పెటర్నటీ లీవ్ మీద భారత్ కు తిరిగొచ్చాడు విరాట్ కోహ్లీ. రెండో టెస్ట్ లో టీమిండియాకు అజింక్య రహనే కెప్టెన్సీ బాధ్యతలు వహిస్తున్నాడు. అయితే, విరాట్ కోహ్లీ గైర్హాజరీలో టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న అజింక్య రహానే తన వ్యక్తిత్వం, శైలిని మార్చుకోవాల్సిన అవసరం లేదని భారత మాజీ క్రికెటర్, ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ అన్నాడు. కెప్టెన్సీలో ఎవరి ప్రత్యేకత వారికి ఉంటుందన్నాడు. సౌరవ్ గంగూలీలా ఎంఎస్ ధోనీ.. ఎంఎస్ ధోనీలా విరాట్ కోహ్లీ.. విరాట్ కోహ్లీలా అజింక్య రహానే జట్టును నడిపించలేరని గౌతీ చెప్పుకొచ్చాడు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటూనే జట్టును దూకుడుగా నడిపించవచ్చని రహానేకు సూచించాడు. గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ... 'రాత్రికి రాత్రే మన వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఎంతో మంది కెప్టెన్లు వారి ప్రత్యేక శైలితో జట్టును అద్భుతంగా నడిపించారు. అజింక్య రహానే.. విరాట్ కోహ్లీలా కాలేడు. ఎంఎస్ ధోనీలా విరాట్ కోహ్లీ చేయలేడు. అలాగే సౌరవ్ గంగూలీలా ఎంఎస్ ధోనీ ఉండలేడు. అయినా వాళ్లంతా విజయవంతమైన సారథులు. అయితే రహానే మాత్రం ఒక మార్పు చేయాలి. అతడు నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు రావాలి. అక్కడ అద్భుతంగా రాణిస్తాడని నమ్ముతున్నా. జట్టు బాధ్యతలు మోస్తున్నాని అందరికీ సందేశాన్ని ఇవ్వాలి' అని అన్నాడు.
మైదానంలో భావోద్వేగాలు చూపిస్తేనే.. దూకుడుగా జట్టును నడిపించినట్లు కాదని, ఫీల్డింగ్ మోహరించడంలో, బౌలర్లను మార్చడంలోనూ దూకుడు ఉంటుందని ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు. 'మైదానంలో ఎంఎస్ ధోనీ భావోద్వేగాలు అసలు చూపించడు. సౌరవ్ గంగూలీ కాస్త ఎమోషనల్ అవుతాడు. విరాట్ కోహ్లీ ఎక్కువగా తన భావోద్వేగాన్ని ప్రదర్శిస్తాడు. అనిల్ కుంబ్లే తన కెప్టెన్సీని దూకుడుగా నిర్వర్తించాడు. రాహుల్ ద్రవిడ్ తనదైన శైలిలో జట్టును నడిపించాడు. ఫీల్డర్లను మోహరించడం, లక్ష్యాన్ని ఛేజింగ్ చేయడంలో తన ప్రత్యేకత చాటుకున్నాడు. కాబట్టి అజింక్య రహానే తన స్టైల్‌ను మార్చుకోవాల్సిన అవసరం లేదు' అని గౌతీ సూచించాడు.
ఆస్ట్రేలియాతో జరగనున్న రెండో టెస్టు తుది జట్టులో చోటు సంపాదించిన యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ గురించి గంభీర్ మాట్లాడాడు. 'గిల్‌కు అవకాశాలు ఇస్తూ ప్రోత్సహించాలి. రోహిత్ శర్మ తుది జట్టులోకి వచ్చినా బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులతో గిల్‌ను కొనసాగించాలి. ఎంఎస్ ధోనీ సారథ్యంలో రోహిత్, కోహ్లీకి అవకాశాలు ఇచ్చినట్లుగా గిల్‌ను మెరుగైన ఆటగాడిగా తీర్చిదిద్దాలి' అని చెప్పుకొచ్చాడు.
పితృత్వ సెలవులపై విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా నుంచి భారత్ వచ్చాడు. కోహ్లీ సతీమణి అనుష్క శర్మ వచ్చే ఏడాది జనవరి ఆరంభంలో తొలి బిడ్డకి జన్మనివ్వబోతుండటంతో.. ఆస్ట్రేలియా పర్యటన నుంచి మధ్యలోనే విరాట్ ఇండియాకి వచ్చేశాడు. కోహ్లీ గైర్హాజరీతో భారత టెస్టు జట్టు కెప్టెన్సీ బాధ్యతలను రహానే అందుకున్నాడు. కోహ్లీ గైర్హాజరీలో రహానే ఇప్పటివరకు రెండు టెస్టులకు కెప్టెన్సీ చేయగా.. రెండింట్లోనూ భారత్ విజయం సాధించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gautam Gambhir, IND vs AUS, India vs Australia 2020, Kohli, Virat kohli