భారత్ - ఆస్ట్రేలియా సిరీస్ లో జనవరి 15 నుంచి జరగాల్సిన ఆఖరి టెస్ట్ పై నీలినీడలు కమ్ముకున్నాయ్. న్యూ సౌత్‌వేల్స్, క్వీన్స్‌లాండ్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో అక్కడి ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేస్తుంది. సరిహద్దులన్నిటిని మూసివేసింది. ఈ నిబంధనల ప్రకారం మరోసారి టీమిండియా ఆటగాళ్లు 14 రోజుల క్వారంటైన్ లో ఉండాల్సి ఉంది. ఈ ప్రతిపాదనను క్రికెట్ ఆస్ట్రేలియా, టీమిండియా ముందుంచింది. అయితే, టీమిండియా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్వారంటైన్ ఉండలేమని స్పష్టం చేసింది. ఇప్పటికే నెల రోజుల పాటు క్వారంటైన్ లో ఉన్నామని.. మరోసారి ఐసోలేషన్ అంటే కష్టమేనని బీసీసీఐ అధికారి తెలిపారు. ‘బ్రిస్బెన్ వెళ్లి అక్కడ మళ్లీ బయో బబుల్‌లో ఉండటానికి టీమిండియా ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికే దుబాయ్‌లో 14 రోజుల క్వారంటైన్ ఉన్నాం. ఆ తర్వాత సిడ్నీలో మరో 14 రోజులు స్వీయ నిర్భంధంలోనే ఉన్నాం. దాదాపు నెలరోజుల పాటు హోటల్ గదిలోనే ఉండిపోయాం. మళ్లీ ఇప్పుడు క్వారంటైన్లో ఉండాలంటే మా వల్ల కాదు. అది టూర్ ముగిసే సమయంలో ఏమాత్రం భావ్యం కాదు'అని సదరు అధికారి స్పష్టం చేశాడు.
అయితే, భారత జట్టు విన్నపంపై క్వీన్స్లాండ్ ఆరోగ్యశాఖ మంత్రి రోస్ బేట్స్ ఘాటుగా స్పందించింది. ‘భారత ఆటగాళ్లకు నిబంధనలకు అనుగుణంగా ఆడాలని లేకుంటే.. ఇక్కడికి రావద్దు'అని స్పష్టం చేసింది. ఓ చానెల్‌తో మాట్లాడుతుండగా టీమిండియా క్వారంటైన్‌కు సుగుమంగా లేదని ఆమె ముందు ప్రస్తావించగా ఈ విధంగా బదులిచ్చింది. క్వారంటైన్ ఉండాలని లేకుంటే భారత ఆటగాళ్లు ఇక్కడికి రావద్దని ఆ రాష్ట్ర క్రీడా శాఖ మంద్రి టిమ్ మండెర్ అన్నాడు. నిబంధనలు అందరికి వర్తిస్తాయని, టీమిండియా కోసం ప్రత్యేకంగా వాటిని సడలించలేమన్నాడు.
ఒకవేళ క్వీన్స్‌ల్యాండ్ ప్రభుత్వం ఇండియన్ టీమ్‌కు క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇవ్వకపోతే.. సిడ్నీలోనే నాలుగో టెస్ట్ కూడా జరిగే అవకాశాలు ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇండియన్ టీమ్ మాత్రం ఈ నిబంధనలను అంగీకరించే పరిస్థితులు కనిపించడం లేదు. ఆరు నెలలుగా కరోనా మహమ్మారి సమయంలోనూ విదేశీ టూర్లలో తమ టీమ్‌తో ఎలాంటి సమస్యలు రాలేదని, ఈ విషయాన్ని గమనించాలని టీమిండియా అధికారి అంటున్నారు. మరి క్రికెట్ ఆస్ట్రేలియా దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Published by:Sridhar Reddy
First published:January 03, 2021, 17:22 IST