Ind vs Aus 2020 : పింక్ టెస్ట్ లో ఆస్ట్రేలియా కంగారు..చరిత్రలో తొలిసారి ఇలా..

India vs Australia

Ind vs Aus 2020 : డే/నైట్‌ టెస్టులు ఆడటం ఆస్ట్రేలియాకు కొట్టిన పిండి. గులాబి బంతితో ఆడిన ప్రతిసారీ గెలుపు వారినే వరించింది. ఏడుసార్లు ఆడితే ఏడింట్లోనూ విక్టరీ కొట్టింది. టాస్‌ ఎవరు గెలిచినా, తొలుత బ్యాటింగ్‌ ఎవరు చేసినా తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం మాత్రం వారిదే. అలాంటిది తొలిసారిగా గులాబీ బంతి దెబ్బకి వెనుకడుగు వేసింది ఆస్ట్రేలియా టీమ్.

  • Share this:
    డే/నైట్‌ టెస్టులు ఆడటం ఆస్ట్రేలియాకు కొట్టిన పిండి. గులాబి బంతితో ఆడిన ప్రతిసారీ గెలుపు వారినే వరించింది. ఏడుసార్లు ఆడితే ఏడింట్లోనూ విక్టరీ కొట్టింది. టాస్‌ ఎవరు గెలిచినా, తొలుత బ్యాటింగ్‌ ఎవరు చేసినా తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం మాత్రం వారిదే. అలాంటిది తొలిసారిగా గులాబీ బంతి దెబ్బకి వెనుకడుగు వేసింది ఆస్ట్రేలియా టీమ్. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టు (డే/నైట్)లో ఆస్ట్రేలియా తొలి ఇన్సింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్సింగ్స్‌లో భారత జట్టు 244 పరుగులకు ఆలౌట్ అయిన తర్వాత ఇన్సింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. భారత బౌలర్ల దెబ్బకు కకావికలైంది. రవిచంద్రన్ అశ్విన్, బుమ్రా, ఉమేశ్ యాదవ్ విసిరిన బంతులకు ఎదురొడ్డలేక ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ వికెట్లను సమర్పించుకున్నారు. ఒకరి తర్వాత ఒకరిగా పెవిలియన్‌కు క్యూకట్టారు. ఫలితంగా 72.1 ఓవర్లలో 191 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఇన్సింగ్స్ ముగిసింది.

    డే/నైట్ టెస్టులో ప్రత్యర్థి జట్టుపై ఆస్ట్రేలియా ఆధిక్యం సాధించకపోవడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు ఏడుసార్లు డే/నైట్ టెస్టుల్లో తలపడిన ఆస్ట్రేలియా వరుసగా 22, 124, 287, 215, 179, 287, 250 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. కానీ ప్రస్తుత మ్యాచ్‌లో మాత్రం ప్రత్యర్థి జట్టు కంటే 53 పరుగుల ముందే ఆసీస్ ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా జట్టు 2015 నుంచి గులాబి టెస్టులు ఆడుతోంది. న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌పై రెండుసార్లు గెలిచింది. ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా, శ్రీలంకనూ మట్టికరిపించింది. ఈ మ్యాచుల్లో తొలి ఇన్నింగ్సుల్లో ఆధిక్యం ఎప్పుడూ కంగారూలకే లభించేది.

    ఇక ఈ మ్యాచ్ లో రవిచంద్రన్‌ అశ్విన్ (18-3-55-4) అద్భుత బౌలింగ్‌కు తోడు ఉమేశ్‌ యాదవ్‌ (16.1-5-40-3), జస్ప్రీత్‌ బుమ్రా (21-7-52-2) భారీ దెబ్బకొట్టడంతోనే కంగారూలకు తొలిసారి ‘పింక్‌’ చుక్కలు కనిపించాయి. స్వల్పమే అని భావించిన టీమ్‌ఇండియా స్కోరు (244)ను వారు దాటలేకపోయారు. ఓపెనర్లిద్దరినీ బుమ్రా ఔట్‌ చేయడం.. స్టీవ్‌స్మిత్‌, ట్రావిస్‌ హెడ్‌, కామెరాన్‌ గ్రీన్‌ వంటి మేటి ఆటగాళ్లను యాష్‌ పెవిలియన్‌ పంపించడంతోనే ఇది సాధ్యమైంది. వీరికి తోడుగా మహ్మద్‌ షమి వికెట్లేమీ తీయకపోయినా అత్యంత కట్టుదిట్టమైన బంతులు, లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బెంబేలెత్తించాడు. ఇక ఆసియా ఆవల అశ్విన్‌కు ఇవి మూడో అత్యుత్తమ గణాంకాలు కావడం ప్రత్యేకం.
    Published by:Sridhar Reddy
    First published: