత్‌ ప్రస్తుతం టెస్టు సిరీస్‌కు సన్నద్ధమవుతోంది. అయితే వన్డే, టీ20 సిరీస్‌లో అద్భుతంగా రాణించిన ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ప్రస్తుతం జట్టుతో లేడు. ఈ విషయాన్ని కాసేపు పక్కనపెడితే.. ఆసీస్‌తో జరిగిన పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియా విజయాల్లో హార్దిక్‌ పాండ్యా, నటరాజన్‌ కీలక పాత్ర పోషించారు. మూడో వన్డేలో చెలరేగి ఆడిన పాండ్యా.. 76 బంతుల్లో ఏడు బౌండరీలు, ఒక సిక్స్‌తో 92 పరుగులు సాధించాడు. తద్వారా తన వన్డే కెరీర్‌లో అత్యధిక స్కోరు నమోదు చేశాడు. ఇక వన్డే సిరీస్‌లో మొత్తంగా 210 పరుగులు చేసిన ఈ ఆల్‌రౌండర్‌.. టీ20లోనూ అదే జోరును కొనసాగించి ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు. ఇక లెఫ్టార్మ్‌ ఫాస్ట్‌బౌలర్‌ నటరాజన్‌ అరంగేట్రంలో రెండు వికెట్లు తీసి సత్తా చాటాడు.

    అదే విధంగా టీ20 సిరీస్‌లో మొత్తంగా ఆరు వికెట్లు(3,2,1) తీసి అద్భుత ప్రదర్శనతో అందరి చేతా ప్రశంసలు అందుకుంటున్నాడు. పాండ్యా సైతం తన దృష్టిలో మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌కు అతడే అర్హుడంటూ అభిమానం చాటుకున్నాడు. వీళ్లిద్దరి ప్రదర్శనపై టీమిండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడుతూ.. ప్రశంసలు కురిపించాడు. ‘‘రోహిత్‌, బుమ్రా లేకుండా టీ20 సిరీస్‌ గెలవడమనేది అతి పెద్ద విజయంగా భావించాల్సి ఉంటుంది. జట్టు మొత్తం ఎంతో బాధ్యతగా ఆడింది.

    ముఖ్యంగా హార్దిక్‌ పాండ్యా సహజమైన ఆటతో ఆకట్టుకున్నాడు. అతడి తర్వాతే ఎవరైనా. ఈ సిరీస్‌లో బంతిని అత్యంత అద్భుతంగా స్ట్రైక్‌ చేసింది అతడే’’ అని కొనియాడాడు. అదే విధంగా నటరాజన్‌ గురించి చెబుతూ.. ‘‘తనను నెట్‌ బౌలర్‌గా తీసుకున్నాం. తనకు వచ్చిన అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నాడు. అయితే అతడిపై నమ్మకం ఉంచిన టీం మేనేజ్‌మెంట్‌కే ఆ క్రెడిట్‌ దక్కుతుంది. తనలో విశ్వాసం నింపిన విధానం అమోఘం. తన సుదీర్ఘ ప్రయాణానికి ఇదో మంచి ఆరంభం’’ అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.
    Published by:Sridhar Reddy
    First published:

    అగ్ర కథనాలు