IND VS AUS CHETESHWAR PUJARA FACED MOST BALLS IN TEST CRICKET VS AUSTRALIA IN THE PAST DECADE SRD
Ind vs Aus : అసలు సిసలు టెస్ట్ క్రికెట్ అంటే ఏంటో చూపించిన పుజారా.. ఆసీస్ బౌలర్లకు చుక్కలు
Cheteshwar Pujara
Ind vs Aus : టెస్టు మ్యాచ్ కు సరైన నిర్వచనం చెప్పాడు నయావాల్ పుజారా. ఆధునిక క్రికెట్ కొత్త పుంతలు తొక్కుతున్నా.. సంప్రదాయ ఫార్మాట్ లో ఎలా ఆడాలో మరోసారి చూపాడు ఈ టెస్ట్ స్పెషలిస్ట్. నత్త నడకన తన ఇన్నింగ్స్ ను సాగిస్తూ.. ఆస్ట్రేలియా బౌలర్లకు చిరాకు తెప్పించాడు.
టెస్టు మ్యాచ్ కు సరైన నిర్వచనం చెప్పాడు నయావాల్ పుజారా. ఆధునిక క్రికెట్ కొత్త పుంతలు తొక్కుతున్నా.. సంప్రదాయ ఫార్మాట్ లో ఎలా ఆడాలో మరోసారి చూపాడు ఈ టెస్ట్ స్పెషలిస్ట్. నత్త నడకన తన ఇన్నింగ్స్ ను సాగిస్తూ.. ఆస్ట్రేలియా బౌలర్లకు చిరాకు తెప్పించాడు. టీమిండియా క్రికెట్లో మాజీ ఓపెనర్ సునీల్ గవాస్కర్ తర్వాత జిడ్డు క్రికెట్‌కు పెట్టింది పేరు మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్. ద్రవిడ్ తన 16 ఏళ్ల కెరీర్లో టెస్టు క్రికెట్లో డిఫెన్స్ అనే పదానికి సరికొత్త నిర్వచనం చెప్పాడు. తన జిడ్డు ఇన్నింగ్స్‌లతో ఎన్నో విజయాలు, మరెన్నోసార్లు జట్టును ఓటమి నుంచి కూడా తప్పించాడు. అందుకే 'ది వాల్'' అనే బిరుదు సంపాదించాడు. ద్రవిడ్ తరహాలోనే టీమిండియాకు మరో వాల్‌గా తయారయ్యాడు చటేశ్వర్ పుజారా. టెస్టు స్పెషలిస్ట్‌గా ముద్ర పడిన పుజారా అనతికాలంలోనే మంచి పేరు సంపాదించాడు. అద్భుత ఇన్నింగ్స్‌లతో భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. అదే సమయంలో ఓటమి నుంచి కూడా జట్టును బయటపడేశాడు.
సహచర బ్యాట్స్‌మన్ పెవిలియన్ చేరినా.. ఒంటరిగా పోరాటం చేస్తూ జట్టుకు విలువైన పరుగులు చేశాడు. తాజాగా అడిలైడ్ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులోనూ పుజారా తన మార్క్ చూపించాడు. పుజారా ఇన్నింగ్స్ చూస్తే ఎవరికైనా మతిపోతుంది. టెస్టు క్రికెట్ అంటే ఎలా ఉంటుందో ఆసీస్ ఆటగాళ్లకు చూపించాడు. స్కోరుబోర్డుపై ఒక్క పరుగు కూడా నమోదవ్వకుండానే ఓపెనర్ పృథ్వీ షా డకౌట్‌గా వెనుదిరిగాడు. టీమిండియా స్కోరు సున్నా పరుగుల వద్ద ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన చటేశ్వర్ పుజారా ఎంతో ఓపికగా ఆడాడు. 147 బంతుల ఎదుర్కొని ఒక్క బౌండరీ కూడా లేకుండా 30 పరుగులు చేశాడు. బహుశా తన కెరీర్లో అత్యంత నెమ్మదైన ఇన్నింగ్స్ ఇదే కావడం విశేషం. అయితే ఇలా ఆడడంలో పుజారా తప్పు లేదు. పిచ్ పరిస్థితి బౌలర్లకు అనుకూలంగా ఉండడంతో నత్తనడకన ఇన్నింగ్స్ కొనసాగించాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి జట్టును ఆదుకున్నాడు. చివరకు 160 బంతుల్లో రెండు బౌండరీల సాయంతో 43 రన్స్ చేసి ఔట్ అయ్యాడు.
తొలిరోజు ముగిసేసరికి భారత్ 89 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. క్రీజులో సాహా (9), అశ్విన్ (15) ఉన్నారు. గత దశాబ్దంలో ఆస్ట్రేలియాపై టెస్ట్ క్రికెట్లో అత్యధిక బంతులు ఎదుర్కొన్న ఆటగాడి జాబితాలో చటేశ్వర్ పుజారా మొదటి స్థానంలో ఉన్నాడు. పుజారా 28 ఇన్నింగ్స్‌లలో 3609 బంతులు ఆడాడు. 46 ఇన్నింగ్స్‌లలో జో రూట్ 3607 బంతులు ఎదుర్కొన్నాడు. అలిస్టర్ కుక్ 40 ఇన్నింగ్స్‌లలో 3274 బంతులు, 35 ఇన్నింగ్స్‌లలో విరాట్ కోహ్లీ 3115 బంతులు ఆడాడు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.